School Complex Meeting: స్కూల్ కాంప్లెక్స్ సమావేశ తేదీల్లో మార్పు
వీరఘట్టం: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించాల్సిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశ తేదీల్లో స్వల్ప మార్పులు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు రోజుల్లో భాషోత్సవాలు, ఇతర కార్యక్రమాలు ఉండడంతో ఈ నెల 30, 31 తేదీలకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను మార్చినట్లు ఆయన తెలిపారు. తొలుత ప్రకటించిన పాఠశాలల్లోనే యథావిధిగా కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతాయని ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమినించాలని కోరారు.
మధురమైనది మాతృ భాష
విజయనగరం: మన మాతృ భాష తెలుగు మధురమైనదని, అమ్మభాష అమృత తుల్యమని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ అధ్యక్షతన ఆదివారం జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. మాతృ భాషను పరిరక్షించుకోవాలని అన్నారు. గురుప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష వైభవాన్ని, చారిత్రక వారసత్వాన్ని, కావ్య గౌరవాన్ని కాపాడినప్పుడే భాష అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర స్థాయి కవి సమ్మేళనంలో సుమారు 50 మంది కవులు తమ కవితలను వినిపించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పద్య పఠనం పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. మానాప్రగడ శేషశాయి పేరిట పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త కొట్టు బాబూరావుకు ప్రదానం చేశారు. నడక పోటీలలో జిల్లా స్థాయి విజేతలకు పతకాలను బహూకరించారు. అనంతరం నారంశెట్టి ఉమామహేశ్వరరావు దంపతులకు కుసుమంచి సుబ్బారావు, గురుప్రసాద్ దంపతులు ఘనంగా సత్కరించారు. సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, భైరవభట్ల ఆదిత్య, శుభకర సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకుడు పులిపాటి రామారావు, గిరిజా ప్రసన్న, మానాప్రగడ సాహితి, గురజాడ ఇందిర, చివుకుల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Education System: విద్యా సంస్కరణల ఆద్యుడు సీఎం జగన్