Career Opportunities: ఈ కోర్సులు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు
మురళీనగర్ (విశాఖ ఉత్తర): మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మనం మారాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి చెప్పారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆమె కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం సాంకేతిక విభాగంలో ఆనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునే విధంగా తర్ఫీదు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇండస్ట్రియల్ కనెక్టెడ్ కోర్సులను నేర్చుకునే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెకట్రానిక్స్, రోబోటిక్స్, ఏఆర్‌వీఆర్, సీఎన్‌సీ, డ్రోన్ టెక్నాలజీ వంటి కోర్సులు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆమె వివరించారు. సంప్రదాయ కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే కోర్సులకు ప్రాధాన్యాతని వ్వాలన్నారు.
Rural Development Trust: ప్రతిభకు ప్రోత్సాహం.. అన్నీ ఉచితమే...
క్యాంపస్ ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత
ఈ ఏడాది కూడా పరిశ్రమల అవసరాలను తీర్చే విధంగా ఎక్కువ మంది ఉద్యోగాల్లో చేరేందుకు విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఇంటర్వ్యూలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించే విధంగా శిక్షణ నివ్వాలన్నారు. ఇందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పరిశ్రమలకు అవసరమైనంత మందిని మనం ఇవ్వాల్సి ఉందన్నారు. కెరీర్ గైడెన్స్ ఇవ్వాలన్నారు. పాలిటెక్నిక్ కోర్సు పూర్తికాగానే వంద శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందే విధంగా కృషి జరగాలన్నారు. కంపెనీలతో ఎంవోయూలు చేసుకోవడంతో పాటు వారితో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ సమన్వయంతో పనిచేయాలన్నారు. కాలేజీ సిబ్బంది వారి బ్రాంచ్‌లకు సంబంధించిన ఆధునిక పోకడలను తెలుసుకుంటూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే విధంగా నూతన ప్రాజెక్టులు రూపొందించేందుకు కృషి చేయాలన్నారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్‌కు (ఎన్‌బీఏ) విశాఖ నగరం నుంచి అన్ని పాలిటెక్నిక్ కాలేజీలు చెందిన అన్ని బ్రాంచ్‌లు గుర్తింపు పొందాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆముదాలవలస, శ్రీకాకుళం, అనకాపల్లి, విజయవాడ, గన్నవరం, కుప్పం, కళ్యాణ దుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు ఎన్‌బీఏ గుర్తింపు పొందినట్లు చెప్పారు. ఇతర కాలేజీలు కూడా ఎన్‌బీఏ గుర్తింపు పొందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఎన్‌బీఏ గుర్తింపునకు వెంటనే వెళ్లాలని ఆమె ఆదేశించారు.
AP Electricity Department: జూనియర్ లైన్‌మెన్లు రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ..
ఈ సందర్భంగా ఇటీవల బిర్లా కంపెనీలో ఉద్యోగాలు పొందిన ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ (గైస్) బాలికలకు నియామకపత్రాలను ఆమె అందించారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, పాలిటెక్నిక్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కేడీవీ నరసింహారావు, కంచరపాలెం కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సెమ్స్‌ను సందర్శించి శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. మెకట్రానిక్స్, రోబోటిక్స్, ఏఆర్‌వీఆర్, సీఎన్‌సీ కోర్సులల్లో జరుగుతున్న తరగతులను, లేబొరేటరీలను ఆమె పరిశీలించారు.