Skip to main content

ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటించాలి

‘అమెరికాలో విద్య కోసం వెళ్తున్న విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ అధికారుల విచారణ సమయంలో.. ఉన్నత విద్యే లక్ష్యమనే భావన ప్రస్ఫుటించేలా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి’ అని అమెరికాలోని పాన్ - ఐఐటీ పూర్వ విద్యార్థుల సంఘం మిషిగాన్ చాప్టర్ డెరైక్టర్ రాజేశ్ రాధాకృష్ణన్ సూచిస్తున్నారు. ఐఐటీ ముంబై నుంచి బీటెక్, నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలోని కెలాగ్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆయన డెలాయిట్, ఎల్ అండ్ టీ, వంటి సంస్థల్లో కార్పొరేట్ స్ట్రాటజీ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం పలు సంస్థల్లో స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగాలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న రాజేశ్‌రాధాకృష్ణన్‌తో గెస్ట్ కాలమ్...
అమెరికాలో ఉన్నత విద్యపై ఇటీవలకాలంలో బాగా చర్చ జరుగుతోంది. కానీ, దశాబ్దాల క్రితమే అమెరికాలో ఉన్నత విద్యను లక్ష్యంగా పెట్టుకుని, సాధించిన భారతీయ విద్యార్థులు ఎందరో! అయితే ఇటీవలకాలంలో ప్రసార సాధనాలు, ఇతర మాధ్యమాల ద్వారా అమెరికా అవకాశాలపై అవగాహన పెరిగింది. అప్పట్లో ఐఐటీ, ఐఐఎం వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు లేదా ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాల విద్యార్థులకే అవగాహన ఉండేది. ప్రస్తుతం టైర్ - 2 నగరాలు, పట్టణాలకు విస్తరించింది.

అవకాశాలు అపారం
అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌లు భారతీయ విద్యార్థులకు అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. విద్యార్థులకు ఆర్థిక వనరులు సక్రమంగా లభించటంతోపాటు భారతీయుల్లో కష్టపడే తత్వం ఉంటుందనే అభిప్రాయం ఉండటం.. వీటికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొత్తగా ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌లు విద్యార్థులను ఆకర్షించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యూనివర్సిటీల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అక్రెడిటేషన్ వెబ్‌సైట్‌లోనూ అమెరికాలోని విద్యా సంస్థల నియంత్రణ విభాగాలు, వాటి పరిధిలోని కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల జాబితా లభిస్తుంది. వాటి ఆధారంగా తాము ఎంపిక చేసుకున్న ఇన్‌స్టిట్యూట్ లేదా కోర్సుకున్న గుర్తింపుపై అవగాహన ఏర్పరచుకోవాలి.

సమాధానాలు స్పష్టంగా..
అమెరికాలో ఉన్నత విద్య దిశగా అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ (ఐ-20) పొందిన తర్వాత, దాని ఆధారంగా విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఇమిగ్రేషన్ అధికారులు నిర్వహించే ఇంటర్వ్యూలో తాము ఉన్నత విద్యను అభ్యసించడమే లక్ష్యంగా అమెరికాకు వెళ్తున్నామని, కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొచ్చి స్థిరపడతామని స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పాలి. చాలా మంది విద్యార్థులు తమ నివాస ఖర్చులకైనా నిధులు సమకూర్చుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతం అమల్లో ఉన్న ‘వారానికి 20 గంటలు పని చేసే వెసులుబాటు’ను వినియోగించుకుంటున్నారు. అయితే ఈ విషయం వీసా ఇంటర్వ్యూ సమయంలో ఏ మాత్రం బయటపెట్టినా అవకాశం చేజారినట్లే! ముఖ్యంగా ప్రస్తుతం అమెరికాలోని ప్రభుత్వ విధానాలు, విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

స్కోర్లపై అప్రమత్తం
టోఫెల్, జీఆర్‌ఈ, జీమ్యాట్ వంటి స్కోర్లపై విద్యార్థులు స్పష్టంగా ఉండాలి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు లేదా వాటికి అనుబంధంగా భారత్‌లో ఉన్న కన్సల్టెన్సీలు..ఆయా టెస్ట్‌ల ప్రామాణిక స్కోర్లు అవసరం లేకుండానే ప్రవేశాలు కల్పిస్తామని ప్రచారం చేస్తున్నాయి. కానీ నిబంధనల ప్రకారం ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు లేదా యూనివర్సిటీలు తప్పనిసరిగా ఆయా స్కోర్లను ప్రామాణికంగా తీసుకుంటాయి. అవి లేకుండా ప్రవేశాలు కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లలో చేరాలనుకుంటే వాటికున్న గుర్తింపుపై విచారణ చేయాలి.

ఫ్లెక్సిబుల్ లెర్నింగ్
ఐఐటీలకు, అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రధానంగా ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ విషయంలో తేడా కనిపిస్తోంది. ఇటీవలకాలంలో ఐఐటీల్లో కూడా ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇది మరింత పెరగాలి. అప్పుడే ఉన్నత విద్య కోణంలో అమెరికాలో అడుగుపెట్టే విద్యార్థులు అకడమిక్స్‌లో ప్రతిభ కనబరుస్తారు.

ఆందోళన అనవసరం
ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో భారత విద్యార్థులకు అవకాశాలు ఉండవనే ఆందోళన అనవసరం. విద్యార్థులను తిరిగి స్వదేశానికి పంపించటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ల గుర్తింపు గురించి తెలుసుకోకుండా అమెరికా చేరుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడటమే లక్ష్యమనే అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. కోర్సు వ్యవధిలో అవసరమయ్యే ఆర్థిక వనరులను చూపించటంలో విఫలం అవుతున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించేందుకు ఇవే ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ అంశాలను అధిగమించగలిగితే అమెరికాలో ఉన్నత విద్య అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
Published date : 29 Jan 2016 04:28PM

Photo Stories