ఉద్యోగుల డీఏల మంజూరు ఉత్తర్వులు జారీ
. పెంచిన కరువు భత్యంతో ప్రభుత్వ ఖజానాపై ప్రతినెల దాదాపు రూ.270 కోట్ల మేరకు భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా డీఏ చెల్లింపుల్లో ఆలస్యం జరిగింది. ఈ నేపథ్యంలో జనవరి 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ డీఏల చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు విడతల కరువు భత్యం మొత్తం 10.01 శాతం చెల్లించేందుకు అనుమతినిచ్చారు. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు చెల్లించాల్సిన కరువు భత్యం చెల్లించినట్లుగానే భావించాలి. జూలై 2021 నుంచి మాత్రమే ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. జూలై 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు చెల్లించాల్సిన ఈ కరువు భత్యం బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనవరికి సంబంధించిన మూడు విడతల కరువు భత్యం మాత్రం ఫిబ్రవరిలో అందే వేతనంతో కలిపి ఇవ్వనున్నారు. కాగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు మాత్రం పది శాతం మొత్తాన్ని పెన్షన్ పథకంలో జమ చేసి..మిగిలిన 90 శాతం బకాయిలను మూడు వాయిదాల్లో చెల్లిస్తారు. ఇక విశ్రాంత ఉద్యోగులకు బకాయిలను మేలో చెల్లించే ఏప్రిల్ మాసం పెన్షన్ తో ప్రారంభించి.. ఆరు వాయిదాల్లో పూర్తిగా చెల్లిస్తారు. 2022 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు జీపీఎఫ్‌లో జమ చేయకుండా పదవీ విరమణ తరువాత 4 వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు.
ఉద్యోగుల హర్షం..
డీఏలకు సంబంధించిన జీవో విడుదలపై టీఎన్ జీవోల సంఘం అధ్యక్షుడు, టీ జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పద్మాచారి, అధ్యక్షుడు రవీందర్‌కుమార్, పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
చదవండి: