Skip to main content

Children: ఇంగ్లిష్‌ రెయిమ్స్‌ బాగా గుర్తు పెట్టుకుంటున్నారు

English rhymes are well remembered

తన సెల్‌ ఫోన్‌లో ఇంగ్లిష్‌ రెయిమ్స్‌ చూపిస్తూ పలికిస్తున్న ఈమెపేరు సుమలత. ఆళ్లగడ్డ రూరల్‌ మండలం జి.జమ్ములదిన్నె. స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త తల్లులకు అందరికి ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసి అందులో ‘ఇంటివద్దకే విద్య – ఆటపాటల విద్య’ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు వేస్తుంది. సుమలత వాటిని ఖాళీ సమయంలో, సెలవు దినాల్లో పిల్లలకు చూపిస్తూ పలికిస్తుంది. దీని వల్ల తన పిల్లలు ఇంగ్లిష్‌ రెయిమ్స్‌ మరిచిపోకుండా బాగా గుర్తుకు పెట్టుకుంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు 8
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు 1,620
మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 43
గర్భిణులు 14,319 బాలింతలు 13,077
0 – 6 నెలల శిశువులు
బాలలు బాలికలు    8,537        8,011
7 నెలల నుంచి 1 సంవత్సరం లోపు 7,641 7,057
1 సంవత్సరం నుంచి 3 ఏళ్ల లోపు 25,974 24,163
3 నుంచి 6 సంవత్సరాల లోపు 20,009 19,453

ఆళ్లగడ్డ: సెలవు దినాలు, ఖాళీ సమయాల్లో చిన్నారుల విద్యాభ్యాసానికి, తల్లులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య విషయాలను మరింత మెరుగు పరిచేందుకు సమగ్ర సీ్త్ర శిశు సంక్షేమశాఖ (ఐసీడీఎస్‌) వినూత్న ఆలోచన చేసింది. తమ సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టింది. సాంకేతికతను అందిపుచ్చుకుని సేవల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. తల్లిదండ్రుల వాట్సాప్‌ నంబరులతో గ్రూపులు ఏర్పాటు చేసి ‘ఇంటివద్దకే విద్య – ఆటపాటల విద్య’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నపిల్లలకు ఒత్తిడి లేకుండా గుర్తిండిపోయేలా ఆటపాటలతో కూడిన విద్యతో పాటు గర్భిణులు, బాలింతలకు పోషకాహారం, శారీరక మానసిక ఉల్లాసానికి దోహదం చేసేలా నిత్యం ఒక కొత్త అంశాన్ని వీడియో రూపంలో పంపి ఖాళీ సమయాల్లో వాటిని పిల్లలకు నేర్పించడంతో పాటు తల్లులు అవగాహన పొందడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

చ‌ద‌వండి: ఉపాధ్యాయుల శ్రమ వెలకట్టలేనిది: ఎమ్మెల్యే

రోజుకో అంశం..
చిన్నారుల మానసిక ఉల్లాసానికి దోహదం చేసేలా ఇంటివద్దే ఆడుతూ.. పాడుతూ చిన్నచిన్న కథలను వాట్సాప్‌ గ్రూపుల్లో పెడుతారు. రోజు ఒక ఆంగ్ల పదం నేర్పిస్తారు. ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా కొత్త అంశాలు, పాటలను వీడియోల రూపంలో తల్లుల సెల్‌ఫోన్‌ వాట్సాప్‌లకు పంపిస్తారు. వీటిని ఇంటివద్ద ఖాళీ సమయంలో చిన్నారులు చూసి సాధన చేయించేలా అంగన్‌వాడీ కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు.

ఎప్పుడు.. ఏం తినాలి..
మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు తల్లి, బిడ్డకు తగిన పోషకాలు అందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి. ఏఏ మందులు ఏ సమయంలో వేసుకోవాలి తదితర అంశాలను వాట్సాప్‌లో మెసేజ్‌ ద్వారా అవగాహన కల్పిస్తారు. ఏమాత్రం అనారోగ్య లక్షణాలున్నా ఆలస్యం చేయకుండా అంగన్‌వాడీ కార్యకర్తలు ఏఎన్‌ఎంలకు తెలియజేయాలని సూచిస్తారు. బాలింతలు ప్రసవమైన ఆరు నెలల వరకు పిల్లలకు పాలు ఇచ్చేలా చూడటంతో పాటు వ్యాక్సినేషన్‌ గురించి వాట్సాప్‌మెసేజ్‌ ద్వారా గుర్తు చేస్తారు. దీంతో పాటు అంగన్‌వాడీ కేంద్రం ద్వారా బియ్యం, గుడ్లు, బెల్లం, పాలు, కందిపప్పు, అటుకులు, రాగిపిండి, ఖర్జూరం, చిక్కీలు తదితర వాటిని సకాలంలో తీసుకునేలా అప్రమత్తం చేస్తున్నారు.

చ‌ద‌వండి: Teachers Excellence: గురువుల‌కు గౌర‌వంతో స‌త్కారాలతో పాటు అభినంద‌న‌లు

బుజ్జాయిలకు గుర్తుండిపోయేలా!
అంగన్‌వాడీ కేంద్రాల్లో షెడ్యుల్‌ ప్రకారం బోధించే పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోలను ముందుగానే తల్లుల సెల్‌ఫోన్‌లకు వాట్పాప్‌ పంపిస్తారు. 3, 4 ఏళ్ల లోపు పిల్లలకు పి పి – 1, నాలుగేళ్లు పైబడిన వారికి పి పి – 2 పాఠ్యాంశాలను వాట్సాప్‌ గ్రూపుల్లో పంపిస్తారు. అక్షరాస్యులైన తల్లులు, కుటుంబ సభ్యులు వీటిని పనిశీలించి చిన్నారులకు ఇంట్లో మరోసారి వివరించాల్సి ఉంటుంది.

సద్వినియోగం చేసుకోవాలి
తల్లీ బిడ్డల సంరక్షణతో పాటు చిన్నారులకు సులువుగా అర్థమయ్యేలా సృజనాత్మకంగా బోధన అందించేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం ప్రత్యేకంగా తల్లుల గ్రూప్‌లను ఏర్పాటు చేస్తున్నాం. అందులో చిన్నారులు, తల్లులు, గర్భిణులు ఎలా నడుచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వీడియోలు పంపించడంతో పాటు ఏదైనా సందేహాలు ఉంటే సంబంధిత కార్యకర్తతో వాట్సాప్‌ గ్రూప్‌లో మెసేజ్‌ చేసి నివృత్తి చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం.
– నిర్మల, సీ్త్ర శిశు సంక్షేమ సాధికారిత జిల్లా అధికారిణి

సత్ఫలితమిస్తున్న ‘ఇంటివద్దకే విద్య – ఆటపాటల విద్య’ కార్యక్రమం బుజ్జాయిలకు వీడియోలతో విద్యాబోధన ప్రత్యేకంగా తల్లుల వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు

ప్రస్తుతం ఏ ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకెళ్లి చూసినా మార్కులే ప్రామాణికంగా బట్టీ కొట్టే చదువులు కొనసాగుతున్నాయి. దీని వల్ల పిల్లలపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యనందిస్తోంది. చిన్నారులను ఆకట్టుకునేలా ఆటవస్తువులు, రంగురంగు బొమ్మలతో పాఠాలు బోధిస్తోంది. దీంతో పాటు పిల్లల వికాసానికి దోహదపడేలా వీడియోపాఠాలతో ఇళ్ల వద్ద పునశ్చరణ జరిగేలా ‘ఇంటివద్దకే విద్య – ఆటపాటల విద్య’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ వినూత్న కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలిస్తోంది.

Published date : 06 Sep 2023 06:07PM

Photo Stories