Skip to main content

ఖండాలు

ఆసియా
ఆసియా ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. ఇది 10°ల దక్షిణ అక్షాంశం, 80°ల ఉత్తర అక్షాంశాల మధ్య; 28°ల తూర్పు రేఖాంశం, 170°ల పశ్చిమ రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. ఈ ఖండం ద్వారా ఆర్కిటిక్ వలయం (661/2°), కర్కటరేఖ (231/2°), భూమధ్య రేఖ (0°), తూర్పు రేఖాంశం (90°) వెళ్తున్నాయి.

  • ఆసియా ఖండానికి తూర్పున పసిఫిక్ మహాసముద్రం, పశ్చిమాన యూరల్ పర్వతాలు, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. ఆసియా ఖండ విస్తీర్ణం ప్రపంచ భూ విస్తీర్ణంలో 29.81 శాతం. ఆసియా ఖండంలో అతిపెద్ద దేశం రష్యా. అతి చిన్న దేశం మాల్దీవులు. భూ విస్తీర్ణంలో 32 శాతం మేర మైదానాలు ఉన్నాయి. సైబీరియా మైదానం యూరల్ పర్వతాల నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. గంగా-సింధు మైదానం ప్రపంచంలో అతి విశాలమైన ఒండ్రుమట్టి మైదానం. హుయాంగ్‌హూ, సికియాంగ్ నదుల మధ్య గొప్ప చైనా మైదానం ఉంది. మయన్మార్‌లోని ఐరావతి నదీ మైదానం, ఇరాక్‌లో టైగ్రిస్, యూప్రటీస్ మైదానం, ఆగ్నేయాసియాలోని మైకాంగ్ నదీ మైదానాలు ఉన్నాయి.
  • ఆసియా ఖండం భూ విస్తీర్ణంలో పర్వతాలు 20 శాతం మేర విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం ఎవరెస్ట్ శిఖరం హిమాలయాల్లో ఉంది. చైనాలోని టియాన్‌షాన్, రష్యాలోని ఆల్టాయ్ పర్వతాలున్నాయి. మంగోలియాలోని కాప్టో పీఠభూమి, టర్కీలోని అనటోలియా పీఠభూమి, మన దేశంలో దక్కన్, చైనాలోని టియాన్‌షాన్ పీఠభూములు ముఖ్యమైనవి.
  • ఆసియా ఖండంలో పొడవైన నది రష్యాలోని అమూర్. రెండో పొడవైన నది వియత్నాంలోని మెకాంగ్ నది. భారతదేశంలో సింధు, గంగా, బ్రహ్మపుత్ర ముఖ్యమైన నదీ వ్యవస్థలు. ఈ ఖండంలో ప్రధాన ఎడారి థార్ ఎడాలి. ఇది భారతదేశంలో ఉంది. మంగోలియాలోని విశాలమైన శీతల ఎడారి గోబీ ఎడారి. ఇండోనేషియా దీవులు ప్రపంచంలోనే అతిపెద్ద దీవుల సముదాయాన్ని కలిగి ఉన్నాయి. ఆసియా ఖండంలో లోతైన ప్రాంతం మృత సముద్రం. అతిపెద్ద సరస్సు కాస్పియన్ కాగా, లోతైన సరస్సు బైకాల్. అతిపెద్ద ద్వీపం బరోని. ఎత్తయిన పీఠభూమి టిబెట్, పొడవైన సముద్రం దక్షిణ మహాసముద్రం. లోతైన అగాథం మేరియానా అగాథం.
ఖండాతర్గత శీతోష్ణస్థితి:
ఆసియా ఖండం శీతోష్ణస్థితి ఖండాతర్గత శీతోష్ణస్థితి. నైరుతి రుతుపవనాల వల్ల 200 సెం.మీ. వర్షపాతం సంభవిస్తోంది. ఈశాన్య రుతుపవనాల వల్ల తూర్పు ఇండియా దీవుల్లో 150సెం.మీ. వర్షపాతం నమోదవుతోంది. ఆసియా ఖండంలో అధిక వర్షపాతం వేసవి కాలంలో ఉంటుంది. మాసిన్‌రాం, చిరపుంజిలు అధిక వర్షపాతం; థార్, అరేబియా ఎడారులు అత్యల్ప వర్షపాతం పొందుతున్నాయి.

టండ్రాలకు దక్షిణంగా టైగా మండలంలో శృంగాకార అడవులున్నాయి. టైగాలకు దక్షిణంగా ఉన్న గడ్డిభూము ల్ని స్టెప్పీలు అంటారు. రుతుపవన అరణ్యాలు ఎక్కువ గా ఆగ్నేయాసియాలో విస్తరించి ఉన్నాయి. తూర్పు ఆసియాలోని అడవులను సమశీతోష్ణ అడవులు అంటారు. ఆసియా ఖండపు భూమధ్య రేఖా ప్రాంతంలో పెరిగే అడవులను సతత హరిత అరణ్యాలు అంటారు.

అధిక జనాభా దేశాలు:
ప్రపంచంలో ఆసియా ఖండంలో అత్యధిక జనాభా (దాదాపు 4.427 బిలియన్) ఉంది. ఈ ఖండంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలు.. చైనా, భారత్, పాకిస్థాన్, మయన్మార్.

ఈ ఖండంలో విస్థాపన/పోడు వ్యవసాయం; సాంద్ర వ్యవసాయం, విస్తృత వ్యవసాయం ముఖ్యమైన వ్యవసాయ పద్ధతులు. అటవీ ప్రాంత ప్రజలు నేలను చదునుచేసి, చేసే వ్యవసాయాన్ని విస్థాపన వ్యవసాయమంటా రు. ఆసియా ఖండంలో ఎక్కువగా సాంద్ర వ్యవసాయం అమల్లో ఉంది. వ్యవసాయపనులన్నింటికీ యంత్రాలను ఉపయోగిస్తే దాన్ని విస్తృత వ్యవసాయం అంటారు. ఈ పద్ధతి మధ్య ఆసియాలో అమలవుతోంది. చైనా, భార త్, బంగ్లాదేశ్, జపాన్‌లో వరి ప్రధాన పంట. చైనా, ఉత్త ర భారతదేశంలో గోధుమను ఎక్కువగా పండిస్తారు.

రష్యా ప్రథమ స్థానం:
ఆసియా ఖండంలో ఖనిజాలు ఎక్కువగా రష్యా, చైనా, భారత్, జపాన్, ఉత్తర కొరియా దేశాల్లో లభిస్తాయి. బాక్సైట్, రాగి, యురేనియం, పాదరసం లభ్యతలో రష్యా ప్రథమ స్థానంలో ఉంది. వెండి, తుత్తునాగంలలో జపాన్; మాంగనీసు, టంగ్‌స్టన్‌లలో చైనా; క్రోమైట్‌లో భారత్ ప్రథమ స్థానాల్లో ఉన్నాయి. పరిశ్రమలలో ప్రధానంగా ఉక్కు, సిమెంటు, పంచదార, నూలు, కృత్రిమ వస్త్రాల్లో రష్యా ప్రథమ స్థానంలో ఉంది. కలప పరిశ్రమలో ఇండోనేషియా, వ్యాపార నౌకల పరిశ్రమలో చైనా ప్రథమస్థానాల్లో ఉన్నాయి. ఈ ఖండంలో టర్కీలోని ఇస్తాంబుల్, సింగపూర్‌లను కలుపుతూ అంతర్జాతీయ రహదారి ఉంది. ఆసియాలో రైలు మార్గాల వ్యవస్థలో భారత్ అతిపెద్దది. అధిక సాంద్ర రైల్వే వ్యవస్థ జపాన్‌లో ఉంది.

