ZP High School: అటు చదువులోను.. ఇటు క్రీడల్లోనూ నంబర్ వన్
పెద్దపప్పూరు: అటు చదువులోను.. ఇటు క్రీడల్లోనూ నంబర్ వన్‌గా పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఖ్యాతిగాంచింది. ఈ పాఠశాలలో చదువుకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో.. క్రీడలనూ అదే స్థాయిలో ప్రోత్సహిస్తుండడంతో పలువురు గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకుంటున్నారు. కబడ్డీ, ఖోఖో, జూడో, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, త్రోబాల్‌తో పాటు అథ్లెటిక్స్‌లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఈ పాఠశాల విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో ఆల్ రౌండ్ చాంపియన్ షిప్ దక్కించుకున్నారు. ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో పది మంది బాలబాలికలు పంతకాలు సాధించారు. అలాగే రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో 20 మంది, అథ్లెటిక్స్‌లో మరో 20 మంది పతకాలు సాధించారు.
పీఈటీ చొరవతో...
గతంలో ఈ పాఠశాలలో పీడీగా పనిచేసిన శ్రీనివాసులు క్రీడాభివృద్ధికి తన సొంత డబ్బును వెచ్చించడంతో పాటు దాతల సహకారమూ తీసుకున్నారు. ఆశించిన దానికంటే ఎక్కువగా దాతల నుంచి ఆర్థిక సాయం అందడంతో దాదాపు రూ.25 లక్షలు వెచ్చించి పాఠశాల ఆవరణలో జాతీయ నాయకుల విగ్రహాలతో పాటు పలు దేవతా ప్రతిమలను ఏర్పాటు చేశారు. పచ్చదనం ఉట్టిపడేలా మొక్కల పెంపకాన్ని చేపట్టారు. బదిలీపై ఆయన మరో ప్రాంతానికి వెళ్లిన తర్వాత పీడీగా బాధ్యతలు స్వీకరించిన రామాంజినమ్మ ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాల మెరుగుకు చర్యలు చేపట్టారు. కబడ్డీ, వాలీబాల్, జూడో, టగ్ ఆఫ్ వార్, ఖోఖో, త్రోబాల్‌తో పాటు అథ్లెటిక్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల బెంగుళూరు వేదికగా జరిగిన అంతర్జాతీయ టగ్ ఆఫ్ వార్ పోటీల్లో అండర్ –15 విభాగంలో ఈ పాఠశాల విద్యార్థులు విశ్వ విజేతలుగా నిలిచారు.
చదవండి: NMMS: ప్రతిభకు ప్రోత్సాహం.. ఉపకార వేతనం
వెల్లువలా వచ్చి చేరుతున్న ప్రైవేట్ విద్యార్థులు
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ చేకూరింది. మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద నరసాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులను ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పూర్తి చేశారు. కార్పొరేట్ పాఠశాలలో సైతం లేని సౌకర్యాలు ఈ పాటశాలలో కల్పించడంతో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు వెల్లువలా వచ్చి చేరుతున్నారు. ఇక్కడి మౌలిక వసతులు, సౌకర్యాలు చూసిన తర్వాత ఈ మూడేళ్లలో దాదాపు 50కు పైగా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి చేరినట్లు హెచ్‌ఎం షఫియా తెలిపారు. ప్రస్తుతం 235 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాలలో గత రెండేళ్లలో 90 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, 83 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ముగ్గురు విద్యార్థులు 500కు పైబడి మార్కులు సాధించారు. వీరిలో అరవింద్ 571 మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడు.