Skip to main content

Artificial Intelligence: బడికొస్తున్న ‘మేధావి’!

నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: వెంకటేష్‌ గతంలో పది రోజుల పాటు పాఠశాలకు రాకపోయినా ప్రధానోపాధ్యాయుడికే సమాచారం లేని పరిస్థితి! వందల మంది విద్యార్థుల్లో ఎవరు సక్రమంగా వస్తున్నారో.. ఎంతమంది డుమ్మా కొట్టారో తెలుసుకోవాలంటే అటెండెన్స్‌ రిజిస్టర్లు తిరగేయాల్సిందే! ఆ వివరాలన్నీ సేకరించి హెచ్‌ఎం దృష్టికి వెళ్లేసరికి రోజులు గడిచిపోయేవి! ఇప్పుడు ఓ విద్యార్థి పాఠశాలకు రాకుంటే హెచ్‌ఎంకే కాదు.. ఏకంగా విజయవాడలోని విద్యాశాఖ కమిషనర్‌కు కూడా నిమిషాల్లో తెలిసిపోతోంది.
Artificial Intelligence
బడికొస్తున్న ‘మేధావి’!

ఒక్క రోజు బడికి గైర్హాజరైనా తల్లిదండ్రులకు సమాచారం అందుతోంది. ఉపాధ్యాయులు సమయానికి రాకున్నా, విద్యార్థులకు తాగునీరు అందకపోయినా, మరుగుదొడ్ల తలుపు విరిగిపోయినా ఉన్నతాధికారులు తక్షణమే గుర్తిస్తున్నారు. తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) టెక్నాలజీ సాయంతో పాఠశాల విద్యాశాఖ సాధించిన విజయం.  

నూరు శాతం ఫలితాలు.. 

ప్రతి విద్యార్థీ క్రమశిక్షణ పాటిస్తూ రోజూ బడికి వెళ్లి చక్కగా చదువుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తోంది. పుస్తకాల నుంచి ఫీజుల దాకా తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకుండా భావి పౌరులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్ది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంగ్లిష్‌ మీడియంలో చదువులతోపాటు  టోఫెల్‌ లాంటి పరీక్షలకు సైతం ఉచితంగా తర్ఫీదునిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా మన విద్యార్థులను సిద్ధం చేస్తోంది.

ఈ క్రమంలో కొండకోనల్లోని స్కూళ్లను సైతం పర్యవేక్షించేలా గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక సాంకేతిక విభాగం ఇప్పుడు దేశంలోనే ఉత్తమ పనితీరుతో ముందంజలో నిలుస్తోంది. రాష్ట్రంలోని 58,465 పాఠశాలల్లో జరిగే అన్ని కార్యకలాపాలు, విద్యార్థుల మంచిచెడులు, ఉపాధ్యాయుల స్థితిగతులు, నాడు–నేడు పనులను ‘ఏఐ’ టెక్నాలజీతో నిరంతరం ఉన్నతస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు తక్కువ వ్యవధిలోనే నూరు శాతం ఫలితాలు సాధించారు.   

చదవండి: Career Opportunities: ఈ కోర్సులు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు

అత్యుత్తమ కమాండ్‌ సెంటర్లు మనవే..  

నిన్న మొన్నటి దాకా ఇంటి నుంచి కాలు బయటపెట్టిన విద్యార్థి సక్రమంగా స్కూలుకు వెళ్లాడో లేదో అంతు చిక్కని పరిస్థితి. టీచర్‌ స్కూల్‌కు వచ్చారో లేదో కనీసం ఎంఈవో దృష్టికి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ముందస్తు సమాచారం లేకుండా బడి మానేసినా.. ఉపాధ్యాయుడు సెలవు పెట్టకుండా స్కూలుకు రాకున్నా ఆ విషయం విద్యాశాఖ కమిషనర్‌కు, ప్రధాన కార్యదర్శికి, సంబంధిత మంత్రికి సైతం గంట వ్యవధిలోనే తెలిసిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న 70,70,143 మంది విద్యార్థులు, 3,01,677 మంది ప్రభుత్వ టీచర్ల హాజరును కాగితాలతో పని లేకుండా నిత్యం నిశితంగా పరిశీలిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ వ్యవస్థలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో రెండు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను (విద్యా సమీక్ష కేంద్రాలు)నెలకొల్పి విద్యార్థుల హాజరు మొదలు గోరుముద్ద, విద్యాకానుక, అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు లాంటి సమస్త అంశాలను దీనికి అనుసంధానించారు.

