disciplined education: క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి
వేలూరు: విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య ను అభ్యసించి దేశాభివృద్ధికి దోహద పడాలని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ అన్నారు. వేలూరు జిల్లా కన్నియంబాడి ప్రభుత్వ పాఠశాలలో మా పాఠశాల మిలరుం పాఠశాల అనే పథకాన్ని ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణంతోపాటు తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇందుకు విద్యార్థులు, టీచర్‌లు సంయుక్తంగా పనిచేసి రాష్ట్రస్థాయిలో ఆదర్శ పాఠశాలగా తీసుకురావాలని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని తల వెంట్రుకలను సక్రమంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటే మీరు చదివే పాఠశాలతో పాటు మీరు కూడా అభివృద్ధి చెందగలరన్నారు. అనంతరం విద్యార్థులతో పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఆర్కాడు ఎమ్మెల్యే ఈశ్వరప్పన్, విద్యాశాఖ సీఈఓ మణిమొయి, పాఠశాల హెచ్‌ఎం గోపినాథన్, యూనియన్ చైర్మన్ దివ్య, వైస్ చైర్మన్ గజేంద్రన్, యూనియన్ కార్యదర్శి కలైచంద్రన్, సర్పంచ్‌లు సెల్వి, జ్యోతిలక్ష్మి, శివకుమార్ పాల్గొన్నారు.