Skip to main content

TS Schools : స్కూల్‌కి సెల‌వు.. ఆధార్‌కి లింక్‌.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో ప్రస్తుతం వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఆధార్‌ అప్‌డేట్‌ కష్టాలు చుట్టుముడుతున్నాయి. పదేళ్లకోసారి కార్డుదారుడి వేలిముద్రలను మరోసారి సేకరించడంతోపాటు ఫోన్‌ నంబర్, పేరు, చిరునామా సవరణల కోసం ఈ–కేవైసీ (ఎల్రక్టానిక్‌ నో యువర్‌ కస్టమర్‌) వివరాల నమోదును ఆధార్‌ సంస్థ తప్పనిసరి చేయడం, ఈ–కేవైసీ కాని కుటుంబాల్లోని వారి పేర్లను రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆధార్‌ నమోదు కేంద్రాలకు తాకిడి విపరీతంగా పెరిగింది.
school student aadhar card news telugu
ts school students

తెల్లవారుజాము నుంచే..
ఒక్కో కేంద్రం వద్ద నిత్యం పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తుండడంతో చాలా మంది తెల్లవారుజాము నుంచే కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అయితే వారిలో అత్యధికులు పాఠశాల విద్యార్థులే ఉంటున్నారు. వరుసగా రెండు, మూడు రోజులపాటు స్కూళ్లు ఎగ్గొట్టి ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరిగితేగానీ ఈ–కేవైసీ నమోదు సాధ్యంకావట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరులతోనే తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఆధార్‌ నమెదు కేంద్రాల్లో పిల్లల తాకిడి విపరీతం కావడంతో అటు పిల్లలు, ఇటు పెద్దలు ఆధార్‌ ఈ–కేవైసీ కోసం తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది.

☛ November Schools and Colleges Holidays List 2023 : నవంబర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌చ్చే సెల‌వులు ఇవే.. దాదాపు 10 రోజులు పాటు..

విద్యాశాఖ మాత్రం... 

school students problems

బడి పిల్లలకు ఉచితంగా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్, సవరణ ప్రక్రియ కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కిట్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకంగా ఆపరేటర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి పాఠశాలలోనే ఆధార్‌ నమోదు కౌంటర్లు తెరిచి విద్యార్థులందరికీ ఉచితంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 876 కిట్లను ఆపరేటర్లకు అప్పగించి నమోదు ప్రక్రియను మొదలుపెట్టింది. కానీ ఈ కార్యక్రమానికి శాఖపరంగా పర్యవేక్షణలోపం, దానికితోడు అధికారుల ఉదాసీనవైఖరి తోడవడంతో పాఠశాల స్థాయిలో నమోదు ప్రక్రియ అటకెక్కింది. అందుకు బదులుగా ఆయా కిట్లను ఆపరేటర్లు తమకు నచ్చినచోట కౌంటర్‌ ఏర్పాటు చేసుకొని నమోదు ప్రక్రియను సాగిస్తూ అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కేవలం పాఠశాల పిల్లల వివరాలను నమోదు చేయాల్సి ఉండగా పెద్దల వివరాలను కూడా నమోదు చేçస్తున్నారు. అయితే చాలాచోట్ల ఈ కిట్ల ద్వారా ఎంట్రీ చేస్తున్న వివరాలు తప్పులతడకగా ఉంటుండటంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. 

ఒక్కో కేంద్రంలో రోజుకు..

school students aadhar problems

ఆధార్‌ నమోదు నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం రాష్ట్రంలో 650 శాశ్వత ఆధార్‌ నమోదు కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు గరిష్టంగా 100 మంది వివరాల నమోదు మాత్రమే సాధ్యమవుతోంది. ఆపరేటర్ల తిరస్కరణ, నమోదు కేంద్రాల నిర్వహణ భారంతో ప్రస్తుతం 350 శాశ్వత ఆధార్‌ నమోదు కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఫలితంగా తాకిడీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రాల సంఖ్య పెంచాలని లేదా కొత్తగా రెండో కిట్టు ఇవ్వాలని ఆధార్‌ సంస్థకు నిర్వాహకులు వినతులు సమర్పిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రావట్లేదు. పరిమితికి మించి జనాలు రావడం.. సాంకేతిక కారణాలతో నమోదు ప్రక్రియ జాప్యం జరుగుతుండటం లాంటి కారణాలతో ప్రతి రోజూ కార్డుదారులు మమ్మల్ని నిలదీస్తున్నారు.  –శ్రీనివాస్, ఆధార్‌ కేంద్రం నిర్వాహకుడు బోడుప్పల్‌ 

వినతులు..
మా కేంద్రానికి రెండో కిట్టు కేటాయించాలని గత కొంతకాలంగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 
                                 –కె.పవిత్ర, ఆధార్‌ కేంద్రం నిర్వాహకురాలు ఇబ్రహీంపట్నం 

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ సమీపంలోని ఆధార్‌ నమోదు కేంద్రంలో శనివారం కనిపించిన దృశ్యం ఇది. కేవలం ఆధార్‌లో వివరాల నమోదు కోసం బడికి సెలవుపెట్టి మరీ వచ్చినట్లు వారంతా పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్‌ లింకుతో గతంలో ఐదేళ్లలోపు పిల్లల ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ జరగ్గా ఇప్పుడు ఆయా విద్యార్థులు వారి వేలిముద్రలతో ఆధార్‌లో అప్‌డేట్‌ చేసుకుంటున్నారు.

వీరంతా ఆధార్‌ వివరాల అప్‌డేషన్‌ కోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆధార్‌ నమోదు కేంద్రానికి ఉదయం 7 గంటలకే క్యూలో నిలబడ్డారు. ఒక్కో సెంటర్‌లో రోజుకు పరిమిత సంఖ్యలోనే వివరాల అప్‌డేషన్‌ ప్రక్రియ జరుగుతుండడంతో తెల్లవారుజాము నుంచే టోకెన్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఇలా లైన్లలో నిరీక్షిస్తున్నారు.

☛ Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

Published date : 30 Oct 2023 07:49PM

Photo Stories