రీసెర్చ్ ఎడ్యుకేషన్‌కు కేరాఫ్...ఆస్ట్రేలియా !
ప్రకృతి అందాలు.. అద్భుత కట్టడాలకు నెలవైన ఆస్ట్రేలియా.. విద్యావకాశాల పరంగా విదేశీ విద్యార్థులకు మెరుగైన గమ్యంగా నిలుస్తోంది. అక్కడి పటిష్ట విద్యా విధానం, సరళీకృత బోధనా పద్ధతులు, అమెరికాతో పోల్చినప్పుడు ఖర్చులు తక్కువగా ఉండటం తదితర అంశాలు భారతీయ విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ఆస్ట్రేలియాకు ఉన్నత విద్య కోసం వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య ఏటా 17 వేలకు పైనే ఉంటోంది. 2015–16 విద్యా సంవత్సరంలో మన దేశం నుంచి 18,236 మంది స్టూడెంట్ వీసా పొందగా.. 2016–17 విద్యా సంవత్సరంలో అది 16,690కి తగ్గింది. దీనికి కారణం.. కొంతమేరకు వీసా నిబంధనలు కఠినతరం చేయడమే.
పరిశోధనకు ప్రాధాన్యం :
ఆస్ట్రేలియాలో పీజీ కోర్సుల వ్యవధి ఏడాది నుంచి రెండేళ్లు. ప్రముఖ యూనివర్సిటీల్లో కనీసం 16 నెలల వ్యవధిలో పీజీ కోర్సుల బోధన సాగుతోంది. ఆస్ట్రేలియా యూనివర్సిటీలు ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల పరంగా రీసెర్చ్‌కు ప్రాధాన్యమిచ్చేలా ఎంఎస్ కోర్సులను బోధించడం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తోంది. ఎక్స్‌లెన్స్ ఇన్ రీసెర్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుతో దాదాపు 43 విభాగాల్లో రీసెర్చ్ కార్యకలాపాలను ఆ దేశ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. యూనివర్సిటీలు సైతం ఎంఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులను పరిశోధన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాయి. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ కోర్సుల పరంగా విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలంగా మారుతోంది. కేవలం ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీలే కాకుండా.. ఇతర కోర్సుల్లోనూ నాణ్యమైన బోధనకు కేరాఫ్‌గా నిలుస్తోంది ఆస్ట్రేలియా.
పాపులర్ కోర్సులు...
1. హోటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ
2. ఇంజనీరింగ్
3. ఎంబీఏ
4. ఫిజియోథెరపీ
5. మెడిసిన్ అండ్ లైఫ్ సైన్సెస్
6. ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్
7. ఏవియేషన్
8. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్
9. ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్
ఖర్చులు కాస్త తక్కువే..
అమెరికా, యూకేలతో పోల్చితే ఆస్ట్రేలియాలో ఖర్చులు కొంత తక్కువే అని చెప్పొచ్చు. ఇక్కడ టైర్–2, 3 యూనివర్సిటీల్లో ఏడా దికి ట్యూషన్ ఫీజు 15 వేల నుంచి 20 వేల ఆస్ట్రేలియా డాలర్లు ఉంటుంది. టైర్–1 యూనివర్సిటీల్లో రూ.40 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు వార్షిక ట్యూషన్ ఫీజు విధానం అమలవుతోంది. నివాస ఖర్చుల విషయంలోనూ షేరింగ్ హౌస్ విధానంలో వసతి సమకూర్చుకున్న విద్యార్థులకు నెలకు 600 ఆస్ట్రేలియా డాలర్లతో నివాస సదుపాయం లభిస్తోంది. నగరాల్లోనైతే ఈ ఖర్చు 1500 ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు ఉంటోంది. జీవన వ్యయం పరంగా విద్యార్థులు 900 ఆస్ట్రేలియన్ డాలర్ల నుంచి 3 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు వెచ్చించాల్సి ఉంటోంది.
స్టడీ ఎట్ వర్క్ :
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు స్టడీ ఎట్ వర్క్ పేరుతో వారానికి 20 గంటలపాటు పార్ట్‌టైమ్ విధానంలో పనిచేసే అవకాశాన్ని ఆస్ట్రేలి యా ప్రభుత్వం కల్పిస్తోంది. దీనిద్వారా విద్యార్థులు నెలకు 500 నుంచి 800 ఆస్ట్రేలియన్ డాలర్లు ఆదాయం పొందొచ్చు.
పోస్ట్ స్టడీ వర్క్ :
ఆస్ట్రేలియాలో వర్క్ వీసాల పరంగా నిబంధనలు కొంత కఠినమని చెప్పొచ్చు. పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు గ్రాడ్యుయేట్ వర్క్ స్ట్రీమ్ వీసాను మంజూరు చేస్తున్నారు. దీని ప్రకారం.. అభ్యర్థులు తమ కోర్సు పూర్తయ్యాక 18 నెలలపాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ కొనసాగించొచ్చు. ఈ సమయంలో ఉద్యోగం లభిస్తే కంపెనీ స్పాన్సర్‌షిప్ లెటర్ ఆధారంగా కనిష్టంగా రెండు నుంచి మూడేళ్లపాటు అక్కడ నివసించేందుకు అవకాశముంది.
స్టూడెంట్ వీసా :
ఆస్ట్రేలియాలో పీజీ కోర్సుల ఔత్సాహి కులు తాము ప్రవేశం కోరుకుంటున్న యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలి. రెజ్యూమె, అకడమిక్ రికార్డ్, ఐఈఎల్‌టీ ఎస్ స్కోర్, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమండేషన్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ తదితర డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది. తర్వాత దశలో సదరు యూనివర్సిటీలోని సంబంధిత విభాగానికి చెందిన నిపుణుల కమిటీ వీటిని పరిశీలించి.. అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన అభ్యర్థులు ఆఫర్ లెటర్ ద్వారా వీసా సబ్ క్లాస్–500 కేటగిరీలో స్టూడెంట్ వీసా కోసం.. ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
స్కాలర్‌షిప్‌లు..
ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశించిన విదేశీ విద్యార్థులకు ఇప్పుడు అక్కడ వివిధ స్కాలర్‌షిప్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని స్కాలర్‌షిప్‌లు ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులు వంటి వాటికి సైతం అమలవుతుండగా.. మరికొన్ని సంస్థలు నిర్దిష్ట మొత్తంలో అందిస్తున్నాయి.
ప్రభుత్వ స్కాలర్‌షిప్ పథకాలు..
- ఆస్ట్రేలియా అవార్డ్స్ స్కాలర్‌షిప్స్.
- ఎండీవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్.
- ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్కాలర్‌షిప్స్.
- సీఎస్‌ఐఆర్‌ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్.
ఈ స్కాలర్‌షిప్‌లకు విద్యార్థులు తాము పొందిన యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా టాప్ యూనివర్సిటీలు...
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం.. ఆస్ట్రేలియాలోని టాప్–10 యూనివర్సిటీలు..
1. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ
2. యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్
3. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్
4. యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్
5. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ
6. మొనాష్ యూనివర్సిటీ
7. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా
8. యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్
9. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ – సిడ్నీ
10. న్యూక్యాజిల్ యూనివర్సిటీ
ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్య :
సంవత్సరం | విద్యార్థులు |
2016–2017 | 16,690 |
2015–2016 | 18,236 |
2014–2015 | 26,433 |
2013–2014 | 16,793 |
2012–2013 | 12,711 |
ముఖ్యమైన వెబ్‌సైట్లు :
1. www.studyinaustralia.gov.au
2. www.australia.gov.au
3. www.topuniversities.com
4. www.india.highcommission.gov.au