Skip to main content

పూర్నియా నుంచి కేంబ్రిడ్జ్ వరకు అభినవ ప్రస్థానం

ప్రపంచంలో అత్యుత్తమ విద్యా సంస్థలకు వేదిక బ్రిటన్.. అక్కడి ఇంపీరియల్ కాలేజ్-లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలుపతిభావంతులైన అంతర్జాతీయ విద్యార్థులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటాయి.. ఇందుకు అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తాయి.. ఆ ఇన్‌స్టిట్యూట్‌లలో లభించే సౌకర్యాలు, అత్యున్నత ఫ్యాకల్టీల కారణంగా పరిశోధనల దిశగా ఆలోచించే ప్రతి విద్యార్థి ప్రాధాన్యత జాబితాలో ఈ రెండు ఇన్‌స్టిట్యూట్‌లు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. అలాంటిది ఈ రెండు ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి పరిశోధనలు చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు ‘అభినవ ఘోష్’.. కేంబ్రిడ్జ్ దిశగా సాగిన తన ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాలు.. మీ కోసం

బీహార్‌లోని పూర్నియా నా స్వస్థలం. విట్ యూనివర్సిటీ-వెల్లూరు నుంచి బీఎస్సీ (మైక్రోబయాలజీ), ఎంఎస్సీ (అప్లయిడ్ మైక్రోబయాలజీ) చేశాను. స్కాలర్‌షిప్స్ సహకారంతోనే ఈ రెండు కోర్సులను పూర్తి చేశాను.

విజిటింగ్ రీసెర్చర్:

ఎంఎస్సీ రీసెర్చ్ వర్క్ కోసం లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీని ఎంచుకున్నాను. ఆ కాలేజీలోని సెంటర్ ఆఫ్ మాలిక్యులర్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ నుంచి ‘మైక్రోబయల్ జెనెటిక్స్’ అనే అంశంపై విజిటింగ్ రీసెర్చర్‌గా రీసెర్చ్ వర్క్ పూర్తి చేశాను. ఇందుకు ఇంపీరియల్ కాలేజీతోపాటు విట్ యూనివర్సిటీ కూడా ఆర్థిక సహాయం అందించాయి. ఇంపీరియల్ కాలేజీలోని అత్యున్నత సౌకర్యాలు, శిక్షణ పరిశోధనల దిశగా కెరీర్‌ను ఎంచుకోవడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. అంతేకాకుండా రీసెర్చ్ వర్క్‌ను యూనివర్సిటీ ఆఫ్ ఈర్లనాజెన్ (జర్మనీ), హాన్స్-నాల్ ఇన్‌స్టిట్యూట్ (జర్మనీ) వంటి యూనివర్సిటీలతోపాటు పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే అవకాశం లభించింది. ఇందుకుగాను ఇంపీరియల్ కాలేజీ ఆర్థిక సహకారాన్ని అందించింది. సైంటిఫిక్, నాన్ సైంటిఫిక్ అంశాలకు సంబంధించి పలు పబ్లికేషన్స్ కూడా వెలువరించాను.

క్యాన్సర్ జన్యువులపై పరిశోధన:

పస్తుతం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేస్తున్నాను. అంతర్జాతీయ విద్యార్థులకు సాధారణంగా అడ్మిషన్ కల్పించే ప్రక్రియలో భాగంగానే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నాకు అవకాశం దక్కింది. పీహెచ్‌డీ కోర్సులో చేరే క్రమంలో ఎన్నో ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్స్ కూడా లభించాయి. అవి.. కేంబ్రిడ్జ్ నెహ్రూ స్కాలర్‌షిప్-2012, రాజీవ్ గాంధీ యూకే స్కాలర్‌షిప్-2012, సెయింట్ ఎడ్మండ్స్ డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ స్కాలర్‌షిప్-2012, రేమండ్ అండ్ బేవర్లీ సాక్లర్ స్కాలర్‌షిప్-2012. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా స్కాలర్‌షిప్స్ కోసం నిర్వహించిన పోటీలో అత్యంత ప్రతిభావ ంతునిగా గుర్తింపు పొందాను. ప్రస్తుతం కేంబ్రిడ్జ్‌లో ‘క్యాన్సర్ జన్యువుల’పై పరిశోధన చేస్తున్నాను. సెయింట్ ఎడ్మండ్స్ కాలేజీలో సభ్యుడిని కూడా.

అన్ని విధాల సహకారం:

పతిభావంతులైన అంతర్జాతీయ విద్యార్థులను ప్రోత్సహించడంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. స్వదేశం నుంచి బయలుదేరి యూనివర్సిటీలో చేరే వరకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తుంది. ఎటువంటి అసౌకర్యం లేకుండా యూనివర్సిటీకి ఏ విధంగా చేరుకోవాలనే విషయానికి సంబంధించి సమాచారాన్ని ముందుగానే పంపిస్తుంది. అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, తదితర అన్ని అంశాల్లో సహాయపడేందుకు ఒక గైడ్‌ను కూడా యూనివర్సిటీ నియమిస్తుంది. వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల మధ్య సమన్వయం ఏర్పడడానికి వీలుగా సోషల్ ఈవెంట్స్‌ను కూడా నిర్వహిస్తుంది. కొంత మంది విద్యార్థులకు కలిపి ఒక ట్యూటర్ నియమిస్తుంది. విద్యార్థులు వారికి సంబంధించిన అన్ని విషయాలను, సం దేహాలను ఆ ట్యూటర్‌తో చర్చించే అవకాశం ఉంటుంది. బ్రిటన్‌లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అది..విద్యార్థులు తమ వసతి సౌకర్యాలను ముందుగానే బుక్ చేసుకోవాలి. వీసా మంజూరు కోసం కూడా ఇవి తప్పనిసరి.

ఉత్తమ వర్సిటీ:

అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు, అత్యున్నత ఫ్యాకల్టీ వెరసి కేంబ్రిడ్జ్‌ను ప్రపంచంలోనే ఉత్తమ యూనివర్సిటీగా నిలిపాయని చెప్పొచ్చు. కేవలం ఏదో అంశానికి పరిమితంకాకుండా ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించే విధంగా విద్యార్థి సర్వోతముఖ అభివృద్ధికి తోడ్పడే కరిక్యులం ఉంటుంది. తాము ఎంచుకున్న రంగంలో లీడర్లుగా ఎదిగేందుకు కావల్సిన అన్ని రకాల అవకాశాలను కేంబ్రిడ్జ్ కల్పిస్తుంది. పీహెచ్‌డీ విద్యార్థులు ఫ్యాకల్టీల పర్యవేక్షణలో పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ఎంఫిల్ కోర్సుకు మాత్రం వర్క్, లేబొరేటరీ సెషన్ రెండూ ఉంటాయి. సాధారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అకడమిక్ సెషన్ ఉంటుంది. విద్యార్థులు ఆసక్తి మేరకు ఏ సమయంలోనైనా పరిశోధన సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.

భవిష్యత్ లక్ష్యం:

డాక్టోరల్ స్టడీస్ తర్వాత పోస్ట్ డాక్టోరల్ కోర్సు చేసి ఇండియాకు తిరిగి వస్తాను. దేశంలో విద్య, పరిశోధన రంగాలను మరింత మెరుగుపరచాల్సి ఉంది. ఆ దిశగా కృషి చేస్తాను. విజయానికి దగ్గరి దారులు అంటూ ఏమీ ఉండవు. ఓర్పు, అంకితభావం ఉంటే ఎంచుకున్న రంగంలో విజయం సొంతమవుతుంది.
Published date : 17 Aug 2013 05:13PM

Photo Stories