Department of Rural Development: ఎంపీడీవోలకు నెరవేరుతున్న పాతికేళ్ల కల
ఉద్యోగ విరమణ చేసేలోగా ఒక్క పదోన్నతి వస్తుందా అని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. వారి కల ఇప్పుడు నేరవేరబోతుంది. ఎంపీడీవోలకు పదోన్నతి కల్పించడానికి వారి క్యాడర్‌కు పైస్థాయిలో తగినన్ని పోస్టులు లేకపోవడంతో వారి పదోన్నతి ప్రక్రియ ఇన్నాళ్లు నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రామీణాభివృది్ధశాఖలో 149 పోస్టుల్లో ఆన్ డ్యూటీ లేదా డిప్యుటేషన్ రూపంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతులపై నియమించేలా జనవరి 17న ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృధ్దిశాఖలోని కమిషనర్ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం, వాటర్‌షెడ్ పథకం విభాగాల్లో 9 కేటగిరీల్లో 15 పోస్టులు, జిల్లాల్లోని డ్వామా పీడీ కార్యాలయాల్లో మరో 9 కేటగిరీల్లో 134 పోస్టులు కలిపి మొత్తం 149 పోస్టుల్లో ఆన్ డ్యూటీ లేదా డిప్యుటేషన్ విధానంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతి ద్వారా నియమించనున్నట్లు గ్రామీణాభివృది్ధశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ 149 పోస్టుల్లో ప్రస్తుతం డిప్యుటేషన్, ఆన్ డ్యూటీలో కొనసాగుతున్నవారు నిర్ణీత సర్వీసు కాలం ఆ పోస్టుల్లోనే కొనసాగుతారని, భవిష్యత్‌లో ఆ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల్లోనే ఎంపీడీవోలను పదోన్నతిపై నియమించనున్నట్లు తెలిపారు.
200 మందికిపైగా ఒకేసారి పదోన్నతి..
పాతికేళ్లుగా ఎంపీడీవోలు పదోన్నతులకు నోచుకోని అంశంపై జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దృష్టి పెట్టారు. దీంతో పదోన్నతులకు వేచి ఉన్నవారికి ఒకేసారి పెద్దసంఖ్యలో పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఇప్పటికే డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ (డీఎల్‌డీవో) పోస్టు వ్యవస్థను ఏర్పాటు చేసి కొత్తగా 51 డీఎల్‌డీవో పోస్టులను ఎంపీడీవోలకు పదోన్నతి ద్వారా భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో 149 పోస్టుల కోసం పదోన్నతికి వీలు కల్పించింది. ఒకేసారి 200 మందికిపైగా ఎంపీడీవోలకు పదోన్నతి దక్కేలా కసరత్తు చేస్తున్నట్లు గ్రామీణాభివృధ్దిశాఖ అధికారులు తెలిపారు.
చదవండి:
Good News: నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ
Online Classes: సెలవుల పొడిగింపుతో..మళ్లీ ఆన్‌లైన్ విద్య..!