Skip to main content

మృత్తికలు- రకాలు

శిలా శిథిలాలతో వృక్ష, జంతు సంబంధమైన శిథిలాలు కలిసినప్పుడు మృత్తికలు ఏర్పడతాయి. భారతదేశం వంటి వ్యవసాయ దేశానికి మృత్తికలు అతి ముఖ్య సంపద. ఒక దేశ సౌభాగ్యం ఆ దేశ మృత్తికలపై ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రకాల మృత్తికలు ముఖ్యమైనవి. అవి: ఎర్ర మృత్తికలు, నల్లరేగడి మృత్తికలు, ఒండ్రు మృత్తికలు, జేగురు (లాటరైట్) మృత్తికలు.

ఎర్ర మృత్తికలు
రాష్ర్టంలో ఎక్కువ భాగం ఎర్ర మృత్తికలు విస్తరించి ఉన్నాయి. ఇవి తేలికగా ఉండి, నీటిని గ్రహించే శక్తిని కలిగి ఉన్నాయి. ఈ మృత్తికలు అతి తక్కువ సారవంతమైనవి. ఇవి తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో, నెల్లూరు జిల్లాలో ఎక్కువ భాగం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొంత భాగం ఉన్నాయి. ఈ నేలల్లో వేరుశనగ, ఉలవలు మొదలైన మెట్ట పంటలు పండుతాయి. నీటి వనరులున్న చోట పత్తి, పొగాకు, వివిధ ఫల జాతులను సాగు చేస్తున్నారు.

నల్లరేగడి మృత్తికలు
ఈ మృత్తికలకు నీటిని గ్రహించి చాలాకాలం వరకు నిల్వ ఉంచుకునే శక్తి ఉంది. ఇవి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు గోదావరి నదీ లోయలోనూ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, రాయలసీమల్లో కొంత భాగంలోనూ విస్తరించి ఉన్నాయి. ఈ మృత్తికల్లో పత్తి ముఖ్యపంట. జొన్న, సజ్జ, కొర్ర, పొగాకు, పసుపు, మిరప మొదలైన వాటిని కూడా పండిస్తున్నారు. నీటి వనరులున్న చోట చెరకు, వరి, అరటి మొదలైన పంటలను కూడా సాగు చేస్తున్నారు.

ఒండ్రు మృత్తికలు
నదుల ద్వారా కొట్టుకు వచ్చిన ఇసుక, ఒండ్రు మట్టితో ఈ మృత్తికలు ఏర్పడ్డాయి. ఇవి కృష్ణా, గోదావరి, పెన్నా నదీ డెల్టాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి చాలా సారవంతమైనవి. ఈ మృత్తికల్లో వరి, చెరకు, అరటి, జామ, నిమ్మ, బత్తాయి మొదలైన పంటలు పండుతాయి.

జేగురు మృత్తికలు
జేగురు మృత్తికలు మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతం, నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. ఈ మృత్తికలు తక్కువ సారవంతమైనవి. జేగురు మృత్తికల్లో మామిడి, జీడిమామిడి, చింతచెట్లు ఎక్కువగా పెరుగుతాయి. రాష్ర్టంలోని తీర ప్రాంతాల్లో ఇసుక నేలలు ఉన్నాయి. వీటిల్లో సరివి, జీడిమామిడి తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారు.

మృత్తికా క్రమక్షయం
వర్షం, గాలి, నదులు, సముద్ర తరంగాలు, ప్రవాహాలు, ఉష్ణోగ్రత మొదలైనవి మృత్తికలను క్రమంగా శిథిలం చేసి మరో చోటికి తీసుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. మృత్తికా క్రమక్షయం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఏడాదిలో ఒక నెల వర్షం కురిస్తే అడవులు ఉన్న ప్రాంతంలో ఒక ఎకరానికి సుమారు అరటన్ను మృత్తికలు క్రమక్షయం జరిగి కొట్టుకుపోతాయి. పచ్చిక బయళ్లలో 13 టన్నులు, అడవులు, పచ్చిక లేని ప్రాంతంలో సుమారు 300 టన్నుల క్రమక్షయం జరుగుతుందని అంచనా.
కాంటూర్ బండింగ్ (వాలుకట్టలు) నిర్మాణం, సోపాన వ్యవసాయం చేయడం, కొండవాలు భాగంలో మొక్కలను, గడ్డి పెంచడం, చెట్లను నాటి అడవులను అభివృద్ధి చేయడం వంటి చర్యల ద్వారా క్రమక్షయాన్ని అరికట్టవచ్చు.

విద్యుచ్ఛక్తి
ప్రతి ప్రాంత ఆర్థికాభివృద్ధిలో విద్యుచ్ఛక్తి కీలకపాత్ర వహిస్తుంది. జలాశయాలను ఏర్పాటు చేసి నీటిని వదిలి టర్బైన్‌ల ద్వారా జల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తారు. బొగ్గుకు బదులుగా సహజ వాయువును ఉపయోగించి కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956లో విద్యుత్ ఉత్పత్తి 99 మెగావాట్లు.
థర్మల్ కేంద్రాలు
  • విజయవాడ - 840 మెగావాట్లు
  • కొత్తగూడెం - 680 మెగావాట్లు
  • రామగుండం - 63 మెగావాట్లు
  • నెల్లూరు - 30 మెగావాట్లు
  • మొత్తం - 1,613 మెగావాట్లు
జలవిద్యుచ్ఛక్తి పథకాలు
  • నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ - 960 మెగావాట్లు
  • శ్రీశైలం ప్రాజెక్టు - 770 మెగావాట్లు
  • సీలేరు ప్రాజెక్టులు - 650 మెగావాట్లు
  • మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ - 80 మెగావాట్లు
  • తుంగభద్ర ప్రాజెక్ట్ - 58 మెగావాట్లు
  • పోచంపాడు ప్రాజెక్ట్ - 27 మెగావాట్లు
  • నిజాంసాగర్ ప్రాజెక్ట్ - 10 మెగావాట్లు
  • చిన్న పథకాలు - 3 మెగావాట్లు
  • మొత్తం - 2,558 మెగావాట్లు
తూర్పు గోదావరి జిల్లాలో విజ్జేశ్వరం వద్ద సహజ వాయువు ఆధారంగా 1990 సం॥నుంచి 99 మెగావాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద సహజ వాయువుతో విద్యుదుత్పత్తి జరుగుతున్న కేంద్రం ఇది ఒకటే.
ప్రస్తుతం రాష్ర్టంలో పనిచేస్తున్న 4 చిన్న విద్యుత్ కేంద్రాలు కాకుండా, ప్రైవేటు రంగంలో మరో 4 చిన్న కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేటు రంగంలో మరో 19 చిన్న విద్యుత్ కేంద్రాలు నిర్మించాలనే ఆలోచన ఉంది. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు నిక్షేపాలు కొన్ని ఏళ్లలో తరిగి పోతాయి. కానీ జల విద్యుచ్ఛక్తి మాత్రం ఎప్పటికీ తరగదు.

వ్యవసాయం
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రాధాన్యత గల రాష్ర్టం. రాష్ర్ట జనాభాలో 70 శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ర్ట వైశాల్యంలో దాదాపు 41 శాతం భూమిలో వివిధ పంటలను పండిస్తున్నారు. మన రాష్ర్టంలో 11.27 మిలియన్ల హెక్టార్ల భూమి సాగు కింద ఉంది. కేవలం ఆహారం కోసం పండించే పంటలను ఆహార పంటలు అంటారు. వరి, జొన్న, గోధుమ, చిరు ధాన్యాలు మొదలైనవి ఆహార పంటలు.

ఆహార పంటలు
ఆహార పంటల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 7వ స్థానంలో, ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. 2000-01లో ఆంధ్రప్రదేశ్‌లో 7.65 మిలియన్ హెక్టార్ల భూమిలో 16.02 మిలియన్ టన్నుల ఆహార పంటల ఉత్పత్తి జరిగింది.
వరి: రాష్ర్టంలో పండే ఆహార పంటల్లో వరి అతి ముఖ్యమైంది. మనదేశంలో వరి ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండోది. 2000 - 01లో దాదాపు 4.3 మిలియన్ హెక్టార్ల భూమిలో 12.45 మిలియన్ టన్నుల వరి పండింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పండే వరి రాష్ర్ట మొత్తం వరి ఉత్పత్తిలో 60 శాతం పైగా ఉంది. పండుతున్న వరిలో మూడింట రెండు వంతులు ఖరీఫ్ కాలంలో, మిగిలింది రబీలో పండుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలు, ఎక్కువ వర్షపాతం లేదా నీటి పారుదల సౌకర్యం వరి పంటకు కావాలి.
జొన్న: రాష్ర్టంలో వరి తర్వాత జొన్న ముఖ్య ఆహార పంట. జొన్న ముఖ్యంగా చిత్తూరు మినహా రాయలసీమ జిల్లాలు, నిజామాబాద్ మినహా తెలంగాణ జిల్లాలు, ప్రకాశం జిల్లాలో పండుతుంది. జొన్న ఖరీఫ్, రబీ రెండు కాలాల్లోనూ సాగవుతుంది.
సజ్జ: ఇది వర్షాధారిత పంట. మన రాష్ర్టంలో విశాఖపట్నం, ప్రకాశం, నల్గొండ, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సజ్జ పండుతుంది.
మొక్కజొన్న: ఇది తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అధికంగా పండుతుంది. ఇది కూడా వర్షాధార పంట.
రాగులు: ఈ పంట శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎక్కువగా పండుతుంది.
గోధుమ: మన రాష్ర్టంలో గోధుమ కొద్దిగా నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో పండుతుంది.

పప్పుధాన్యాలు
దేశంలోని పప్పుధాన్యాల విస్తీర్ణంలో, ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది. కంది, పెసర, మినుము, సెనగలు, ఉలవలు మన రాష్ర్టంలో పండే ముఖ్యమైన పప్పుధాన్యాలు. కందులు.. మన రాష్ర్టంలో అన్ని జిల్లాల్లోనూ ఖరీఫ్, రబీ కాలాల్లో పండుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కందులు ఎక్కువగా సాగవుతున్నాయి.
పెసలు కూడా రెండు కాలాల్లో పండుతు న్నాయి. పెసర పంటను ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, మెదక్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పండిస్తున్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మినుములు కొద్దిగా పండుతున్నాయి. మినుముల ఉత్పత్తిలో గుంటూరు జిల్లాది అగ్రస్థానం.
సెనగ రబీలో పండే వర్షాధార పంట. కర్నూలు, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సెనగలు ఎక్కువగా పండుతున్నాయి. ఉలవలు వర్షధార పంట. ఇవి పశువుల దాణాగా ఉపయోగపడుతున్నాయి. నల్గొండ, అనంతపురం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉలవలు ఎక్కువగా పండుతున్నాయి. కొర్ర, ఆరిక, సోమ మొదలైనవి చిరుధాన్యాలు.