ఆఫ్రికా
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండం ఆఫ్రికా. ఇది 37°301 ఉత్తర అక్షాంశం నుంచి 35°ల దక్షిణ అక్షాంశం వరకు వ్యాపించి ఉంది. భూమధ్య రేఖ, కర్కటరేఖ, మకరరేఖలు ఈ ఖండం ద్వారా వెళ్తున్నాయి. బ్రిటన్ నుంచి వచ్చిన డేవిడ్ లివింగ్‌స్టన్ మధ్య ఆఫ్రికాను, కామెరాన్ కాంగో ప్రాంతాన్ని, బెల్జియం రాజు రెండో లియోపోల్డ్ పంపగా వెళ్లిన స్టాన్లీ తూర్పు ఆఫ్రికాను గుర్తించారు.

ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం సూడాన్. అత్యధిక జనాభా గల దేశం నైజీరియా. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారా ఈ ఖండంలోనే ఉంది. ఆఫ్రికా ఖండంలో ఎత్తై శిఖరం కిలిమంజారో. ఇది టాంజానియాలో ఉంది. వాయవ్య ఆఫ్రికాలో అట్లాస్ పర్వతాలు, డ్రాకెన్స్‌బర్గ్ పర్వతాలున్నాయి. ప్రపంచంలోనే పొడవైన నది నైలునది. ఇది ఉత్తరంగా ప్రవహించి, మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఈజిప్టును నైలునది వరప్రసాదంగా పిలుస్తారు. జాంబేజీ, లింపోపో నదులు హిందూ మహాసముద్రంలో; కాం గో, ఆరెంజ్ నదులు అట్లాంటిక్ మహాసముద్రంలో; నైగర్ నది గినియా సింధుశాఖలో కలుస్తుంది.

ఉష్ణమండల శీతోష్ణస్థితి:
ఆఫ్రికాలో ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంది. ఈ ఖండంలో నాలుగు రకాల శీతోష్ణస్థితులున్నాయి. అవి.. భూమధ్యరేఖ శీతోష్ణస్థితి, సూడాన్ రకపు శీతోష్ణస్థితి, ఉష్ణమండల సవన్నా రకపు శీతోష్ణస్థితి, మధ్యధరా శీతోష్ణస్థితులున్నాయి. పశ్చిమ పవనాల వల్ల నైరుతి ఆఫ్రికా సంవహన వర్షపాతం పొందుతుంది. ఆఫ్రికా నైరుతి భాగంలో కలహారి ఎడారి ఉంది. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 32°C. ఖండం మొత్తం సరాసరి ఉష్ణోగ్రత 20°C. ఈ ఖండంలోని గడ్డిభూములను సవన్నాలు, వెల్డులుగా వ్యవహరిస్తారు. మధ్యధరా శీతోష్ణస్థితి గల భూముల్లో ఆలివ్ వృక్షాలు పెరుగుతాయి. భూమధ్యరేఖా శీతోష్ణస్థితి ప్రాంతంలో సతత హరిత అరణ్యాలు పెరుగుతాయి. వీటిలో గట్టి కలపనిచ్చే వృక్షాలుంటాయి. ఈ ఖండంలో జనాభా 1.111 బిలియన్ (2013).

ఆటవిక జాతులు:
కాంగోనదీ హరివాణం-పిగ్మీలు; సహారా ఎడారి- బిడౌన్లు; కలహారి ఎడారి- బుష్‌మెన్‌లు, హట్టెన్ టాట్లు; తూర్పు ఆఫ్రికా- మసాయ్; సహారా ఉత్తర భాగం- సెమైట్లు; సూడాన్, పశ్చిమాఫ్రికా- హమైట్లు.

