Skip to main content

నాసా మెచ్చిన తెలుగు కుర్రాడు

నాసా (ది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్).. అంతరిక్ష ప్రపంచాన్ని శోధించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న సంస్థ..చంద్రునిపై తొలి సారి కాలు మోపిన నీల్‌ఆర్మ్ స్ట్రాంగ్ నుంచి.. నక్షత్రాంతర రోదసిలోకి ప్రవేశించిన మానవ నిర్మిత అద్భుతం వాయేజర్ వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచింది నాసా.. ఇంతటి ఘనత ఉన్న నాసా మెఫ్పు పొందాడు పాల్ సుధాకర్ వీర్ల.. రెండు పదుల ప్రాయం కూడా దాటని ఈ తెలుగు కుర్రాడు నాసాను మెప్పించిన విధానం, తదితర అంశాలపై తన అభిప్రాయాలను సాక్షి భవితతో పంచుకున్నాడు.. ఆ వివరాలు...

మాది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామం. నాన్న శివయ్య మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నారు. అమ్మ పద్మ గృహిణి. అక్క దివ్య బీటెక్ పూర్తి చేసింది.

రాకెట్లంటే ఇష్టం..
చిన్నప్పటి నుంచి రాకెట్లన్నా, అంతరిక్ష ప్రయోగాలన్నా ఎంతో ఆసక్తి. సంబంధిత విషయాలను ఎంతో నిశితంగా గమనించే వాణ్ని. ఎప్పటికైనా అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకోవాలని అనుకునే వాణ్ని. అందుకే అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని నిర్ణయించుకున్నా. ఆ దిశలోనే ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని నేషనల్ ఏరో స్పేస్ యూనివర్సిటీలో ఎయిర్ క్రాఫ్ట్ అండ్ రాకెట్ డిజైనింగ్ ఇంజనీరింగ్ చేస్తున్నాను.

పదేళ్ల వయసులోనే..
పదేళ్ల వయసులోనే నా ఆలోచనలకు అక్షర రూపమిస్తూ అంతరిక్ష పరిశోధనల గురించి ఒక వ్యాసం రాశాను. నాసా చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను సేకరించే వాణ్ని. ఇదే కోవలో ఆరో తరగతిలో ఉన్నప్పుడు నాసా నిర్వహించిన ఒక రాకెట్ ప్రయోగ వివరాలను ఫైల్‌గా రూపొందించి నాసాకు పంపాను. అలా వరుసగా మూడేళ్లు చేశాను. కానీ అటు నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. అయినా నిరుత్సాహపడలేదు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ సర్వీసింగ్ మిషన్ ప్లానింగ్ అనే ప్రాజెక్ట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించింది. దానికి నా ప్రతిపాదనలతో కూడిన ఒక ప్రాజెక్ట్‌ను పంపించాను. నా ప్రతిపాదనను మెచ్చి నాసా 2009లో మాస్టర్ మైండ్ బిరుదుతో సర్టిఫికెట్ అందించింది. అంతేకాకుండా ఆ సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ వార్షిక సదస్సులో నా ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేసేందుకు ఆహ్వానించింది.

ఇమేజిన్ మార్స్..
2010లో నాసా ఇమేజిన్ మార్స్ (అంగారక గ్రహంపై మానవ జీవనం సాధ్యమా?) అనే అంశంపై ప్రాజెక్ట్ నిర్వహించింది. ఈ అంశంపై నేను సమర్పించిన ప్రతిపాదనలు నాసాకు నచ్చాయి. దీంతో ఆ సంస్థ వేడుకల్లో నా ప్రతిపాదనలను పవర్ పాయింట్ రూపంలో ప్రదర్శించే అవకాశం దక్కింది. అంతేకాకుండా 2011లో స్పేస్ సెటిల్‌మెంట్ డిజైన్ కాంటెస్ట్‌లో నా ప్రాజెక్ట్ట్‌కు ప్రపంచ స్థాయిలో మూడో స్థానం లభించింది. దాంతో ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చింది. 2012లో ఇమేజిన్ మార్స్ మరింత విశ్లేషణతో మరొక ప్రాజెక్ట్‌ను రూపొందించి సమర్పించాను. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల మంది పోటీపడ్డారు. ఇందులో నాకు మూడో స్థానం దక్కింది.