నగదు పంటలు
పొగాకు:
పొగాకు ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రానిదే అగ్రస్థానం. ఇది ప్రధానంగా రబీ కాల పంట. ఎగుమతికి పనికి వచ్చే వర్జీనియా రకం పొగాకు ఉత్పత్తి మన రాష్ర్టంలో అధికంగా ఉంది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, కర్నూలు, ఖమ్మం, వరంగల్ జిల్లాలు పొగాకు పంటకు ప్రసిద్ధి చెందాయి. పొగాకు వాణిజ్యానికి గుంటూరు ముఖ్య కేంద్రం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పొగాకు పరిశోధన కేంద్రం ఉంది.
పత్తి: ఆదిలాబాద్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పండుతుంది. వర్షాధార ప్రాంతాల్లో పొట్టి పింజపత్తి, నీటి పారుదల కింద పొడుగు పింజపత్తి సాగవుతుంది. బేలు అంటే 170 కిలో గ్రాముల బరువు ఉంటుంది. పత్తి ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ది ఆరో స్థానం. పత్తి పరిశోధన కేంద్రం కర్నూలు జిల్లా నంద్యాలలో ఉంది.
చెరకు: చెరకు ఉత్పత్తిలో మన రాష్ర్టం దేశంలో ఐదో స్థానంలో ఉంది. విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో నీటిపారుదల వసతి ఉన్నచోట చెరకు పండుతుంది. 2000 - 01లో 0.21 మిలియన్ హెక్టార్లలో దాదాపు 1.8 మిలియన్ టన్నుల చెరకును పండించారు. చెరకు పరిశోధన కేంద్రం విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఉంది.
మిరప: మిరప అన్ని జిల్లాల్లో కొద్దిగా పండుతున్నప్పటికీ వరంగల్, గుంటూరు, ఖమ్మం, కరీంనగర్, పశ్చిమ గోదావరి, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా సాగవుతుంది. మిరప పరిశోధన కేంద్రం గుంటూరు జిల్లాలోని ‘లాం’ వద్ద ఉంది.
ఉల్లిపాయలు: కడప, కర్నూలు, అనంతపురం, రంగారెడ్డి, విశాఖపట్నం జిల్లాల్లో ఉల్లి పంట ఎక్కువగా ఉంది. మన రాష్ర్టం నుంచి ఉల్లిపాయలు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
పసుపు: కడప, నిజామాబాద్, కరీంనగర్, గుంటూరు జిల్లాల్లో పండిస్తున్నారు. పసుపును ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

నూనె గింజలు
ఆంధ్రప్రదేశ్ నూనె గింజల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. రాష్ర్టంలో పండే నూనె గింజల్లో వేరుసెనగ, ఆముదాలు, నువ్వులు, కుసుమలు, కొబ్బరి ముఖ్యమైనవి. 1992లో 2,400 హెక్టార్లలో సోయాబీన్‌‌స పంటను ప్రారంభించి ఆ తర్వాత మరో 8 జిల్లాలకు విస్తరించారు.
వేరుసెనగ: మనదేశంలో ఆంధ్రప్రదేశ్ వేరుసెనగ ఉత్పత్తిలో, విస్తీర్ణంలో ప్రథమ స్థానంలో ఉంది. ఇది ఖరీఫ్, రబీ కాలాల్లో పండుతుంది. వేరుసెనగ ముఖ్యంగా రాయలసీమ, మహబూబ్‌నగర్, నల్గొండ, విశాఖపట్నం జిల్లాల్లో సాగవుతుంది.
ఆముదాలు: ఆముదాల పంటలో కూడా దేశం మొత్తం మీద మన రాష్ట్రానిదే అగ్రస్థానం. తెలంగాణలో ఆముదాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. ప్రకాశం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కూడా ఆముదాలు పండుతున్నాయి.
నువ్వులు: వీటి ఉత్పత్తిలో మన రాష్ర్టం దేశంలో నాలుగో స్థానంలో ఉంది. కోస్తాంధ్రాలో నువ్వులు ఎక్కువగా పండుతున్నాయి. అన్ని జిల్లాల కంటే విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా సాగవుతున్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్, ఉభయ గోదావరి, కరీంనగర్, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలు ముఖ్యమైనవి. ఖరీఫ్, రబీ కాలాల్లో పండుతాయి.
కుసుమలు: కుసుమలు వర్షాధార పంట. ఇవి తెలంగాణ ప్రాంతం, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఎక్కువగా పండుతున్నాయి.
కొబ్బరి: మన రాష్ర్టంలో కొబ్బరి చెట్లు ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి.
ఆయిల్‌ఫామ్: 1989-90 నుంచి మన రాష్ర్టంలో ఆయిల్‌ఫామ్ చెట్ల పెంపకం ప్రారంభించారు. 1992-93లో 10 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్‌ఫామ్ మొక్కలు నాటారు. అవిసె, ఆవాలు, పొద్దు తిరుగుడు పువ్వులు, పత్తి గింజల నుంచి కూడా మన రాష్ర్టంలో నూనెను తీస్తున్నారు.

