Job Mela: ప్రతి నెలా అన్ని నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు
కొండపి(సింగరాయకొండ): నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం జాబ్‌మేళాలు నిర్వహిస్తోందని జిల్లా ఉపాఽధి కల్పనాధికారి టి.భరధ్వాజ పేర్కొన్నారు. కొండపి ప్రభుత్వ జూనియర్ కాలేజిలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ఆధారంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతి నెలా అన్ని నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు అన్ని నియోజకవర్గాల్లో స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పీఎంకేవై 4.0లో భాగంగా కొండపిలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌లో 120 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అసోసియేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, రిటైల్ అసోసియేట్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం కాలేజీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ను ప్రిన్సిపాల్ ఎం.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్.లోకనాథం మాట్లాడుతూ.. జాబ్‌మేళాకు 280 మంది యువత హాజరు కాగా 79 మంది ఎంపికయ్యారని, వీరిలో 27 మందికి కంపెనీ ఆఫర్ లెటర్స్ అందజేశామని వివరించారు. ఎంపీడీఓ రమణమూర్తి, ట్రైనర్ అజయ్‌కుమార్, సీడాప్ అధికారులు ఇమాంబీ, రాజేష్, రమేష్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఆరికట్ల కోటిలింగయ్య, మండల జేసీఎస్ కన్వీనర్ గొట్టిపాటి మురళి పాల్గొన్నారు.
జిల్లా ఉపాధి కల్పనాధికారి భరద్వాజ
చదవండి: Job Trends: స్కిల్ ఉంటేనే.. కొలువు!