ఎన్‌ఎస్‌ఎస్ కమిటీ చైర్మన్ ప్రశంస
నేను రూపొందించిన ప్రాజెక్ట్‌లను నేషనల్ స్పేస్ సొసైటీ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డేవిడ్ డన్లప్ మెచ్చుకున్నారు. అంతేకాకుండా నాసా అంతర్జాతీయ కమిటీ సభ్యునిగా నియమించారు. ఈ అరుదైన గౌరవం 15 ఏళ్లకే దక్కింది.

కలాంకు జ్ఞాపిక అందజేత
ఎందరికో స్పూర్తిగా నిలిచే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కు జ్ఞాపికను అందించడం మరిచిపోలేని అనుభూతి. 2012లో నాసా నిర్వహించిన రోడ్ మ్యాప్ టు స్పేస్ సెటిల్‌మెంట్ ఆర్ట్ పోటీల్లో ప్రపంచంలో నా ప్రతిపాదనకు ప్రథమ స్థానం లభించింది. దీంతో నాసా నిర్వహించిన ఓ అంతర్జాతీయ స దస్సు నిర్వహణ కమిటీలో సభ్యునిగా పని చేసే అవకాశం దక్కింది. సదస్సుకు సంబంధించి అడ్వర్టయిజింగ్, లోగో డిజైన్ రూపొందించడంతోపాటు ఇంటర్నేషనల్ స్టూడెంట్ కో ఆర్డినేటర్‌గా, స్పేస్ ఎంగేజ్‌మెంట్ ట్రాక్ చైర్మన్‌గా వ్యవహరించాను. ఈ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వచ్చారు. స్పేస్ సోలార్ పవర్‌పై ఇచ్చిన ప్రదర్శన చూసి కలాం నన్ను మెచ్చుకున్నారు. నేషనల్ స్పేస్ సొసైటీ నుంచి భారత రాయబారిగా ఉన్నందున కలాంకు నా చేతుల మీదుగా బెస్ట్ మెమెంటో అవార్డును అందించే అవకాశం లభించింది.

భారత రాయబారిగా
మన దేశంలోని స్పేస్ సొసైటీ, అమెరికాలోని నేషనల్ స్పేస్ సొసైటీకి మధ్య సంబంధాలను నెలకొల్పి, వారి మధ్య చర్చలు నిర్వహించేలా చూడడం భారత రాయబారిగా నా విధి. దీంతోపాటు ఇంటర్నేషనల్ స్పేస్ సొసైటీకి సూచనలు ఇస్తుంటాను.

దేశానికి పేరు తీసుకురావాలి
ప్రస్తుతం టెస్లా అనే పేరుతో హైబ్రిడ్ రాకెట్ తయారు చేస్తున్నాను. దీనివల్ల అంతరిక్షంలో ప్రవేశించడానికి ప్రస్తుత ఖర్చుకన్నా 40 శాతం తక్కువ అవుతుంది. భవిష్యత్‌లో మంచి శాస్త్రవేత్తగా రాణించి అంతరిక్ష రంగంలో మనదేశానికి పేరు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. ఆ దిశగా కృషి చేస్తా.

ఘనతలు
  • 2009లో నాసా మిషన్ మాస్టర్ మైండ్ బిరుదు
  • 2010లో ఇమేజిన్ మార్స్ ప్రాజెక్ట్ మెరిట్ సర్టిఫికెట్
  • 2011లో ఏఎమ్‌ఈఎస్ స్పేస్ సెటిల్‌మెంట్ డిజైన్ కాంటెస్ట్- ప్రపంచంలో 3వ స్థానం
  • 2013లో నాసా రోడ్ మ్యాప్ టు స్పేస్ సెటిల్‌మెంట్ ఆర్ట్ కాంటెస్ట్ -మొదటి స్థానం
  • 2014 మేలో ఓహియో యూనివర్సిటీ సన్‌శాట్ కాంటెస్ట్-ప్రపంచ స్థాయి ఆరోస్థానం
Published date : 12 Sep 2014 12:43PM

Photo Stories