KGBV: కస్తూర్బాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జూలై 26న సాయంత్రం జరిగింది. టీచర్లు వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గోవిందాపూర్ కేజీబీవీలో కల్పన, పూర్ణ పదో తరగతి చదువుతున్నారు. ఇందులో హనుమకొండకు చెందిన కల్పన, పూర్ణతో కలిసి జూలై 25న రాత్రి అటెండర్ సెల్ ఫోన్ తీసుకొని తల్లికి ఫోన్ చేసింది.
చదవండి: KGBV: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల ఉన్నతీకరణ
తనకు ఆరోగ్యం బాగా లేదని, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. అదే సందర్భంగా తోటి విద్యార్థినులు గమనించి ‘దొంగ’‘దొంగ’.. అంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులు జూలై 26న సాయంత్రం తమ వద్ద ఉన్న నెయిల్ పాలిష్‌ను తాగారు. గమనించిన టీచర్స్ వారిని వెంటనే పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ఆస్పత్రిలో వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారిని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్యం మెరుగు పడటంతో జూలై 27న తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషలాఫీసర్ మాధవిని వివరణ కోరగా కల్పన, పూర్ణ తమ ఇళ్లకు వెళ్తామని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదని, ఆ బాధతోనే ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు.