NMMS 2023 Exam: 3న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలకు ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష ఈనెల 3న జరగనుంది. గుంటూరు జిల్లాలో దర ఖాస్తు చేసిన 2,400 మంది విద్యార్థులకు గుంటూరు నగర పరిధిలో ఏడు, తెనాలిలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణపై ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులతో గురువారం గుంటూరు స్టాల్ బాలికోన్నత పాఠశాలలోని ప్రభుత్వ పరీక్షల విభాగంలో సమావేశమైన డీఈవో పి.శైలజ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లపై సూచనలు చేశారు. విద్యార్థులు హాల్ టికెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
చదవండి: Job Mela: ప్రతి నెలా అన్ని నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు
నేటి నుంచి అఖిలభారత ఫైన్ ఆర్ట్స్ ఫెస్ట్
ఏఎన్‌యూ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫైన్‌ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఫైన్‌ఆర్ట్స్ ఫెస్ట్, ఆర్ట్ ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభమవుతుంది. ఈ ఫెస్ట్‌లో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన ఏడు యూనివర్సిటీల నుంచి ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు పాల్గొంటున్నారు. చిత్రకళ, శిల్పకళా ప్రదర్శన, వర్క్‌షాప్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రంలో ఉదయం 10 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ ముఖ్య అతిధిగా హాజరవుతారు. రెక్టార్ ఆచార్య పి. వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి. కరుణ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీహెచ్ స్వరూపరాణి, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొంటారు.
3న తెనాలిలో జిల్లా హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక
తెనాలి: రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొననున్న జిల్లా హ్యాండ్‌బాల్ జట్ల ఎంపికను డిసెంబరు 3వ తేదీన తెనాలిలో నిర్వహించనున్నారు. క్రీడాకారుల ఎంపిక స్థానిక అన్నాబత్తుని సత్యనారాయణ క్రీడాస్టేడియంలో జరుగుతుందని జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 2008 సంవత్సరం లేదా ఆ తర్వాత పుట్టినవారై ఉండాలని సూచించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. ఎంపికై న జట్లు డిసెంబరు 9–10 తేదీల్లో తెనాలిలో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆడాల్సి ఉంటుందని వివరించారు.