Consumers Club in Schools: వినియోగదారుల క్లబ్ ఏర్పాట్ల గురించి కలెక్టర్ మాటల్లో
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లాలో వినియోగదారుల ఉద్యమాన్ని మరింత చైతన్యవంతం చేయడంలో భాగంగా ప్రతి పాఠశాలలో వినియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వినియోగదారుల క్లబ్‌లు, వినియోగదారులను చైతన్యపరిచే 9 రకాల పోస్టర్లను జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు వారి హక్కులు, పరిష్కార విధానాల గురించి అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన వినియోగదారులుగా వ్యవహరించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇదే పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్‌ల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలోని 224 వినియోగదారుల క్లబ్‌ల ద్వారా రోజూ సెమినార్లు, వర్క్‌షాప్‌లు, చర్చలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
224 వినియోగదారుల క్లబ్‌లు
జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి మాట్లాడుతూ జిల్లాలో 224 వినియోగదారుల క్లబ్‌లను పాఠశాలల్లో ఏర్పాటుచేశామన్నారు. ఎంపిక చేసిన 224 అధ్యాపకులు (టీచర్ గైడ్స్), విద్యార్థి ఆఫీస్ బేరర్లచే క్లబ్‌లు నిర్వహిస్తున్నారన్నారు. వినియోగదారుల అవగాహన, వినియోగదారుల హక్కులు, బాధ్యతలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక మ్యాగజైన్ ‘మేము సైతం’, 9 రకాల పోస్టర్లను విడుదల చేశామన్నారు. ఆహార భద్రత, కల్తీని ఎదుర్కోవడం, భారతదేశంలో సైబర్ చట్టాలు, డిజిటల్ అక్షరాస్యత, కార్పొరేట్ సామాజిక బాధ్యత, తప్పుదోవ పట్టించే ప్రకటనలు వంటి వివిధ అంశాలపై క్లబ్ సెమినార్లను నిర్వహిస్తుందన్నారు.
క్లబ్‌ల ఏర్పాటు ఇలా..
మండలాల వారీగా ఆగిరిపల్లిలో 5, భీమడోలులో 6, బుట్టాయగూడెంలో 15, చాట్రాయిలో 7, చింతలపూడిలో 10, దెందులూరులో 8, ద్వారకా తిరుమలలో 4, ఏలూరులో 22, జంగారెడ్డిగూడెంలో 10, జీలుగుమిల్లిలో 6, కై కలూరులో 8, కలిదిండిలో 9, కామవరపుకోటలో 5, కొయ్యలగూడెంలో 6, కుకునూరులో 7, లింగపాలెంలో 6, మండవల్లిలో 7, ముదినేపల్లిలో 8, ముసునూరులో 8, నిడమర్రులో 11, నూజివీడులో 11, పెదపాడులో 9, పెదవేగిలో 12, పోలవరంలో 6, టి.నరసాపురంలో 5, ఉంగుటూరులో 8, వేలేరుపాడులో 5 వినియోగదారుల క్లబ్‌లను ఏర్పాటుచేసినట్టు జేసీ వివరించారు. ఇన్‌చార్జి డీఆర్‌ఓ సూర్యనారాయణ రెడ్డి, జెడ్పీ సీఈఓ కె.రవికుమార్, ఏలూరు ఆర్డీఓ ఎస్‌కే ఖాజావలి, డీఎస్‌ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ రాజు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంజూ భార్గవి, డీఈఓ శ్యామ్‌సుందర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
-కలెక్టర్ ప్రసన్న వెంకటేష్