పండ్ల తోటలు
ఆంధ్రప్రదేశ్‌లో 0.46 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పండ్ల తోటల్లో 4.6 మిలియన్ టన్నుల పండ్ల ఉత్పత్తి జరిగింది. విజయవాడ నుంచి ఐరోపా దేశాలకు మామిడి పండ్లు ఎగుమతి చేయడం 1993లో ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి ద్రాక్షపళ్లు ఎగుమతి చేస్తున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాలు మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందాయి. నిమ్మ, నారింజ, అరటి, ద్రాక్ష, సపోట, జీడిమామిడి, జామ, సీతాఫలాలు రాష్ర్టంలో సమృద్ధిగా పండుతున్నాయి. ద్రాక్షతోటలు రంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. అరటికి ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలు, జీడిమామిడికి ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలు ప్రసిద్ధి చెందాయి. నిమ్మ తోటలు నెల్లూరు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ, నారింజ, బత్తాయి తోటలు ముఖ్యంగా అనంతపురం, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఉన్నాయి. జామతోటలు గుంటూరు, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు, సపోట తోటలు.. ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. సీతాఫలాలకు మహబూబ్‌నగర్ జిల్లా ప్రసిద్ధి చెందింది.

మాదిరి ప్రశ్నలు
1. రాష్ర్టంలో ఎక్కువ భాగం విస్తరించిన మృత్తికలు?
1) ఎర్ర మృత్తికలు
2) లాటరైట్ నేలలు
3) ఒండ్రు నేలలు
4) నల్లరేగడి నేలలు
2. అతి తక్కువ సారవంతమైన మృత్తికలు?
1) ఇసుక నేలలు
2) లాటరైట్ నేలలు
3) ఒండ్రు నేలలు
4) ఎర్ర మృత్తికలు
3. నీటిని గ్రహించి నిల్వ చేసుకునే నేలలు?
1) ఎర్ర మృత్తికలు
2) లాటరైట్ నేలలు
3) ఒండ్రు నేలలు
4) నల్లరేగడి నేలలు
4. నల్లరేగడి నేలల్లో ముఖ్య పంట?
1) పత్తి
2) వరి
3) గోధుమ
4) జొన్న
5. అత్యంత సారవంతమైన మృత్తికలు?
1) ఒండ్రు నేలలు
2) ఎర్ర నేలలు
3) నల్లరేగడి నేలలు
4) ఇసుక నేలలు
6. భూమి పై పొర కొట్టుకుపోవడాన్ని ఏమంటారు?
1) మృత్తికా క్రమక్షయం
2) అవనాళిక
3) కాంటూర్ బండింగ్
4) క్షామం
7. మన రాష్ర్టంలో పండే ఆహార పంటల్లో ముఖ్యమైంది?
1) వరి
2) గోధుమ
3) చెరకు
4) జొన్న
8. మన రాష్ర్టంలో వరి తర్వాత ముఖ్య ఆహార పంట?
1) మినప
2) గోధుమ
3) చెరకు
4) జొన్న
9. మన రాష్ర్టంలో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు?
1) కందులు
2) పెసర
3) వేరుశెనగ
4) శనగ
10. మినుముల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా?
1) గుంటూరు
2) కృష్ణా
3) నెల్లూరు
4) కడప

సమాధానాలు

1) 1

2) 4

3) 4

4) 1

5) 1

6) 1

7) 1

8) 4

9) 1

10) 1

Published date : 23 Dec 2014 03:26PM

Photo Stories