High Court: ఈ గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలి
రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం వీరి స్థానంలో మళ్లీ నియామకాలు చేపట్టేందుకు జూలై 18న నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం పని చేస్తున్న వారు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిచ్చింది. అయితే ఏళ్లుగా పని చేస్తున్న తమను కాదని మళ్లీ నియామకాలు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని.. ఆర్టికల్ 14, 16, 21ను ఉల్లఘించడమేనని పేర్కొంటూ గెస్ట్ లెక్చరర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మాధవీదేవి.. మెరిట్ ఆధారంగానే వీరిని నియమించారు కదా, ఇప్పుడెందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు.
చదవండి: Guest Lecturer Posts: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ఏదేమైనా లెక్చరర్‌కు అర్హతలు ఉండి, ఎలాంటి ఫిర్యాదు లేని వారిని కొనసాగించాలని, ఇతర చోట్ల కొత్త వారిని తీసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా, హైకోర్టు ఉత్తర్వుల పట్ల గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ హర్షం వ్యక్తంచేశారు. అధికారుల నిర్ణయంతో 1,654 మంది రోడ్డున పడే ప్రమాదం ఉన్న క్రమంలో గెస్ట్ లెక్చరర్లంతా విద్యామంత్రి ఇంటి వద్ద, ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. చివరికి హైకోర్టు తమకు ఊరటనిచ్చిందని తెలిపారు.