CM Revanth Reddy: విద్యపై ఖర్చు భవితకు పెట్టుబడే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సెంటర్ ఏర్పాటు
యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎల్బీ స్టేడియం వేదికగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతం చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల కాలంలోనే వివిధ శాఖలకు సంబంధించి 30వేల ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసి నియామక పత్రాలు అందించామని ఆయన చెప్పారు.
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ)తో పాటు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, టీఎస్‌పీఎస్సీల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5192 మంది అభ్యర్థులకు మార్చి 4న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఇరవై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియం వేదికగా అధికారం చేపట్టింది.
చదవండి: TS DSC Examination Centers: డీఎస్సీ అభ్యర్దులు అలర్ట్.. పరీక్షా కేంద్రాలు ఇవే..
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఉచిత విద్యుత్ పథకం అమలుపై అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తొలిఫైలుపై సంతకం చేశారు. గతేడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని చేపట్టింది కూడా ఎల్బీ స్టేడియంలోనే. ఆరు గ్యారెంటీలకు ఇక్కడే సంతకం చేశాం. ఇప్పుడు వరుసగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీని ఎల్బీ స్టేడియం వేదికగానే జరుపుతున్నాం.’’అనిఅన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను గాలికి వదిలేసిందనీ, కేవలం వారి కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా ఫాంహౌజ్ మత్తులో జోగిందని విమర్శించారు.
మిగిలిన వారికి త్వరలో ఇస్తాం
కొత్తగా 6546 మంది ఉద్యోగాలకు అర్హత సాధించినప్పటికీ ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో 5192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుళ్లు, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మిగతా వారికి త్వరలోనే అందిస్తామని వివరించారు. ‘గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన వ్యక్తిని నేను.
చదవండి: TS Mega DSC 2024: ఈ అర్హులే ఎస్‌జీటీ పోస్టులుకి దరఖాస్తు చేయాలి
నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదని గుంటూరు, గురజాల కార్పొరేట్ స్కూళ్లలో చదివిన వ్యక్తి ఈ మధ్య విమర్శలు చేస్తున్నాడు. అప్పట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బోధన సాగింది. ఇప్పుడు అలా కాదు. అద్భుతమైన ప్రతిభ ఉన్న వారు ఉద్యోగాలు సాధిస్తున్నారు. కొత్తగా నియమితులైన గురుకుల టీచర్లు విద్యార్థులకు అత్యుత్తమంగా బోధించాలి. వారికి పాఠ్యాంశ బోధనతో పాటు సామాజిక స్పృహ కలిగేలా... సంస్కృతీ, సాంప్రదాయాలు, విలువలతో కూడిన జీవితం గడిపేలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్: ఉపముఖ్యమంత్రి భట్టి
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉద్యోగాలకు సిద్దమయ్యే నిరుద్యోగులు నాలెడ్జ్ సెంటర్ల ద్వారా ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి వివరించారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియకపోయేదని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్‌ను రూపొందించి త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్త పాల్గొన్నారు.