ఆఫ్రికా ఖండంలో విషపూరితమైన ఈగలు సే-సే ఈ గలు. ప్రపంచ వింతల్లో ఒకటిగా పేర్కొనే పిరమిడ్లు కైరో నగరానికి 20 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. ఈ ఖండంలో ప్రధాన జలపాతం విక్టోరియా జలపాతం. దీని వెడల్పు సుమారు 1.7 కి.మీ, ఎత్తు 108 మీ. దక్షిణాఫ్రికా రెండో రాజధాని కేప్‌టౌన్‌ను ‘మౌంటెన్ టేబుల్ క్లాత్’ అని పేర్కొంటారు. జాంజిబార్ ద్వీపాన్ని లవంగాల దీవి అంటారు. ఈ ఖండం ప్రధాన ఆకర్షణ నేషనల్ సఫారీ. ప్రధానంగా పోడు వ్యవసాయం అమల్లో ఉంది. దక్షిణాఫ్రికాలో గోధుమను; కలహారీ ఒయాసిస్సులు, ఈజిప్టులో వరిని; కాంగోలో మొక్కజొన్నను, కామెరాన్‌లో ఖర్జూరాన్ని పండిస్తున్నారు. గినియా తీరంలో రబ్బరు తోటలున్నాయి. ఖనిజాల్లో ప్రధానంగా బంగారం (జోహెన్నెస్‌బర్గ్, విట్‌వాటర్స్‌రాండ్; వజ్రాలు (కింబర్లీ, అంగోలా); ఇనుము (ఐవరీకోస్ట్, లైబీరియా) గనులున్నాయి. గినియా తీరంలో బాక్సైట్; అంగోలా, నైజీరియాలో పెట్రోలియం; దక్షిణాఫ్రికా, జింబాబ్వేలో బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి.

