Skip to main content

ప్రణాళికతో చదివితే.. ఫలితం గ్యారెంటీ

‘డాక్టర్ అవ్వాలనేది చిన్ననాటి కల. అందుకే ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీబీఎస్‌లో చేరడమే లక్ష్యంగా చదివా. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చదివితే ఎయిమ్స్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లోనూ మెరుగైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు’ అంటున్నాడు ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు, నిన్న విడుదలైన జిప్‌మర్ ఎంబీబీఎస్ ఎంట్రన్‌‌సలో ఆలిండియా స్థాయిలో 20వ ర్యాంకు సాధించిన ఎర్ల సాత్విక్ రెడ్డి. తన సక్సెస్ స్పీక్స్..
నాన్న నరేందర్ రెడ్డి న్యాయవాది. అమ్మ శశికళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే! పదో తరగతిలో ఏ-1 గ్రేడ్, ఇంటర్మీడియెట్‌లో 98.9 శాతం మార్కులు సాధించాను. వైద్య విద్యను ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లో చదవాలని ఎయిమ్స్‌కు సిద్ధమయ్యాను. ఏపీ ఎంసెట్‌లోనూ రెండో ర్యాంకు లభించింది.

ప్రణాళికాబద్దంగా
ఆయా ప్రవేశ పరీక్షలకు ప్రణాళిక బద్ధంగా ప్రిపరేషన్ సాగించాను. ఇందుకోసం ఇంటర్ మొదటి ఏడాది నుంచే నిర్దిష్ట ప్రిపరేషన్ శైలిని పాటించా. చదివే ప్రతి అంశాన్ని ప్రాక్టికల్ దృక్పథంతో, వాస్తవ పరిస్థితులకు అన్వయించుకుంటూ అభ్యసించాను. క్లాస్ రూం, సెల్ఫ్ లెర్నింగ్ రెండూ కలిపి రోజుకు పన్నెండు గంటలు చొప్పున చదివాను. ఆయా ఎంట్రన్స్‌లకు గత పరీక్షల ప్రశ్నపత్రాల సాధనతోపాటు వీక్లీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు కూడా ఎంతో మేలు చేశాయి. సబ్జెక్ట్ ప్రిపరేషన్‌లోనే ముఖ్యమైన ఫార్ములాలను నోట్స్‌లా రాసుకున్నా.

ఎయిమ్స్.. అప్లికేషన్ ఓరియెంటేషన్
ఎయిమ్స్ పరీక్ష ప్రశ్నల్లో అధిక శాతం అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. డయాగ్రమ్స్‌లో భాగాలను గుర్తించండి అని అడగడానికి బదులుగా డయాగ్రమ్‌లో నిర్దిష్టంగా పేర్కొన్న భాగం ప్రాధాన్యతను తెలిపేలా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ముందు నుంచే అందుకనుగుణంగా సిద్ధం కావాలి. తద్వారా సులువుగా సమాధానాలు గుర్తించొచ్చు.

ప్రాక్టీస్ టెస్ట్‌లు.. ప్రధాన సాధనాలు
ఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యంగా ఇంటర్‌లో చేరే విద్యార్థులు మొదటి నుంచే అకడమిక్స్‌ను ఎంట్రన్స్‌తో అనుసంధానం చేసుకుంటూ సాగాలి. సెకండియర్ బోర్డ్ పరీక్షల ప్రారంభానికి కనీసం మూడు నెలల ముందుగా ఎంట్రెన్స్ టెస్టుల సిలబస్ పూర్తిచేయాలి. వీలైనన్ని ప్రాక్టీస్ టెస్ట్‌లకు హాజరు కావాలి. అదే విధంగా ఇన్‌స్టిట్యూట్‌లలో నిర్వహించే గ్రాండ్ టెస్ట్‌లు, వీక్లీ టెస్ట్‌లు రాయాలి.

న్యూరాలజిస్టునవుతా
ఎయిమ్స్, జిప్‌మర్‌లో రెండింటిలో సీటు వస్తుంది. అయితే ఎయిమ్స్‌కే నా ప్రాధాన్యత. ఎంబీబీఎస్ పూర్తి చేశాక.. న్యూరాలజీ స్పెషలైజేషన్‌తో పీజీ చేస్తా.
Published date : 17 Jun 2016 04:11PM

Photo Stories