Skip to main content

సబ్‌ఇన్ స్పెక్టర్‌ పరీక్షలో హైటెక్‌ కాపీయింగ్‌

ఏం బుర్రరా నీది..! అని అసాధారణ ప్రతిభాపాటవాలు, అమోఘ నైపుణ్యం కనబరుస్తున్న వారిని ప్రశంసిస్తుంటాం.
copy
సబ్‌ఇన్ స్పెక్టర్‌ పరీక్షలో హైటెక్‌ కాపీయింగ్‌

ఇదిగో ఈ ఫొటోలో కనపడుతున్న వ్యక్తి తెలివితేటలను చూసి.. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. నెటిజన్లు కూడా.. విస్తుపోయారు. కాకపోతే చదువుల్లో ఇతనికున్న ప్రతిభను చూసి కాదు... వక్రమార్గంలో సబ్‌ఇన్ స్పెక్టర్‌ పరీక్షను గట్టెక్కడానికి సదరు మహాశయుడు ఎంచుకున్న హైటెక్‌ కాపీయింగ్‌ పద్ధతిని చూసి. ఇంతకీ ఏం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల సబ్‌–ఇన్ స్పెక్టర్‌ ఉద్యోగానికి పోటీ పరీక్షలు జరిగాయి. ప్రభుత్వోద్యోగం... అందులోనా క్రేజీ జాబ్‌. మనోడు బాగా ఆలోచించి... కాపీయింగ్‌ ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ బ్లూ టూత్‌ రిసీవర్‌ను విగ్గులో అమర్చి ఏమాత్రం అనుమానం రాకుండా క్రాపు బాగా తగ్గించుకొని తన తలపై ఈ విగ్గును జాగ్రత్తగా అతికించుకున్నాడు. అత్యంత సూక్ష్మమైన... బయటికి కనిపించని రెండు ఇయర్‌ఫోన్ లను చెవుల్లోకి జొప్పించాడు. కంటికి కనిపించంనంత సూక్ష్మమైన తీగలతో ఈ బ్లూ టూత్‌ నుంచి ఇయర్‌ఫోన్ లను కనెక్ట్‌ చేశాడు. దిలాసాగా నడుచుకుంటూ పరీక్ష కేంద్రంలోకి వెళ్లబోతుండగా... అందరినీ చెక్‌ చేసినట్లే పోలీసులు మనోడిని కూడా మెటల్‌ డిటెక్టర్‌తో పరీక్షించారు. తల దగ్గరికి రాగానే బీప్‌.. బీప్‌.. అని శబ్దం వస్తోంది. నిశితంగా పరిశీలించిన పోలీసులు విగ్గు గుట్టును రట్టుచేశారు. విగ్గును తొలగించడం, లోపలున్న బ్లూటూత్‌ పరికరం, చెవుల్లోని సూక్ష్మమైన ఇయర్‌ఫోన్ లను అతికష్టం మీద పోలీసులు వెలికితీయడం చూసి... వామ్మో ఏం తెలివిరా బాబోయ్‌... అంటూ నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఈ వీడియోను ఐపీఎస్‌ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో పంచుకోగా... వైరల్‌గా మారింది. గూఢచారి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని కొందరు సరదాగా అతనికి సూచించారు.

Published date : 24 Dec 2021 03:06PM

Photo Stories