Skip to main content

Medical College: నోటిఫికేషన్‌ 12 పోస్టులకు.. రిక్రూట్‌మెంట్‌ 32 పోస్టులకు!

నర్సంపేట రూరల్‌: నర్సంపేట మెడికల్‌ కాలేజీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీలో గోల్‌మాల్‌ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Narsampeta Medical College   Notification for 12 posts Recruitment for 32 posts  Recruitment notification document

 12 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి.. 32 పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వాహకులు, కళాశాల అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

12 ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీ కోసం గత నెల 19న కలెక్టర్‌ ప్రావీణ్య, ప్రిన్సిపాల్‌ కిషన్‌ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నాలుగు డీ సెక్షన్‌హాల్‌ అటెండర్‌ పోస్టులు, నాలుగు ల్యాబ్‌ అటెండర్‌ పోస్టులు, నాలుగు థియేటర్‌ అనస్థీషియా అసిస్టెంట్‌ పోస్టుల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

చదవండి: Medical Colleges: కొత్త వైద్య కళాశాలలకు 380 పోస్టుల మంజూరు

కానీ, మే 30న‌ 32 పోస్టుల కోసం నియామకాలు చేపట్టడడంతో అభ్యర్థులు ఒక్కసారి కంగుతున్నారు. అసలు నోటిఫికేషన్‌ ఇచ్చింది 12 పోస్టులకు అయితే మరో 20 పోస్టులు ఎలా వచ్చాయని వారు ప్రశ్నించారు. ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండానే 10 డాటాఎంట్రీ ఆపరేటర్‌, 8 ఆఫీస్‌ సబార్డినేట్‌, 2 ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులను ఎలా భర్తీ చేస్తారని నిలదీశారు.

కాంట్రాక్టు పోస్టులైనా, ఔట్‌సోర్సింగ్‌ పోస్టులైనా సరే నోటిఫికేషన్‌ ఇవ్వకుండా భర్తీ చేసే అవకాశమే లేదని, కావాలని డబ్బులకు కక్కుర్తిపడి ఏజెన్సీ పేరు చెప్పుకుని అధికారులు దగా చేస్తున్నారని పలువురు బాహాటంగానే విమర్శించారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయకుంటే ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరించారు.

ఏజెన్సీ ఆధ్వర్యంలోనే మరో 20 పోస్టుల భర్తీ

నర్సంపేట పట్టణంలో మెడికల్‌ కళాశాల ఆధ్వర్యంలో 12 ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు గత నెల 19న నోటిఫికేషన్‌ ఇచ్చాం. నవోదయ ఏజెన్సీ ద్వారా మరో 20 పోస్టుల కోసం జాబితా వచ్చింది. ఏజెన్సీ ఇచ్చిన జాబితా ఆధారంగా రిక్రూట్‌మెంట్‌ చేస్తున్నాం. తుది నిర్ణయం ఏజెన్సీదే, మా చేతిలో ఏమి లేదు.

– కిషన్‌, నర్సంపేట మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌
 

Published date : 03 Jun 2024 10:35AM

Photo Stories