Ministry of Defence: సైనిక్ స్కూల్‌కు సై
సంపూర్ణ క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంతో పాటు, దేశభక్తిని పెంపొందించే విధంగా పాఠశాలల్లో బోధిస్తారు. రక్షణ రంగంలో ప్రవేశించడానికి అవసరమైన నైపుణ్యాలను పాఠశాల దశ నుంచే నేర్పిస్తారు. దేశవ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక్ స్కూల్స్‌లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9 తరగతుల్లో ప్రవేశానికి అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (ఏఐఎస్‌ఎస్‌ఈఈ–2024) నోటిఫికేషన్ విడుదలైంది.
సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఎస్‌జీవీలు/ప్రైవేట్ పాఠశాలలు/రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పని చేసే 19 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు కూడా ఏఐఎస్‌ఎస్‌ఈఈ–2024 ద్వారా నిర్వహిస్తారు.
సీట్ల కేటాయిస్తారిలా..
ఆరో తరగతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2,970, ప్రైవేటు పాఠశాలలకు 5,225 సీట్లు కేటాయించారు. తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు. రాష్ట్రంలోని కోరుకొండ (విజయనగరం), కలికిరి (చిత్తూరు), కృష్ణపట్నం(శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు)లో సైనిక పాఠశాలలున్నాయి.
చదవండి: R Limbadri: రాజకీయమార్పులకు వేదికల్లా వర్సిటీలు ఎదగాలి
ఇవీ అర్హతలు
సైనిక స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశం పొందగోరే విద్యార్థుల వయస్సు 2024 మార్చి 31 నాటికి 10 – 12 ఏళ్ల మధ్య ఉండాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిదో తరగతి ప్రవేశం పొందగోరే విద్యార్థుల వయస్సు 2024 మార్చి 31 నాటికి 13 – 15 ఏళ్ల మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
సీట్ల కేటాయింపు ఇలా..
- ● రాష్ట్రంలోని సైనిక్ స్కూల్స్‌లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67 శాతం, ఇతర రాష్ట్రాల వారికి 33 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు.
- ● వీటిలో ఎస్సీ 15, ఎస్టీ 7.5, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27 శాతం కేటాయిస్తారు. మిగిలిన సీట్లలో 25 శాతం మాజీ సైనికోద్యోగుల పిల్లలకు, మిగిలిన 25 శాతం ఇతర రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడుకు మించి ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీలు లేదు.
పరీక్ష కేంద్రాలు
దేశవ్యాప్తంగా 186 కేంద్రాల్లో పరీక్ష రాసే వీలుంటుంది. మన రాష్ట్రంలోని అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం పట్టణాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి.
దరఖాస్తు చేసుకోవాలిలా..
అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ ఏడో తేదీ నుంచి అవకాశం కల్పించారు. దరఖాస్తుకు వచ్చే నెల 16 తుది గడువు. దరఖాస్తులో మార్పులకు డిసెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకూ అవకాశముంటుంది.
- ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 చొప్పున పరీక్ష రుసుం చెల్లించాలి.
- ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 21న నిర్వహిస్తారు.
- ఆరో తరగతి విద్యార్థులకు జనవరి 21వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకూ (150 నిమిషాలు), తొమ్మిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ (180 నిమిషాలు) ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
- పరీక్ష నిర్వహించిన ఆరు వారాల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.