Art competitions: అక్టోబర్ 2న విద్యార్థులకు చిత్రకళ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న విద్యార్థులకు చిత్రకళ పోటీల్ని నిర్వహిస్తున్నట్టు పల్నాడు విజ్ఞాన కేంద్రం కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి తెలిపారు. కేంద్రం ఆవరణలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. సబ్ జూనియర్స్ విభాగంలో 3,4,5 తరగతుల విద్యార్థులు గాంధీ బొమ్మ, జూనియర్స్ విభాగంలో 6,7,8 తరగతుల విద్యార్థులు పచ్చదనం–పరిశుభ్రత, సీనియర్స్ విభాగంలో 9,10 తరగతుల విద్యార్థులు గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అంశాలపై చిత్రాలు గీయాలని ఆయన తెలిపారు. నరసరావుపేట పట్టణం, మండలం, నకరికల్లు, రొంపిచర్ల మండలాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులు పోటీలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. పోటీల్ని నిర్వహించేందుకు విశ్రాంత ఉపాధ్యాయుడు కట్టా కోటేశ్వరరావు కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (విజయవాడ) మేనేజింగ్ కమిటీ సభ్యుడు యు.వి. రామరాజు, గాంధీ స్మారకసమితి అధ్యక్షుడు ఈదర గోపీచంద్, చిత్రకారులు చిన్నా, నాగయ్య పాల్గొన్నారు.
విధి నిర్వహణలో ఆలసత్వం వద్దు డెప్యూటీ డైరెక్టర్ ఓబుల్ నాయుడు
గురజాల : విధి నిర్వహణలో ఆలసత్వం వద్దని డెప్యూటీ డైరెక్టర్ ఓబుల్ నాయుడు సూచించారు. స్థానిక బాలుర వసతి గృహంలో బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న 4వ తరగతి ఉద్యోగులైన వంట మనుషులు, కమాటీ, వాచ్‌మెన్‌లకు వర్కుషాపు నిర్వహించారు. విధులు, బాధ్యతలు, విద్యార్థులతో మెలిగే విధానంపై డెప్యూటీ డైరెక్టర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఏఎస్‌డబ్ల్యూవో సుజాత కుమారి, వార్డెన్లు పాల్గొన్నారు.
ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని మణిపురం బ్రిడ్జి దిగువున ఉన్న నేషనల్ అకాడమీ కన్‌స్ట్రక్షన్స్‌లో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ ద్వారా స్యూయింగ్ మిషన్ ఆపరేటర్, ఏసీ ఫీల్డ్ టెక్నీషియన్, సీసీ టీవీ ఇన్‌స్టాలేషన్ టెక్నీషియన్ కోర్సుల్లో టెన్త్, ఆపైన విద్యార్హతలు ఉన్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగులైన యువతీ, యువకులు సెప్టెంబర్ 30లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు తమ ప్రతినిధి ఎస్.సైదులు నాయక్‌ను 9533219919 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.