Skip to main content

Good news for students: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ ఇక నుండి బడిలో పసందైన భోజనం

Good news for students
Good news for students

విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న గోరుముద్ద(మధ్యాహ్న భోజనం)ను విద్యార్థులకు మరింత రుచిగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జూన్‌ 12న పాఠశాలలు తెరుస్తున్నందున విద్యార్థులకు నాణ్యమైన చదువులతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేసేలా ఏర్పాట్లు చేసింది.

ఇందులో భాగంగా మధ్యాహ్నం భోజనం వండే ఏజెన్సీల వారికి మరింత రుచిగా వంట ఎలా తయారు చేయాలనే దానిపై శిక్షణ ఇచ్చింది. మండల స్థాయిలో ఎంపిక చేసిన కొంత మందికి విజయవాడలోని తాజ్‌ హోటల్‌ చెఫ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వగా..

అక్కడ శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో వంట ఏజెన్సీల వారికి మెలకువలు నేర్పించారు. సోమవారం ఆనందపురం, గాజు వాక, పెందుర్తి, పద్మనాభంలో, మంగళవారం పెదగంట్యాడ, చినగదిలి, భీమునిపట్నం, విశాఖ అర్బన్‌లో శిక్షణ శిబిరాలు జరిగాయి.

విద్యార్థులు మైమరిచి తినేలా వంటకం

జిల్లాలో 11 మండలాల్లోని 587 పాఠశాలల్లో వంట తయారీలో పాల్గొంటున్న 1,019 మంది కుక్‌ కమ్‌ హెల్పర్లను ఈ ప్రత్యేక శిక్షణలో భాగస్వాములను చేశారు. విద్యార్థులకు ప్రతి రోజూ రుచికరమైన వంటకాలు తయారు చేసి పెట్టేలా తర్ఫీదు ఇచ్చారు.

ఇందులో భాగంగా నిర్వాహకులకు వంటల పోటీలు నిర్వహించి.. ఆహా అనిపించే వంటకం తయారు చేసిన వారికి బహుమతులు అందజేశారు. శిక్షణను విజయవంతం చేసేలా జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకం కార్యక్రమాన్ని పర్యవేక్షించే విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అరుణ జ్యోతి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శిక్షణ కార్యక్రమాలను ఆమె స్వయంగా పర్యవేక్షించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

విద్యార్థులంతా భోజనం తినేలా..

జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని 587 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తుండగా.. 87,500 మంది విద్యార్థులు దీని ద్వారా లభ్ధి పొందుతున్నారు. ఇందులో 388 పాఠశాలల్లోని 47,010 మంది విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భోజనం అందిస్తున్నారు.

ఒకటి నుంచి 5వ తరగతి వరకు గల విద్యార్థులు 99 శాతం మేర బడిలోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. కానీ అప్పర్‌ ప్రైమరీలో 81 శాతం, హైస్కూల్లో చదివే విద్యార్థులు 78 శాతం మంది భోజనం తింటున్నారు. ఈ లెక్కన కొంతమంది ఇంకా ఇళ్ల వద్ద నుంచే బాక్సులు తెచ్చుకుంటున్నారని ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది.

దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం బడికి వచ్చే విద్యార్థులంతా కచ్చితంగా గోరుముద్ద పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

వంట నిర్వాహకులకు గుర్తింపు

విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం అందించడంతో పాటు పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేలా విద్యాశాఖ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 664 మంది ఆయాలను నియమించారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయాల నియామకం జరిగింది. వీరికి ఒక్కొక్కొరికి నెలకు రూ.6 వేల వేతనం చెల్లిస్తున్నారు. జిల్లాలో 1,019 మంది వంట నిర్వాహకులు పనిచేస్తుండగా, వీరికి టీడీపీ హయంలో నెలకు రూ.1000లను మాత్రమే ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వీరి గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచింది.

ఇదీ మెనూ

సోమవారం: హాట్‌ పొంగల్‌, ఉడికించిన గుడ్డు/ పలావ్‌తో ఎగ్‌ కర్రీ, వేరుశనగ చిక్కీ

మంగళవారం: దొండకాయ చట్నీతో చింతపండు పులిహోర, ఉడికించిన గుడ్డు

బుధవారం: కూరగాయల అన్నం, బంగాళదుంప కూర్మా, ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కీ

గురువారం: సాంబార్‌ బాత్‌ లేదా టమాటా చట్నీతో నిమ్మకాయ రైస్‌, ఉడికించిన గుడ్డు

శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గడ్డు, వేరుశనగ చిక్కీ

శనివారం: ఆకుకూర అన్నం, పప్పు చారు

Published date : 30 May 2024 01:07PM

Photo Stories