ఇలాంటి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు దేశంలో మూడు (గుజరాత్, ఢిల్లీ, ఏపీ) మాత్రమే ఉండగా అత్యుత్తమ పనితీరుతో పూర్తిగా ఆన్‌లైన్‌ (పేపర్‌ లెస్‌) విధానాన్ని అనుసరిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ సెంటర్‌ సమర్థంగా సేవలు అందించడంతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రతి రోజు 99.50 శాతం హాజరు నమోదవుతుండడం విశేషం. ఎంతో విజయవంతమైన మన ఎడ్యుకేషన్‌ టెక్నాలజీని పక్క రాష్ట్రాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.   

చదవండి: Artificial Intelligence: ఏఐ.. చేస్తుందిక ఇంటర్వ్యూ!

అటెండెన్స్‌ యాప్‌లో ఎప్పటికప్పుడు 

రాష్ట్రంలో 58,465 పాఠశాలలు (44,372 ప్రభుత్వ, 847 ఎయిడెడ్, 13,189 ప్రైవేట్, 57 కేంద్ర ప్రభుత్వ పరిధిలోవి) ఉండగా వీటిలో 70,70,143 మంది విద్యార్థులు చదువుతున్నారు. అమ్మ ఒడి పథకానికి విద్యార్థుల హాజరును పరిగణలోకి తీసుకుంటూ అన్ని యాజమాన్యాల్లో చదువుతున్న విద్యార్థుల హాజరును రోజూ మొబైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకల్లా విద్యార్థుల హాజరును ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే గోరుముద్ద, కోడిగుడ్డు, రాగిజావ, చిక్కీ తీసుకునేవారి వివరాలు ‘ఏఐ’ టెక్నాలజీ అటెండెన్స్‌ యాప్‌లో నమోదవుతున్నాయి.

ఇదే తరహాలో ఉపాధ్యాయుల ఫేషియల్‌ రికగ్నేషన్‌ సైతం ఉదయం 9 నుంచి 9.15 గంటల మధ్య స్కూలు పరిధిలోనే ఫొటోతో నమోదు చేయాలి. నెట్‌ సౌకర్యం లేకున్నా అందుబాటులోకి రాగానే టైమ్‌తో సహా అప్‌డేట్‌ అయ్యేలా టెక్నాలజీని రూపొందించారు.  ‘‘స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ మానిటరింగ్‌ సిస్టం’’ (సిమ్స్‌)లో రికార్డయ్యే వివరాలు ఉదయం 11– 12 గంటల్లోగా విజయవాడ, విశాఖల్లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు చేరుతున్నాయి.

ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యా సంబంధ గ్రీవెన్స్, పాఠశాల పర్యవేక్షణ, గోరుముద్ద, కన్‌స్టెంట్‌ రిథమ్‌(నాడు–నేడు), విద్యాకానుక, బైజూస్, డీబీటీ అంశాలను అనుసంధానించారు. గత సెపె్టంబర్, అక్టోబర్‌ నాటికి రోజుకు 68 శాతం కంటే తక్కువగా ఉన్న విద్యార్థుల హాజరు ఈ టెక్నాలజీ రాకతో ఇప్పుడు 99.50 శాతానికి పైగా నమోదవుతోంది. నెట్‌వర్క్‌ సరిగాలేని ఒకటి రెండు జిల్లాల్లోని కొన్ని పాఠశాలలు మినహా మిగిలిన అన్నిచోట్లా నూరు శాతం ఫలితాలు రావడం గమనార్హం.   

