Skip to main content

ఆస్ట్రేలియా.. అకడమిక్ అవకాశాలకు వేదిక

విద్యా ప్రమాణాలు, విభిన్న కోర్సులు అభ్యసించే అవకాశం ఆస్ట్రేలియాలో ఉందంటున్నారు అక్కడి డీకిన్ యూనివర్సిటీ డీన్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గయ్ లిటిల్‌ఫెయిర్.
రోల్స్ రాయిస్, టయోటా, ల్యాండ్ రోవర్ వంటి పలు ఆటోమొబైల్ సంస్థల ఉత్పత్తుల ఆవిష్కరణల్లో పాల్పంచుకున్న ప్రొఫెసర్ గయ్ లిటిల్ ఫెయిర్‌తో ఆస్ట్రేలియాలో విద్యావకాశాలు, విద్యార్థులు అందిపుచ్చుకోవాల్సిన నైపుణ్యాలపై గెస్ట్ కాలమ్..

గత రెండు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో విద్యనభ్యసిస్తున్న భారతీయలు అధిక శాతం ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల ఔత్సాహికులే. అయితే ఈ రెండు విభాగాలతోపాటు మరెన్నో ట్రేడ్ మార్క్ కోర్సులకు ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీలు వేదికలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా హాస్పిటాలిటీ, నర్సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి సర్వీస్ సెక్టార్ సంబంధిత కోర్సుల్లో ఆరు నెలల నుంచి రెండేళ్ల వ్యవధిలో డిప్లొమా - ఎంఎస్ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటికి అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థల గుర్తింపు కూడా ఉంది. కాబట్టి సర్టిఫికెట్ల వ్యాలిడిటీ, ఉన్నత విద్య-ఉద్యోగ అవకాశాల గురించి ఆందోళన అనవసరం.

భారతీయ విద్యార్థుల పెరుగుదల:
ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2013లో ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం వీసా నిబంధనలు సులభం చేయడం, స్టడీ అండ్ వర్క్ అవకాశం పెంచడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. ఏటా దాదాపు ఆస్ట్రేలియాలో 25 వేల మంది విద్యార్థులు చదువుకుంటుండగా.. డీకిన్ యూనివర్సిటీలో 1130 మంది భారతీయ విద్యార్థులు పలు కోర్సులు అభ్యసిస్తున్నారు.

భారతీయులకు ప్రోత్సాహం:
భారతీయ విద్యార్థుల్లో కనిపిస్తున్న ప్రధాన సమస్య ప్రయోగాత్మక దృక్పథం లోపించడమే. థియరీ క్రెడిట్స్ విషయంలో ఇతర విద్యార్థులతో దీటుగా రాణిస్తూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ ప్రాక్టికాలిటీలో కొంత వెనుకంజలో ఉంటున్నారు. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ కార్యకలాపాల్లో భాగంగా భారతీయ విద్యార్థులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాం. వారిని పలు ఇంటర్న్, స్పాన్సర్డ్ రీసెర్చ్‌లలో పాల్పంచుకునేలా ప్రోత్సహిస్తున్నాం.

రీసెర్చ్ ఓరియెంటేషన్ పెరగాలి:
విద్యార్థులు అకడమిక్ పరంగా మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాలంటే రీసెర్చ్ ఓరియెంటేషన్ పెరగాలి. ఇది కేవలం ఇంజనీరింగ్ కోర్సులకే పరిమితం కాకుండా హాస్పిటాలిటీ వంటి సర్వీస్ సెక్టార్ కోర్సుల్లోనూ మంచి భవిష్యత్తుకు పునాదిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ, అకడమిక్ వర్గాలను అనుసంధానం చేస్తూ సంయుక్త ఆర్ అండ్ డీ కార్యకలాపాలు నిర్వహించి వాటిలో విద్యార్థులు పాల్పంచుకునేలా చేస్తే అద్భుత నైపుణ్యాలు లభిస్తాయి.

సంయుక్తంగా ముందుకు:
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే కోణంలో ఉపయోగపడే మరో ముఖ్య సాధనం గ్లోబల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్. డీకిన్ యూనివర్సిటీ.. ఐఐటీ ఢిల్లీ, ఖరగ్‌పూర్, హైదరాబాద్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లతో గ్లోబల్ అకడమిక్ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సైయంట్ టెక్నాలజీస్‌తో ఇంజనీరింగ్ టూల్స్‌కు సంబంధించి ఒప్పందానికి ప్రధాన కారణం భారత్‌లోని టాలెంట్‌ను గుర్తించడమే. ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌లో కొంత సమస్య ఉన్నప్పటికీ అకడమిక్ నైపుణ్యాలు మాత్రం అపారంగా ఉంటున్నాయి.

ఏడాది ముందుగా కసరత్తు:
యూనివర్సిటీలు, వాటి అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లు కలిపి మొత్తం 1200కుపైగా ఉన్న అకడమిక్ ఎవెన్యూస్‌లో తమ అర్హతలకు సరితూగే, తమకు నచ్చిన కోర్సులో మెరుగైన ఇన్‌స్టిట్యూట్‌లను అన్వేషించడానికి ఏడాది ముందు నుంచి కసరత్తు ప్రారంభించాలి.

స్కాలర్‌షిప్ సదుపాయాలు కూడా:
కామన్వెల్త్ స్కాలర్‌షిప్స్, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్‌తోపాటు ఆయా యూనివర్సిటీలు సొంత గా అందించే స్కాలర్‌షిప్‌లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది తొలి సెమిస్టర్/ట్రైమిస్టర్‌లో చూపిన అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఉంటుంది. ఆర్థిక చేయూత కోరుకునే విద్యార్థులకు టీచింగ్, రీసెర్చ్ అసిస్టెన్స్ వంటి అవకాశాలు ఉన్నాయి. తమ విభాగంలోని ప్రొఫెసర్లు, డీన్లు చేసే రీసెర్చ్ కార్యకలాపాల్లో సహాయకులుగా పనిచేస్తూ నిర్ణీత మొత్తంలో లబ్ధి పొందొచ్చు.

కొత్త టెక్నాలజీపై దృష్టి పెట్టాలి:
సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు తమ కోర్ సబ్జెక్ట్స్‌లలో వస్తున్న కొత్త టెక్నాలజీలపై దృష్టి పెట్టి, వాటిలో నైపుణ్యం పొందే విధంగా వ్యవహరించాలి. విదేశీ విద్య ఔత్సాహికులు ఆయా దేశాల్లోని ప్రామాణిక ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలుసుకోవడంతోపాటు, అక్కడి సాంఘిక-సామాజిక, సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పొందితే.. త్వరగా ఇమిడిపోయి, అన్ని విధాలుగా రాణించేందుకు వీలు లభిస్తుంది.
Published date : 29 May 2015 02:35PM

Photo Stories