Skip to main content

మురికివాడల్లో పెరిగి..గొప్ప శాస్త్రవేత్త స్థాయికి చేరిన ఆణిముత్యం

వీధిదీపాల కింద చదువుకొని గొప్ప శాస్త్రవేత్తగా మారిన అబ్దుల్ కలాం అందరికీ తెలుసు.
అదేవిధంగా మురికివాడల్లో పెరిగి స్వచ్ఛంధ సంస్థల సహాయంతో చదువుకొని శాస్త్రవేత్తగా మారిన ముంబైకి చెందిన జయకుమార్ గురించి ఇవాళ తెలుసుకుందాం..
జయకుమార్ స్వస్థలం ముంబై. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో తల్లివద్ద మురికివాడల్లో పెరిగాడు. తల్లి క్లర్కు ఉద్యోగం చేస్తూ ఇంటి బాధ్యతలు నిర్వహించేది. అయితే తగినంత ఆదాయం లేని కారణంగా బియ్యం కొనుగోలు చేయలేని పరిస్థితి. దీంతో టీ, బిస్కట్లతోనే కాలం గడిపేవారు. ఇతరులు ఇచ్చిన పాత దుస్తులతోనే గడిపేవారు. ఇక జయకుమార్‌ను చదివించడానికి తల్లి వివిధ స్వచ్చంద సంస్థలను ఆశ్రయించింది. అలా ఓ స్థానిక ఆలయ ట్రస్ట్ నుంచి సహాయంతో విద్యాభ్యాసం పూర్తిచేశాడు జయకుమార్. ఆ తర్వాత టీవీ మరమ్మతుల దుకాణంలో నెలకు రూ. 4 వేల జీతానికి పార్ట్‌టైం జాబ్‌లో చేరాడు. ఆ వచ్చిన డబ్బుతో ఫీజులు చెల్లిస్తూ కేజే సోమయ్య ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌గా పట్టభద్రుడయ్యాడు. కాలేజీ రోజుల్లోనే రోబోటిక్స్ ప్రాజెక్టులు తయారుచేసి, మూడు జాతీయ, నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నాడు. కుమార్ ప్రతిభాపాటవాలను గుర్తించిన లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ ఇంటర్న్‌షిప్ అవకాశమిచ్చింది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంట్ రెస్లో (టీఫ్‌ఆర్)లో నెలకు రూ. 30 వేల జీతానికి పరిశోధకుడిగా చేరాడు. జీతంలో ఎక్కువ మొత్తాన్ని తల్లికి పంపేవాడు. చిన్నతనంలో ఇతరుల ఇళ్లల్లో డిస్కవరీ చానల్ చూస్తుండేవాడు. ఆ కారణంగా అతనికి అంతరిక్ష సైన్‌‌సపై మక్కువ ఏర్పడింది. విశ్వంపై పరిశోధనలు చేయాలనే తపనతో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకున్నాడు. అందు కోసం జీఆర్‌ఈ, టోఫెల్ పరీక్షలు రాశాడు. టీఫ్‌ఆర్‌లో పనిచేస్తున్న సమయంలో అతని ప్రతిభను గుర్తించి 2018లో అంతర్జాతీయ పత్రికల్లో వర్ధమాన శాస్త్రవేత్తగా ప్రచురణలు వచ్చాయి. ఇవి యూఎస్‌లోని వర్జీనియా యూనివర్సిటీని ఆకర్షించాయి. వెంటనే యూనివర్సిటీనే స్వయంగా జయకుమార్‌ను గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఆహ్వానించింది. అలా తను కోరుకున్నట్టు పైచదువులు చదువుకుంటూనే నెలకు రూ. 1,50,000 సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం జయకుమార్ తన తల్లిని అమెరికా తీసుకొచ్చి మురికివాడల నుంచి అద్దాల మేడల్లో జీవించేలా చేశాడు. ‘‘ పీహెచ్‌డీ అనంతరం స్వదేశానికి తిరిగివచ్చి భారతదేశాన్ని టెక్నాలజీ కేంద్రంగా మార్చలన్నదే నా లక్ష్యం’’ అని అంటున్నాడు జయకుమార్.
Published date : 28 Aug 2019 04:20PM

Photo Stories