Skip to main content

మెడిసిన్ నా కల: -ఏపీ పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్-2012 ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాణి

వైద్యరంగం అంటే.. చిన్నప్పటినుంచీ ఎంతో ఇష్టం. ఇంట్లో పెద్దవాళ్లు సైతం నేను ఈ రంగంలో స్థిరపడాలని ఆశించేవారు. అందుకే వారి ఆశలు, నా ఆశయానికి న్యాయం చేయడానికి వైద్యరంగంలో అడుగుపెట్టాను. ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలుస్తానని అసలు ఊహించలేదు. ఏదో టాప్ 100 ర్యాంకులో ఉంటాననుకున్నా. కాని నెంబర్‌వన్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు మెడికల్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్-2012 స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్ ఇమ్మని శ్రీవాణి. టాపర్‌గా నిలవడానికి ఆమె చేసిన కృషి.. ఆమె జీవిత లక్ష్యం.. పలు అంశాలపై ఆమెతో సాక్షి ఇంటర్వ్యూ!!
 

మెడికల్ పీజీ ఎంట్రన్స్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించడం ఏమనిపిస్తోంది? ర్యాంకు ముందే ఊహించారా?
మెడికల్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించడం నిజంగా గర్వకారణంగా ఉంది. అసలు స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చిందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. కేవలం పీజీ పరీక్షలో మంచి మార్కులు సాధించి కోరుకున్న స్పెషలైజేషన్‌లో చేరాలనుకున్నా. అంతేకాని ఫస్ట్‌ర్యాంకు దృష్టితో చదవలేదు. పైగా పరీక్షరాసిన తర్వాత ఫలితాల్లో టాప్ 100 నుంచి 50 ర్యాంకులోపు రావచ్చనుకున్నా. కాని 200 మార్కులకు 179 మార్కులు రావడంతో ఫస్ట్‌ర్యాంకర్‌నవుతానని ఊహించలేదు.


మీ విద్యా, కుటుంబం నేపథ్యం?
మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. నాన్న రాజమండ్రిలోని ఓఎన్జీసీలో డీజీఎంగా పనిచేస్తున్నారు. అక్క, తమ్ముడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. నా చదువంతా రాజమండ్రిలోనే జరిగింది. ఇంటర్ శ్రీచైతన్యలో చేశా. ఇంటర్ బైపీసీలో మొత్తం 975 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత ఎంసెట్‌లో 800 ర్యాంకు వచ్చింది. మెడిసిన్ చేయడం నా లక్ష్యం కావడం, మంచి ర్యాంకు రావడంతో.. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరాను. నా సక్సెస్‌కు ఇంట్లో ప్రోత్సాహక వాతావ రణం
 కారణం.


మెడికల్ పీజీ పరీక్షలో పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఎలా ప్రిపేరయ్యారు?
వాస్తవానికి పీజీలో మంచి సబ్జెక్టులో చేరాలనుకున్నా. మంచి స్పెషలైజేషన్‌లో చేరాలంటే మంచి ర్యాంకు రావాలి. అందుకే స్కోరింగ్ ఎక్కువ వస్తేనే ఇది సాధ్యమవుతుంది. పైగా ఈ ఎంట్రన్స్ టెస్ట్‌కు పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. మంచి స్పెషలైజేషన్ కోరుకునే వారంతా బాగా చదువుతారు. అందుకే నేను కూడా ఈ పోటీలో రాణించాలంటే.. ఎక్కువ మార్కులు సాధించాల్సిందేననుకున్నా. అందుకే దానికితగ్గ విధంగా ప్రిపరేషన్ మొదలుపెట్టా. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌కు ముందు ఎయిమ్స్ టెస్ట్ రాశా.  ప్రధానంగా సబ్జెక్టువైజ్‌గా ప్లానింగ్‌తో చదివా. చదివిన సబ్జెక్టును మర్చిపోకుండా ఉండేందుకు తిరిగి వారంలోపు రివిజన్ చేశాను. దాంతో సబ్జెక్టుపై కమాండ్ పెరిగింది. వీటన్నింటికితోడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బాగా ప్రాక్టీస్‌చేశాను. దీనివల్ల స్కోరింగ్ మెరుగైంది. రోజుకు కనీసం నాలుగు గంటలు చదివాను.

 ఫస్ట్‌ర్యాంకు సాధించిన మీరు పీజీలో ఏ సబ్జెక్టులో చేరుతారు?
జనరల్ మెడిసిన్, లేదంటే రేడియాలజీ ఆప్షన్లు ఎంచుకున్నా. రెండింటిలో ఎందులో సీటు వచ్చినా జాయిన్ అవుతా. ఉస్మానియా మెడికల్ కాలేజా.. ఆంధ్రా మెడికల్ కాలేజీలో చేరాలా? ఇంకా నిర్ణయించుకోలేదు.

వైద్యరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడానికి కారణం?
ఇంటర్ తర్వాత అనేకరకాల మంచి మంచి కెరీర్లున్నాయి. అందుకే మా ఇంట్లో అక్క బీటెక్ చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆ ప్రభావం నాపై పడలేదు. మొదటినుంచీ వైద్యవృత్తి చేపట్టాలనేది నా కోరిక. పైగా ఈ రంగంలో ఎంతోమందికి ప్రత్యక్షంగా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇంట్లో పెద్దవాళ్లు కూడా నన్ను వైద్యురాలిగా చూడాలని మొదటి నుంచీ కోరుకుంటున్నారు. పైగా మెడిసిన్ చేస్తే ఫ్యామిలీలో డాక్టర్ ఉన్నారనే ధీమా కూడా ఉంటుంది. అందుకే ఇవన్నీ ఆలోచించి వైద్యరంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నా.

మెడికల్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలనుకనే వారికి మీ సలహా?
మెడికిల్ పీజీ ఎంట్రన్స్ కొంతవరకు కష్టంగా ఉన్నా.. మంచి స్కోరింగ్ చేయడం పెద్ద కష్టంకాదు. పైగా స్కోరింగ్ మన ర్యాంకును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రిపరేషన్ పకడ్బందీగా చేయాలి. చదివిన విషయాన్ని మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎంతబాగా చదివినా రివిజన్ విషయంలో ప్రణాళిక అవసరం. బాగా చదివిన వాళ్లు సైతం సరైన రివిజన్ లేక మార్కులు పోగొట్టుకున్న సందర్భాలెన్నో. అందుకే ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో.. రివిజన్ కూడా అంతే ముఖ్యం. నేను కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించడంలో రివిజన్ బాగా ఉపయోగపడింది. కేవలం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్ మినహా ఎలాంటి ప్రత్యేక పుస్తకాలు చదవలేదు. ఫస్ట్ ర్యాంకర్‌గా నిలవడానికి కోచింగ్ అవసరం లేదనేది నా అభిప్రాయం.

మీ జీవిత లక్ష్యం?
పీజీ పూర్తిచేసి మంచి వైద్యురాలిగా స్థిరపడతా. ఏ పనిచేసినా అందులో ది బెస్ట్ అనేటట్లు చేస్తే ఎవరైనా విజయం సాధించగలుగుతారు. చాలామంది వైద్యరంగంలో ఉంటూనే సివిల్స్ రాస్తున్నారు. ప్రస్తుతానికి అటువంటి ఆసక్తిలేదు.

Published date : 24 Mar 2012 05:13PM

Photo Stories