జిల్లాకు ఇద్దరు చొప్పున పర్యవేక్షణ 

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బంది మధ్యాహ్నం 12 గంటల నుంచి బడికి గైర్హాజరైన విద్యార్థుల వివరాలను గుర్తించి తల్లిదండ్రుల ఫోన్‌కు మెస్సేజ్‌లు పంపుతున్నారు. ఒక్క రోజు రాకుంటే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తుండగా వరుసగా మూడు రోజులు గైర్హాజరైతే విద్యార్థి ఇంటి పరిధిలోని వలంటీర్‌కు, గ్రామ / వార్డు ఎడ్యుకేషన్‌ కార్యదర్శికి, ఎంఈవో, డీఈఓలకు సమాచారం అందుతోంది. అందుకు కారణాలను తెలుసుకుని ఆ వివరాలను యాప్‌లో నమోదు చేసి సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది.

ఇందుకోసం జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది సిబ్బందితోపాటు జోన్‌కు ఒక్కరు చొప్పున నలుగురు పర్యవేక్షకులు విధులు నిర్వర్తిస్తూ ఏ రోజు అంశాలను అదేరోజు పరిష్కరిస్తున్నారు. విజయవాడ సెంటర్‌ నుంచి టీచర్ల అటెండెన్స్, గోరుముద్ద, బైజూస్, అకడమిక్‌ అంశాలను పరిశీలిస్తుండగా విశాఖ కేంద్రంగా విద్యార్థుల హాజరు, కన్‌స్టెన్‌ రిథమ్, జేవీకే, డీబీటీ అంశాలను పర్యవేక్షిస్తున్నారు.   

సచివాలయాలతో అనుసంధానం 

నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డబుల్‌ డెస్క్‌ బెంచీలు, ఫ్యాన్లు, స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీ స్క్రీన్లు, టాయిలెట్లు, ఆర్వో తాగునీరు లాంటి వసతులను ప్రభుత్వం కల్పించింది. వీటిని ప్రతినెలా పరిశీలించేలా గ్రామ / వార్డు సచివాలయాల సిబ్బందిని విద్యాశాఖ పోర్టల్‌తో అనుసంధానించారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది వారంలో ఒకసారి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేయాలి.

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సైతం నిర్ణీత వ్యవధిలో స్కూల్లో సమస్యలను గుర్తించి ఫొటోతో సహా యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇలా స్కూలు హెచ్‌ఎం నుంచి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి వరకు అన్ని స్థాయిల్లో పరిశీలిస్తారు. ఈ విధానంలో ఎవరికి వారే బాధ్యులు, వారికి వారే పర్యవేక్షకులు. అన్ని అంశాలు పారదర్శకంగా జరిగేలా టెక్నాలజీ అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది.  
 
ఒక్క క్లిక్‌తో పర్యవేక్షణ.. 
గతంలో పాఠశాలలో ఏం జరుగుతోందో జిల్లా అధికారులకు కూడా తెలిసేది కాదు. ఇక రాష్ట్ర స్థాయికి చేరుకునే ఊసే లేదు. ఇప్పుడు అన్ని అంశాలను టెక్నాలజీ పర్యవేక్షిస్తోంది. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తోంది. గతేడాది అక్టోబర్‌లో విజయవాడలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. మరో సెంటర్‌ను ఈ ఏడాది జూన్‌లో విశాఖలో అందుబాటులోకి తెచ్చాం.

దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు, 3 లక్షల మంది ఉపాధ్యాయులు, 58 వేల పాఠశాలలను ఒక్క క్లిక్‌తో పర్యవేక్షించవచ్చు. స్కూళ్ల నిర్వహణ, బోధనలో నూరు శాతం పారదర్శకంగా విజయవంతంగా ఫలితాలను నమోదు చేశాం. అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ ఉండడంతో ఎక్కడా తప్పు జరిగేందుకు ఆస్కారం లేదు.  
– కాటమనేని భాస్కర్, పాఠశాల మౌలిక వసతుల కమిషనర్‌  

Published date : 14 Aug 2023 04:20PM

Photo Stories