Joint Collector Jahnavi: విద్యార్థినులకు పాఠాలు చెప్పిన జేసీ
కోటవురట్ల: జాయింట్ కలెక్టర్ జాహ్నవి కోటవురట్లలో ఆకస్మికంగా పర్యటించారు. తొలుత తహసీల్దారు కార్యాలయాన్ని సందర్శించిన ఆమె సుమారు గంట సేపు రెవెన్యూ సిబ్బందితో సమీక్ష చేశారు. సమగ్ర భూ సర్వేకు సంబంధించి జరుగుతున్న జాప్యంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన గ్రామాలలో త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దారు జానకమ్మను ఆదేశించారు. రాట్నాలపాలెంలో గెడ్డ పోరంబోకును కొందరు అక్రమించుకుని ఇళ్లు కట్టేశారని, దీనిపై స్పందనలో కూడా ఫిర్యాదు చేశామని నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు జేసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి అక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దారు జానకమ్మకు ఆదేశాలిచ్చారు. అక్కడి నుంచి స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలకు వెళ్లి పరిసరాలు, టాయిలెట్స్ పరిశీలించారు. విద్యార్థులు చేతులు కడిగే ప్రాంతంలో బురదమయంగా ఉండడంతో ఇలా ఉంటే మీరేం చేస్తున్నారంటూ ఎంఈవో–2 శ్రీ జోష్‌ను ప్రశ్నించారు. అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పరిశీలించి దీనిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. స్లాబ్ లెవెల్ వరకు వచ్చాక ఆపేస్తే ఎలా పూర్తి చేయించండి అంటూ ఆదేశించారు. 9వ తరగతి గదిలోకి వెళ్లి ఆమె ఓ ఉపాధ్యాయురాలిగా మారిపోయారు. సిబ్బంది అందరినీ బయటకు పంపించేసి విద్యార్థులకు గణితం, సోషల్ సబ్జెక్టులలో పలు అంశాలు బోధించారు. బ్లాక్ బోర్డుపై గణితంలోని క్యూబిక్ చాప్టర్‌కు సంబంధించి సమస్యను రాసి ఎవరైనా పరిష్కరించాలని కోరారు. దాంతో ఓ విద్యార్థిని వచ్చి సమస్యను పరిష్కరించడంతో అభినందించారు. ఇలా సుమారు గంట పాటు విద్యార్థులకు పలు అంశాలను వివరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సాధారణ పరిశీలనలో భాగంగానే వచ్చినట్టు తెలిపారు. జిల్లాలో సమగ్ర భూ సర్వే పారదర్శకంగా జరుగుతోందన్నారు. మాకవరపాలెం తహసీల్దారు కార్యాలయంలో రాత్రి సమయంలో విశ్రాంత ఉద్యోగితో రికార్డుల పరిశీలన విషయంపై వివరణ కోరగా దానిపై విచారణ చేస్తున్నామని, అక్రమాలు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. డీటీ సోమశేఖర్, ఉపాధ్యాయులు ఉన్నారు.
SVDC Degree College: విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టిసారించాలి