Rural Students: బాల్‌బ్యాడ్మింటన్‌లో విద్యార్థుల హవా
పట్టుదల ఉంటే సాధించలేనిది
లేదన్నారు పెద్దలు. ఆ మాటలను నిజం చేస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామీణ విద్యార్థులు. ఇటు చదువులోనే కాదు.. అటు క్రీడల్లోనూ విశేషంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బాల్‌బ్యాడ్మింటన్‌లో రాకెట్‌కన్నా వేగంగా దూసుకుపోతున్నారు. జాతీయ స్థాయిలో సత్తాచాటుతూ పతకాల పంట పండిస్తున్నారు. ఇటు తల్లిదండ్రులకు.. అటు రాష్ట్రానికి పేరుప్రతిష్టలు తీసుకొస్తున్నారు. గ్రామీణ క్రీడాకుసుమాల విజయ గాథపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.
నగరి: క్రీడల అభివృద్ధి, క్రీడాకారుల ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను క్రీడాకారులు అందిపుచ్చుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింట్ టోర్నీకి ఎంపకయ్యారు. ఇటీ వల నంద్యాల జిల్లా మహానందిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబరచడంతో పాటు నగరికి చెందిన తేజేష్, తిరుపతికి చెందిన ప్రశాంతి జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. ఈనెల 15 నుంచి ఛత్తీస్‌గడ్, బిలాయ్ బీఎస్పీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనున్న జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్‌న్ టోర్నమెంట్‌లో ఏపీ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. వీరంతా.. సామాన్య, మధ్య తరగతికి చెందిన వారే కావడం విశేషం. ఒక వైపు చదువుకుంటూ మరోవైపు ఆటల్లో రాణిస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం
గ్రామస్థాయి నుంచి క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడాశాఖ విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ప్రతిభగల విద్యార్థులను వెలుగులోకి తీసుకురావడానికి జగనన్న స్పో ర్ట్స్ క్లబ్‌లను నడుపుతోంది. క్రీడాకారులకు ప్రతిభా అవార్డులను అందిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ క్రీడ పూర్వవైభవం సంతరించుకుంటోంది. పాఠశాల, కళాశాల స్థాయిలో పొందిన శిక్షణతో జిల్లా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. వరుసగా జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దూసుకుపోతున్నారు.
ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం
జిల్లా నలుమూలల బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాధన చేస్తున్నారు. సబ్ జూనియ ర్, జూనియర్ విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. పోటీలు ఎక్కువగా నిర్వహిస్తుండ డంతో ప్రతిభ చాటే అవకాశం లభిస్తోంది. క్రీడాకారులను ప్రోత్సహించడంలో క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అత్యంత చొరవచూపుతున్నారు. ఆమె సహకారంతో ఈనెల 22వ తేదీ నుంచి జూనియర్ అంతర్ జిల్లాల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలను తొలిసారిగా నగరిలో నిర్వహించనున్నాం.
–బాలాజి, ప్రధాన కార్యదర్శి, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్
అదే నా లక్ష్యం
మాది తిరుపతి జిల్లా, పెళ్లకూరు మండలం, అక్కగారిపేట గ్రామం. 9వ తరగతి చదువుతున్నాను. తండ్రి శివప్రసాద్ ఎలక్ట్రీషియన్. బాల్‌బ్యాడ్మింటన్ పై మక్కువతో శిక్షణ పొందుతున్నాను. నంద్యాల జిల్లా మహానందిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యాను. జూనియర్, సీఎంకప్ పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ చూపాను. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే రాణిస్తున్నాను. జాతీయ స్థాయిలో రాష్ట్ర జట్టును విజేతగా నిలపాలన్నదే నా లక్ష్యం.
– ఆర్.ప్రశాంతి