OMR Sheet for School Exam: స్కూలు పరీక్షల్లో ఓఎంఆర్ షీట్లు
ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన విప్లవాత్మక పథకాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా, ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయనడంలో సందేహమే లేదు. మన బడి నాడు – నేడు, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు అందరి మన్ననలు అందుకుంటున్నాయి. ఇప్పుడు స్కూలు అంతర్గత పరీక్షల్లో ఓఎంఆర్ పరీక్షా విధానం అవలంభించడాన్ని కూడా ప్రశంసిస్తున్నారు.
విద్యార్థులు పదో తరగతి వరకూ చదివేది ఒక ఎత్తు, అనంతరం ఇంటర్మీడియట్, డిగ్రీ మరో ఎత్తు.. డిగ్రీ అనంతరం ఉద్యోగాల కోసం ప్రతి విద్యార్థి పోటీ పరీక్షలకు తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. ఒకేసారి పోటీ పరీక్షలకు వెళ్లడం విద్యార్థులకు తలకుమించిన భారం. పోటీ పరీక్షల్లో మంచి ప్రదర్శన ఇస్తేనే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశముంటుంది.
అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ రాతపూర్వక పరీక్షల ద్వారా విద్యార్థుల సామర్ధ్యం తెలుసుకునేవారు. ఇకపై తరగతి గది ఆధారిత మూల్యాంకనం (క్లాస్‌రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్) విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
అంతర్గత పరీక్షల్లో ఓఎంఆర్ షీట్ల విధానం
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే అంతర్గత పరీక్షల్లో ఓఎంఆర్ జవాబు పత్రాల విధానాన్ని ప్రభుత్వం గత ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ విధానం ద్వారా విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఓఎంఆర్ పత్రాలపై జవాబులు రాయడంలో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా చేయవచ్చు.
కార్పొరేట్ విద్యా సంస్థలు ఎప్పటి నుంచో ఈ విధానాన్ని తమ విద్యార్థులకు పరిచయం చేయగా గత ప్రభుత్వాలు ఆ దిశగా అసలు ఆలోచనే చేయలేదు. చిన్నప్పటి నుంచే ఈ విధానం అలవాటు పడితే జేఈఈ వంటి పరీక్షలను విద్యార్థులు సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నాపత్రాలు
ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్గతంగా నిర్వహించే ఫార్మేటివ్, సమ్మెటివ్ వంటి పరీక్షల్లో విద్యార్థులకు అందించే ప్రశ్నాపత్రాల్లో సైతం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ఆయా పరీక్షల ప్రశ్నాపత్రాలను తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో రూపొందించి విద్యార్థులకు అందచేస్తోంది.
కాగా 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఏడాదికి మూడు సార్లు తరగతి గది ఆధారిత మూల్యాంకన (సీబీఏ) పరీక్షలు నిర్వహిస్తున్నారు. 9, 10 తరగతులకు మాత్రం పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.