కరోనా ఉన్నా మనోళ్ల చాయిస్ అమెరికానే
2020–21 విద్యాసంవత్సరంలో 9.14 లక్షల మంది విదేశీ విద్యార్థులు అమెరికాలో అడ్మిషన్ తీసుకున్నారు. ఇందులో అత్యధికంగా 34.7%తో చైనా విద్యార్థులు 3,17,299 మంది ఉండగా, ఆ తర్వాత స్థానంలో 18.3 శాతం(1,67,582 మంది) భారతీయ విద్యార్థులు అక్కడి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. కరోనా ప్రభావం అడ్మిషన్లపై స్పష్టంగా కనిపించింది. 2019–20 విద్యాసంవత్సరంతో పోలిస్తే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లలో 15% తగ్గుదల నమోదైంది. అందులో మనదేశ విద్యార్థులకు సంబంధించి 13.2% తగ్గుదల ఉందని ఓపెన్ డోర్స్ రిపోర్ట్ వెల్లడించింది. నవంబర్ 15న అంతర్జాతీయ విద్యా వారోత్సవం సందర్భంగా నవంబర్ 15న ఢిల్లీలోని యూఎస్‌ఏ మిషన్ ఇండియా సంస్థ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200కి పైగా ప్రాంతాలకు చెందిన 9,14,095 మంది విద్యార్థులతో అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా ఒక అగ్ర గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీలో అత్యధికంగా 17,050 మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. అదే సమయంలో 20.9%తో 1,90,590 మంది విదేశీ విద్యార్థులు ఇంజనీరింగ్, 19.9%తో 1,82,106 మంది కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. కాగా 2019–20లో 1.62 లక్షల మంది అమెరికన్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చదువుతున్నారని, అందులో మన దేశంలో 1,736 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, ఈ ఏడాది వేసవిలోనే 62,000కు పైగా భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ చేశామని యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ తెలిపింది. ఇది గతేడాదికంటే ఎక్కువ అని, విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు యునైటెడ్ స్టేట్స్ ఎంపిక గమ్యస్థానంగా ఉందని ఈ గణాంకాలు చూపిస్తున్నాయని పేర్కొన్నారు.
చదవండి:
Part Time Jobs In Abroad: చదువుకుంటూనే.. సంపాదన నెలకు రూ. 59 వేలు..
FMGE 2021: విదేశంలో వైద్య విద్య.. స్వదేశంలో వైద్యం
H-1B: లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు