వైద్య శాఖలో నియామకాలకు ప్రత్యేక రిక్రూట్‌మెంట్ బోర్డు
ఈ మేరకు మార్చి 15న వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల అందుబాటుపై తొలి నుంచి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకూడదన్న లక్ష్యంతో 2019 నుంచి ఇప్పటి వరకూ 48,639 పోస్టులను భర్తీ చేశారు. మరోవైపు శాఖలో ఏర్పడే ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా అనుమతులిచ్చారు. ఇదే క్రమంలో రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం.
చదవండి: ఈ శాఖలో 1,610 కొత్త పోస్టుల సృష్టి
ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా..
రిక్రూట్‌మెంట్ బోర్డుకు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మెంబర్ సెక్రటరీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, మరో మెంబర్‌గా జాయింట్ డైరెక్టర్ ఉంటారు. మరికొంత మంది సపోర్టింగ్ సిబ్బంది ఉంటారు. బోర్డు ఏర్పాటు నేపథ్యంలో 17 పోస్టులను కొత్తగా సృష్టించారు. ఇకపై వైద్య శాఖలో ఏపీపీఎస్సీ ద్వారా నియమించే పోస్టులను మినహాయించి.. మిగిలిన అన్ని రాష్ట్ర, జోనల్, జిల్లా పోస్టుల భర్తీ ప్రక్రియను రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా చేపట్టనున్నారు. తద్వారా నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని కుదించనున్నారు.