ఐరోపా
ఇది రెండో చిన్న ఖండం. ప్రపంచ విస్తీర్ణంలో 6.8 శాతం భూభాగాన్ని కలిగి ఉంది. 350ఉత్తర అక్షాంశం నుంచి 720 ఉత్తర అక్షాంశం వరకు వ్యాపించి ఉంది. 100ల పశ్చిమ రేఖాంశం నుంచి 600 తూర్పు రేఖాంశం వరకు ఉంది. 00ల గ్రీనిచ్ రేఖాంశం లండన్ ద్వారా పోతోంది. మధ్యధరా సముద్రం.. ఐరోపాను ఆఫ్రికా నుంచి వేరుచేస్తుండగా, యూరల్ పర్వతాలు ఐరోపా నుంచి ఆసియాను వేరుచేస్తున్నాయి.
  • ఐరోపా ఖండంలోని ఉత్తర ఉన్నత ప్రాంతాన్ని ‘బాల్టిక్ షీల్డ్ ప్రాంతం’ అంటారు. ఫ్రాన్స్‌లో జురా, మాసిఫ్, వాస్‌జెస్ పర్వతాలు; జర్మనీలో యూరల్ పర్వతాలు, బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు; ఇటలీలో వెసూవియస్, ఎట్నా అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఐరోపా ఖండంలో ఎత్తయిన శిఖరం మాంట్ బ్లాంక్. ఇది ఫ్రాన్స్‌లో ఉంది. ఈ ఖండంలో పొడవైన నది ఓల్గా. రెండో పొడవైన నది (ఏడు దేశాల గుండా ప్రవహిస్తోంది) డాన్యూబ్.
  • అతిపెద్ద శృంగాకార అరణ్య మేఖలం స్కాండినేవియా మెట్ట ప్రాంతం. ఇక్కడ స్ప్రూస్, ఫర్, బిర్చ్ వృక్షాలు పెరుగుతాయి.మధ్యధరా శీతోష్ణస్థితిలో ఆలివ్ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ ఖండంలో ఫిన్లాండ్‌లో 77 శాతం, ఐస్‌లాండ్‌లో 1 శాతం అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ధ్రువప్రాంతంలో అసాధారణ పక్షి ఎంపరర్ పెంగ్విన్. ఇంగ్లండ్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్‌లోని నగరాలు, మైదాన ప్రాంతాల్లో అత్యంత జనసాంద్రత ఉంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా రోమ్ (శాశ్వత నగరం, సప్త పర్వతాల నగరం), బెల్జియం (ఐరోపా యుద్ధరంగం), అబార్డీన్ (నల్లరాయి నగరం), నార్వే (అర్ధరాత్రి సూర్యుని దేశం), స్విట్జర్లాండ్ (ఐరోపా క్రీడా మైదానం), ఇటలీలోని వెనిస్ (క్వీన్ ఆఫ్ ఆడ్రియాటిక్) వర్థిల్లుతున్నాయి. ఫ్రాన్స్‌తీరంలోని అతిచిన్న దేశం మొనాకో.. కాసినోలకు ప్రసిద్ధి చెందింది.
  • మిశ్రమ వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. గోధుమకు ఫ్రాన్స్, రై ధాన్యానికి పోలండ్, ఆలివ్‌నూనెకు స్పెయిన్, పొగాకుకు బల్గేరియా, మొక్కజొన్న, ఓట్స్‌కు రష్యా ప్రసిద్ధిగాంచాయి.
  • {పపంచ ఇనుపధాతువులో 1/4 వంతు ఐరోపా ఉత్పత్తి చేస్తోంది. పెట్రోలియంను డెన్మార్క్, బ్రిటన్, నెదర్లాండ్స్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. కరారా పాలరాయికి ఇటలీ ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. పారిశ్రామిక ప్రాంతాల్లో జర్మనీలోని రూర్‌లోయ ప్రధానమైంది. ఇనుము క్షేత్రానికి ఫ్రాన్స్‌లోని లోరైన్ ప్రాంతాలు ముఖ్యమైనవి. ఫ్రాన్స్‌లోని బర్గాండి, షాంపైన్ ప్రాంతాలు ద్రాక్ష తయారీకి ముఖ్యమైన ప్రాంతాలు.
  • ఉత్తర సముద్ర రేవుల్లో ప్రధాన కాలువ కీల్. దీన్ని డెన్మార్క్ మీదుగా తవ్వారు. రోడ్డు మార్గాల అభివృద్ధిలో ఐరోపా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది.
నమూనా ప్రశ్నలు
1. లోరైన్ బొగ్గు క్షేత్రం ఏ దేశంలో ఉంది?
ఎ) ఫ్రాన్స్
బి) జర్మనీ
సి) ఇంగ్లండ్
డి) ఫిన్లాండ్
2. ఆసియా ఖండంలో లోతైన ప్రాంతం?
ఎ) మృత సముద్రం
బి) మెరియానా ట్రెంచ్
సి) బైకాల్ సరస్సు
డి) భరోని
3. ఆసియా ఖండం అమల్లో ఉన్న వ్యవసాయ విధానం ఏది?
ఎ) విస్థాపన వ్యవసాయం
బి) సాంద్ర వ్యవసాయం
సి) విస్తృత వ్యవసాయం
డి) పైవన్నీ
4. ఆసియాలో ముత్యాలు లభించే దేశం ఏది?
ఎ) రష్యా
బి) జపాన్
సి) టర్కీ
డి) చైనా
5. గినియా రాజధాని?
ఎ) కైరో
బి) కోనాక్రి
సి) ట్రిపోలి
డి) ఆక్రా
6. హిందూ మహాసముద్రంలో కలిసే నది ఏది?
ఎ) నైగర్
బి) ఆరెంజి
సి) నైల్
డి) లింపోపో
7. {పపంచంలో సహారా ఎడారి వైశాల్యం?
ఎ) 8 మి. చ.కి.మీ
బి) 10.5 మి. చ.కి.మీ
సి) 15.5 మి. చ.కి.మీ
డి) 12.5 మి. చ.కి.మీ
8. ఆఫ్రికా ఖండంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందింది?
ఎ) జోహన్నెస్‌బర్గ్
బి) విట్‌వాటర్స్‌రాండ్
సి) ప్రిటోరియా
డి) కింబర్లీ
9. ఐరోపా ఖండంలో బాల్కన్ ద్వీపకల్పంలోని ప్రధాన దేశం?
ఎ) నార్వే
బి) స్వీడన్
సి) గ్రీస్
డి)స్పెయిన్
10. వోల్గా నది ఏ సముద్రంలో కలుస్తోంది?
ఎ) ఆర్కిటిక్
బి) పసిఫిక్
సి) కాస్పియన్ సముద్రం
డి) నల్ల సముద్రం

సమాధానాలు

1) ఎ

2) ఎ

3) డి

4) బి

5) బి

6) డి

7) బి

8) డి

9) సి

10) సి

Published date : 09 Dec 2014 03:32PM

Photo Stories