NCTE: టీచర్లకు గుదిబండలా ‘TET’.. ఈ నిబంధనతో అయోమయం
ఈ ఉత్తర్వుల ప్రకారం 2010 తర్వాత నియామకమైన జూనియర్ టీచర్లకు లబ్ధి చేకూరనుండగా ఏళ్లుగా పని చేస్తున్న సీనియర్లు పదోన్నతులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతుల ప్రక్రియ అక్టోబర్ నెలలో హైకోర్టు తీర్పు వల్ల నిలిచిపోగా.. ఇప్పుడు మరో వివాదం తెరపైకి రావడంతో ఎంతోకాలంగా పదోన్నతుల కోసం వేచిచూస్తున్న వారిలో గుబులు నెలకొంది. ఇప్పటికే ఎస్జీటీల బదిలీలు నిలిచిపోయిన విషయం విధితమే.
వాస్తవానికి మొదట పీజీ హెచ్‌ఎంల బదిలీలు జరిగాయి. తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పీజీ హెచ్‌ఎంలుగా పదోన్నతి లభించింది. అనంతరం స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయ్యాయి. పదోన్నతులు లేకపోవడంతో బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్ల స్థానంలో రిలీవర్ లేక చాలా మంది ఇదివరకు పని చేస్తున్న పాఠశాలల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 2,800 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు.
చదవండి: Teacher Jobs: త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ.. పోస్టుల వివరాలు ఇలా..
45 ఏళ్ల వయసు నిబంధనతో అయోమయం
పదోన్నతులు లేకుండా, ఆర్థిక ప్రయోజనం పొందకుండానే ఉద్యోగ విరమణకు దగ్గరవుతున్న టీచర్లు ఇదేం పాపమంటూ నిట్టూరుస్తున్నారు. జూనియర్లు కళ్లెదుటే టెట్ అర్హతతో పదోన్నతులు పొందే అవకాశాలు ఏర్పడుతుంటే తమ గోడు పట్టించుకునేదెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్‌సీటీఈ గైడ్‌లైన్స్ ప్రకారం టెట్ అర్హత పరీక్ష తప్పనిసరి చేయడం, 45 ఏళ్ల వయసు నిబంధన విధించడంతో వయసు పైబడిన ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. ఇదివరకు పదోన్నతుల జాబి తాలో 1989 నుంచి 2002 డీఎస్సీ వరకు నియమితులైనవారే అత్యధికులు ఉండగా.. ఇప్పుడు ఎన్‌సీటీఈ ఉత్తర్వులతో జాబితా పూర్తిగా మారిపోనుంది. ఇందులో 2012 నుంచి 2017 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో నియమితులైన వారికే చోటు దక్కనుంది.
చదవండి: CTET January 2024 Notification: టీచింగ్ కెరీర్‌కు తొలి మెట్టు.. సీటెట్
కోర్టుకు వెళ్లడంతో ఆగిపోయిన పదోన్నతులు
టెట్ అర్హత లేని వారికి పదోన్నతులు ఎలా ఇస్తారని కొందరు కోర్టుకు వెళ్లడంతో అప్పట్లో ఎస్జీటీల పదో న్నతులు ఆగిపోయాయి. దీనికి కారణం ప్రభుత్వ తప్పిదాలేనని చెప్పవచ్చు. ఎందుకంటే సర్వీస్‌లో ఉన్న టీచర్లకు టెట్ అవసరం లేదని పేర్కొనడంతో చాలా మంది పరీక్ష రాయలేదు.
ఇప్పుడు ఎన్‌సీటీఈ ఉత్తర్వులు టెట్ అర్హత కలిగిన వారికి మేలు చేస్తుండటంతో.. ఆ అర్హత లేనివారు తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సానుకూలంగా పరిశీలించాలని, 12 ఏళ్లకు పైగా ఒకేచోట పని చేస్తున్నవారికి స్థానచలనం కల్పించేలా చొరవ చూపాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.
ప్రభుత్వం చొరవ చూపాలి
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. వేలాది మంది టీచర్లు కొన్నేళ్లుగా ప్రమోషన్లు, బదిలీల కోసం వేచిచూస్తున్నారు. పదోన్నతులకు టెట్ తప్పనిసరి అంటూ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలి.
– కట్టా రవీంద్రాచారి, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
చాలామంది నష్టపోతారు
టెట్ ఉంటేనే పదోన్నతి అంటే చాలా మంది సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతారు. మూడేళ్లు లేదా ఐదేళ్ల షరతు విధించి, అర్హులకు పదోన్నతి ఇవ్వాలి. బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేసి, కొత్త వారికి పదోన్నతి కల్పించి, ఎస్‌జీటీల బదిలీలు చేపట్టాలి.
– పోరెడ్డి, దామోదర్‌రెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు