సెవెన్త్ చదువు.. ఐటీ కొలువు
Sakshi Education
ఈ విద్యార్థి వారంలో మూడురోజులు మాత్రమే స్కూల్‌కు వెళ్లి పాఠాలు వింటాడు. మరో మూడు రోజులు సాఫ్ట్‌వేర్ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేస్తాడు.
చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో 12 ఏళ్ల వయసులోనే ఏకంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సాధించాడు. దీంతో ఆసియా ఖండం లోనే అతిచిన్న వయసులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచే స్తున్న రికార్డును సొంతం చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి.రాజ్‌కుమార్, ప్రియ హైదరాబాద్ క్యాబ్ జెమినీలో ఉద్యోగం చేస్తూ మణికొండలో నివసిస్తున్నారు. వారి కుమారుడు శరత్ ఏడో తరగతి చదువుతున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రు లిద్దరూ రోజూ ల్యాప్‌టాప్‌ల్లో పనిచేస్తుండటాన్ని చిన్నప్పటి నుంచే నిశితంగా గమనిస్తూ వస్తున్నాడు. దీంతో ఏడేళ్ల వయసులోనే అతడిలో కోడింగ్, జావా తదితర సాఫ్ట్‌వేర్‌లపై ఆసక్తి పెరిగింది. అతడిలోని టాలెంట్‌ను గమనించిన తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగిగా పనికి వస్తాడని భావించడంతో శరత్ పలు ఐటీ సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల మోంటైగ్నే సంస్థలో నెలకు రూ.25 వేల జీతంతో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం లభించింది. కాగా తల్లిదండ్రులతో పాటు తనను కలసిన శరత్‌ను తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు.
Published date : 30 Oct 2019 06:00PM