Skip to main content

FMGE 2021: విదేశంలో వైద్య విద్య.. స్వదేశంలో వైద్యం

ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ)–2021 డిసెంబర్‌కు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్ష ద్వారా.. విదేశాల్లో వైద్య విద్యను పూర్తిచేసుకున్న భారతీయ విద్యార్థులు.. స్వదేశంలో మెడికల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించేందుకు అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ)లో శాశ్వత సభ్యత్వం పొందేందుకు వీలు కలుగుతుంది. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంఎస్‌).. ఏటా రెండుసార్లు ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఎఫ్‌ఎంజీఈ–2021 డిసెంబర్‌ సెషన్‌కు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎఫ్‌ఎంజీఈకి అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్‌ టిప్స్‌...
Preparation Tips and Guidence for FMGE 2021
Preparation Tips and Guidence for FMGE 2021
 • ఎఫ్‌ఎంజీఈ 2021 డిసెంబర్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌

డాక్టర్‌ కావాలని లక్షల మంది విద్యార్థులు కలలు కంటారు. కానీ పరిమిత సీట్ల కారణంగా అందరికీ అవకాశం దక్కదు.దాంతో కొంతమంది విదేశాల్లో వైద్యవిద్యవైపు  మొగ్గు చూపుతున్నారు. ఇలా విదేశాల్లో వైద్య విద్యను పూర్తిచేసుకొని.. పట్టా పొందుతున్నారు. ఆ తర్వాత స్వదేశంలో డాక్టర్‌గా కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారు భారత్‌లో మెడికల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించాలంటే..ముందుగా ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంఎస్‌).. ప్రతీ ఏటా రెండుసార్లు(జూన్, డిసెంబర్‌) ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ)లో శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేసే వైద్య నియామకాలకు కూడా ఎంసీఐ శాశ్వత సభ్యత్వం తప్పనిసరిగా ఉండాలి. 

అర్హతలు

 • ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు భారతీయలు లేదా విదేశాల్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారై ఉండాలి.
 • 31.10.2021లోపు విదేశాల్లో ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన విద్య ఉత్తీర్ణులవ్వాలి.
 • ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యూఎస్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి.. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో సీటు సంపాదించిన వారు లేదా ఆయా దేశాల్లో ప్రాక్టీస్‌ చేసుకోవడానికి అనుమతి లభించిన అభ్యర్థులు ఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు. వారు నేరుగా ఎంసీఐ/ఎస్‌ఎంసీలో సభ్యత్వం కోసం నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. 
 • పాకిస్తాన్‌లో మెడిసిన్‌ పాసైన వారు మినిస్ట్రీ ఆఫ్‌ హోమ్‌ అఫైర్స్‌ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్‌ తెచ్చుకోవాల్సి ఉంటుంది. 

పరీక్షా విధానం

 • ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో రెండు పార్ట్‌లుగా ఎఫ్‌ఎంజీఈ పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 300 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష ఉంటుంది. అన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలే(ఎంసీక్యూలు) ఉంటాయి. 
 • ఒక్కో పార్ట్‌కు రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు. రెండు పార్ట్‌లకు కలిపి మొత్తం పరీక్ష సమయం 300 నిమిషాలు. నెగిటివ్‌ మార్కులు ఉండవు. 
 • ఈ పరీక్షల్లో అర్హత సాధించాలంటే..మొత్తం 300 మార్కులకుగాను కనీసం 150 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 
 • గత జూన్‌ సెషన్‌లో నిర్వహించిన ఎఫ్‌ఎంజీఈ పరీక్షకు 18,040 మంది హాజరు కాగా 4,283 మంది అర్హత సాధించారు. 

సిలబస్, మార్కులు

 • ప్రి అండ్‌ పారా క్లినికల్‌ సబ్జెక్ట్స్‌: ఇందులో అనాటమీ–17, ఫిజియాలజీ–17, బయో కెమిస్ట్రీ–17, పా«థాలజీ–13, మైక్రో బయాలజీ–13, ఫార్మకాలజీ–13, ఫోరెన్సిక్, మెడిసిన్‌–10.. ఇలా మొత్తం వంద మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. 
 • క్లినికల్‌ సబ్జెక్ట్‌లు: ఇందులో రెండు ఉప విభాగాలు ఉంటాయి. ఒకటి మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సబ్జెక్ట్స్, మరొకటి జనరల్‌ సర్జరీ అలైడ్‌ సబ్జెక్ట్స్‌. ఈ రెండింటి నుంచి మొత్తం 200 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. 
 • మెడిసిన్‌ అలైడ్‌ సబ్జెక్ట్స్‌: మెడిసిన్‌–33,సైకియాట్రీ–5,డెర్మటాలజీ అండ్‌ ఎస్‌టీడీ–5,రెడియోథెరపి–5 మార్కులకు ప్రశ్నలు ఎదురవుతాయి.
 • జనరల్‌ సర్జరీ అలైడ్‌ సబ్జెక్ట్స్‌: జనరల్‌ సర్జరీ–32, అనెస్తీషియాలజీ–5, ఆర్థోపెడిక్స్‌–5, రేడియో డయాగ్నోసిస్‌–5, పిడియాట్రిక్‌–15, ఆప్తమాలజీ–15, ఓటోరినోలారిజనాలజీ–15, ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ–30, కమ్యూనిటీ మెడిసిన్‌–30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. 

ప్రిపరేషన్‌ ఇలా

 • ముందుగా పరీక్ష విధానాన్ని అవగాహన చేసుకోవాలి. సిలబస్‌ను అనుసరించి ప్రిపరేషన్‌ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 
 • క్లినికల్‌–నాన్‌ క్లినికల్‌ మేళవింపుగా ప్రాక్టికల్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో అనాటమీ. ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ సబ్జెక్టుల బేసిక్స్‌పై పట్టు సాధిస్తే.. మిగతా సబ్జెక్టులు ప్రిపేర్‌కావడం తేలికవుతుంది. అలాగే మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ తదితర సబ్జెక్టులు స్కోరింగ్‌కు ప్రధానం. ప్రతి సబ్జెక్ట్‌కు కొంత సమయం కేటాయించాలి.
 • నెగిటివ్‌ మార్కులు ఉండవు కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా సన్నద్ధమవ్వాలి.
 • ప్రిపరేషన్‌ ఎంత ముఖ్యమో ఆరోగ్యంపై కూడా అంతే శ్రద్ధ వహించాలి.ప్రిపరేషన్‌ సమయంలో ఒత్తిడి సహజం. దాన్ని అధిగమించాలంటే.. తగినంత విశ్రాంతి, నిద్ర అవసరం.

పరీక్షా కేంద్రాలు

హైదరాబాద్, విశాఖపట్నం,చెన్నై,కొట్టాయం, న్యూఢిల్లీ, ముంబై, భువనేశ్వర్‌ సహా మరికొన్ని నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

దరఖాస్తు ఫీజు

 • ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అన్ని కేటగిరిల అభ్యర్థులు రూ.7080 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో పరీక్ష ఫీజు రూ.6000. కాగా జీఎస్టీ రూ.1080గా ఉంది. 
 • ఆన్‌లైన్, నెట్‌బ్యాంకింగ్, డెబిట్‌/క్రెడిట్‌ కార్డు ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

ముఖ్యమైన సమాచారం

 • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
 • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ:03.11.2021
 • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: 06.12.2021
 • పరీక్షా తేదీ: 12.12.2021

వెబ్‌సైట్‌: https://www.nbe.edu.in/ , https://www.natboard.edu.in/

Published date : 25 Oct 2021 06:30PM

Photo Stories