New Exam Pattern in AP: విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీతే లక్ష్యంగా నూతన పరీక్ష విధానం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో విద్యార్థులకు ఆగస్టు ఒకటి నుంచి ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలను నిర్వహించనుంది. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు, అభ్యసన పద్ధతుల మదింపు లక్ష్యంగా ఏటా విద్యాశాఖ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ప్రయోగాత్మకంగా నూతన పరీక్ష పద్ధతులకు శ్రీకారం చుట్టింది. క్లాస్‌రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్ (సీబీఏ) పేరుతో పరీక్షలను నిర్వహిస్తోంది. అదే క్రమంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ నాలుగు ఫార్మేటివ్, రెండు సమ్మేటివ్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం నిర్వహించిన విధంగానే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు సీబీఏ, తొమ్మిది, పది తరగతుల వారికి ఫార్మేటివ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలి
సామర్థ్యాలను వెలికితీసే లక్ష్యంతో..
ఈ ఏడాది విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. పాఠశాల అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలను నిర్వహిస్తారు. జూన్, జూలై సిలబస్‌కు సంబంధించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మదింపునకు, సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా అభ్యసన లోపాలను గుర్తించి, ప్రత్యేక బోధన ద్వారా వారు సాధారణ స్థాయికి చేరుకునేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటారు.
బైలింగ్విల్ ప్రశ్నపత్రాలు
విద్యార్థులకు ఆంగ్లంలో ప్రశ్న పత్రం అర్థం కాకుంటే తెలుగులో చదువుకునేందుకు బైలింగ్విల్ ప్రశ్న పత్రాలను ప్రవేశ పెట్టారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ బైలింగ్విల్ పద్ధతిలో ప్రశ్న పత్రం ఉంటుంది. అలాగే పదో తగరతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ మీడియాల వారికి వేరువేరుగా ప్రశ్నపత్రాలను అందించనున్నారు. ప్రశ్నపత్రంలోని వివిధ ప్రశ్నలు మెకానికల్ అండర్ స్టాండింగ్ అప్లికేషన్ (ఎంయూఏ) ప్రశ్న పత్రం ఉంటుంది. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాల్సి ఉంటుంది. సీబీఏ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో నింపాల్సి ఉంటుంది.
School Education Department: క్లాస్ బేస్డ్ అసెస్‌మెంట్ పరీక్షలు తేదీలు ఇవే
ఐదో తేదీ వరకూ పరీక్షలు
సీబీఏ విధానంలో పరీక్షలను ఆగస్టు ఒకటి నుంచి ఐదో తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లాలోని ఎయిడెడ్, ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్యాల్లోని 1,01,097 మంది ప్రైవేట్ యాజమాన్యాల్లోని 1,10,622 మంది మొత్తం 2,11,719 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, జెడ్పీ యాజమాన్యాల్లోని 1,10,281 మంది విద్యార్థులు, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని 1,92,085 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 5,14,085 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. రెండు జిల్లాల్లో సుమారు 3247 ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది నుంచి టోఫెల్
అంతర్జాతీయ ప్రమాణాలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన మరో నూతన సంస్కరణ టోఫెల్ విధానం. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యూజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ (టోఫెల్)ను ఈ ఏడాది ప్రభుత్వం విద్యార్థులకు పరిచయం చేసింది. ఆడియో అండ్ ప్రాక్టీస్ పేపర్లను మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకూ అమలు చేస్తారు. గ్లోబల్ స్థాయి పోటీని తట్టుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దటం టోఫెల్ లక్ష్యం. ఇటీవల ప్రభుత్వం ఐఎఫ్‌పీ, స్మార్ట్ టీవీలను ఆయా ప్రభుత్వ విద్యాసంస్థలకు పంపిణీ చేసింది. అవి ఆయా పాఠశాలల్లో పూర్తిగా అందుబాటులోకి వచ్చిన ప్రాంగణాల్లో మాత్రమే ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
నేటి నుంచి ఎఫ్‌ఏ సీబీఏ–1 పద్ధతిలో పరీక్షలు 1 నుంచి 8 తరగతుల వరకూ ఓఎంఆర్ బేస్డ్ విధానంలో పరీక్షలు 9, 10 తరగతులకు నూతనంగా టోఫెల్ పరీక్షలు ఉమ్మడి జిల్లాలో పరీక్ష రాయనున్న5,14,085 మంది విద్యార్థులు