Skip to main content

Cancellation Of CBSE Teaching: ప్రభుత్వ స్కూలు పిల్లలపై ఎందుకీ వివక్ష?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధన రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకిగా నిరూపించుకున్నారు అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.
ys jagan fires chandrababu about govt school childrens

సీబీఎస్‌ఈ బోధన రద్దు ద్వారా నాణ్యమైన విద్యకు గండి­కొడు­తు­న్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠ­శాలల్లో చదువుతున్న పేద విద్యా­ర్థుల భవితను అంధకారంలోకి నెట్టేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్‌ జగన్‌ నిలదీశారు. సెప్టెంబ‌ర్ 16న‌ ఎక్స్‌లో చేసిన పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

‘‘ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్లు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి?

చదవండి: Gurukul Cet: సమీకృత గురుకులాలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష!

గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించే కుట్ర..

గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్ల కాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది.

నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీవైపు అడుగులు, టోఫెల్, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానల్స్, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూతో గోరుముద్ద.. ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది. 

చదవండి: Online AI Courses: ఏఐ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నారు. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు, మీ కుమారుడు కుట్రను అమలు చేస్తున్నారు.

మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి? గవర్నమెంటు స్కూళ్లు నిర్వీర్యం అయిపోవాలి? మీ ఉద్దేశం అదేగా? తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంత జేబు నుంచి ఎందుకు ఖర్చుచేయాలి? అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు? గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు, ఈ ‘‘ఈనాడు’’ కోర్టులకు వెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజల మరిచిపోలేరు.

గవర్నమెంటు స్కూలు పిల్లలు, టీచర్లను తక్కువగా చూడొద్దు..

మన గవర్నమెంటు స్కూలు పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేనిలోనూ తక్కువ కాదు చంద్రబాబూ. వీళ్లంతా తెలివైన వారు.

పైగా ప్రభుత్వ టీచర్లు లక్షల మంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై, చక్కటి శిక్షణ కూడా పొందినవారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారి కంటే గొప్ప చదువులు చదివినవారు, గొప్పగా చదువులు చెప్పగలిగినవారు. 

అలాంటివారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి. పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, సరైన శిక్షణ, పటిష్ట బోధన.

టీచర్లకు అందించాల్సింది ప్రేరణ, ప్రోత్సాహం, ఓరియంటేషన్‌. గడచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణంచేశారు. మళ్లీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి, ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు చంద్రబాబూ? 

చదువుతోనే పేదరికం దూరం

పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే. వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోండి.

మేం తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లండి. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి. లేదంటే మీరు పేదప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు’’ అని చంద్రబాబు విధానాలను ఎండగట్టారు. 

Published date : 17 Sep 2024 04:06PM

Photo Stories