Gurukul Cet: సమీకృత గురుకులాలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష!
ఇప్పటివరకు, గురుకుల సొసైటీలు వారి పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించి, విద్యార్థుల మెరిట్ ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించేవి. అన్ని తరగతుల్లో కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టేవారు. సీట్లు మిగిలిన సందర్భాల్లో స్పాట్ అడ్మిషన్ల విధానం ద్వారా సీట్లను భర్తీ చేసేవారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న సమీకృత గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చే అంశంపై అధికారులు దృష్టి సారించారు. సాధారణ గురుకుల పాఠశాలలు, కళాశాలలకు ఇప్పుడున్న నిబంధనలు కొనసాగిస్తూనే.. సమీకృత గురుకులాలకు మాత్రం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.
చదవండి: Gurukul School Salaries: గురుకుల ఉద్యోగుల వేతన వెతలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచే..
వచ్చే విద్యా సంవత్సరం నుంచే, సమీకృత గురుకుల పాఠశాలలన్నిటికీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఐదో తరగతి మొదలు, 6, 7, 8 తరగతుల్లోని బ్యాక్‌లాగ్ ఖాళీలు, ఇంటర్మీడియట్ ఫస్టియర్, డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్ల ప్రక్రియంతా ఉమ్మడిగానే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో తొలి విడత కింద 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 సమీకృత గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈమేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు భూలభ్యత, ఇతర వసతులకు సంబంధించి సూచనలు ఇవ్వగా, కలెక్టర్లు ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికలు పంపినట్లు సమాచారం. ఒక్కో సమీకృత గురుకులాన్ని కనిష్టంగా 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సమీకృత గురుకులాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నెల రోజుల్లోగా డిజైన్లు పూర్తి చేయాలని కమిటీ సూచించగా, అవి కూడా ఇప్పటికే తయారైనట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి సమీకృత గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది.