Skip to main content

ఇష్టంగా చదివితే మొదటి స్థానం మీదే: ఎయిమ్స్ 2014 టాపర్ శ్రీవిద్య

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS)లో మెడిసిన్ చదవటం అనేది లక్షల మంది విద్యార్థుల కలల్లో ఒకటి. దాన్ని నిజం చేసుకోవాలంటే ఎయిమ్స్ 2014 ప్రవేశపరీక్షలో అర్హత సాధించాలి. అలాంటి ఎయిమ్స్ ప్రవేశపరీక్ష చరిత్రలో మొదటి సారిగా ఒక తెలుగమ్మాయి జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. విశాఖపట్నంకు చెందిన విద్యార్థిని పట్టిసపు శ్రీవిద్య తన పేరుని సార్ధకంచేసుకుంది.

మీరు ఇష్టంతో చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారని పెద్దలు చెబుతుంటారు. అది శ్రీవిద్య విషయంలో మరోసారి రుజువయింది. తన తల్లిదండ్రుల ప్రేరణ, అధ్యాపకుల పోత్సాహం వల్ల చదువుని ఇష్టంగా మార్చుకున్నానని చెబుతోంది. సినిమాలు, ఇతర వ్యాపకాలతో కొంత సమయాన్ని సరదాగా గడుపుతూనే అన్ని పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించానని అంటోంది.

సబ్జెక్టుని ఇష్టంగా చదివితే ప్రతి పరీక్షలో మీరే విజేత అవుతారంటున్న శ్రీవిద్య సాక్షిఎడ్యుకేషన్.కామ్‌తో తన అభిప్రాయాలను పంచుకుంది. అవి మీకోసం..

ఎయిమ్స్ ఎంట్రన్స్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించినందుకు అభినందనలు. మీ కుటుంబం గురించి చెప్పండి.
థాంక్యూ. మా నాన్న పేరు పీవీఎస్ ప్రసాద్. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ రాజ్యలక్ష్మి కెనరా బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. చెల్లెలుదివ్య... ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. విశాఖపట్నం సీతమ్మధారలో ఉంటున్నాం.

మీరు మెడిసిన్ చదవాలనే ఆలోచన వెనుక కారణం ఏమిటి?
నాన్నగారు అతని స్నేహితుడి కోసం పీడియాట్రిక్ న్యూరో ఫిజీషియన్ అపాయింట్‌మెంటు తీసుకోవడానికి వెళ్తే ఆరు నెలల తర్వాత రమ్మన్నారట. అందుకని నా చిన్నప్పుడు నేను పెద్దయ్యాక డాక్టరు అయితే బాగుంటుందని అనుకునేవారట. అయితే నా చదువు విషయంలో అమ్మా నాన్నా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను ఇంటర్‌కి వచ్చాక బైపిసిలో చేరమని కూడా ఆయన ఎటువంటి ఒత్తిడి చేయలేదు. నా ఇష్టప్రకారమే చేరాను. అమ్మనాన్నల సహకారంతో పాటు మా లెక్చరర్లు, కళాశాల యాజమాన్యం, మా ఆంటీ డాక్టర్ విజయలక్ష్మి ప్రోత్సాహంతోనే నేను బాగా చదవగలిగాను.

వైద్య వృత్తి ఒకవైపు, పరిశోధనలు మరోవైపు.. మీరు దేనిని ఎంచుకుంటారు?
ఇంటర్ సెకండియర్‌లోకి రాగానే బయాలజీ సబ్జెక్టుపై నాకు ఆసక్తి పెరిగింది. చదువుతున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఉండేది. అందుకే సబ్జెక్టుపరంగా రాణించాలని నిర్ణయించుకున్నా. పైగా కేవలం డాక్టర్ని అయితే క్లినికల్ సర్వీసుకే పరిమితం అవుతాను. అదే నాన్ క్లినికల్ కోర్సులు చేస్తే రీసెర్చి వైపు వెళ్లవచ్చని అనుకున్నాను. మాలిక్యులర్ బయాలజీలో పరిశోధనలు చేసి మానవాళికి ఉపయోగపడాలనేది నాకోరిక. మా అమ్మా నాన్నా దీనికి ఒప్పుకున్నారు. మొదట్లో నాకు జిప్‌మర్‌లో జాయిన్ అవ్వాలని కోరిక ఉండేది. దానికి ప్రిపేర్ అవుతూనే మణిపాల్ మెడకల్ ఎంట్రన్స్, ఎయిమ్స్, ఎంసెట్ రాశాను. జిప్‌మర్‌లో 9వ ర్యాంకు, మణిపాల్‌లో 8, ఎంసెట్‌లో 7వ ర్యాంకు వచ్చాయి. ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్‌లో 59వ ర్యాంకు వచ్చింది. ఎయిమ్స్‌కు 2 లక్షల 35 వేల మంది రాస్తే 9 వేల మంది అర్హత సాధించారు. వాళ్లందరిలో నాకు ప్రథమ ర్యాంకు వచ్చింది.

ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?
ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయాలనే కోరిక బైపిసి విద్యార్థులు అందరికీ ఉంటుంది. ఎంసెట్, జిప్‌మర్,మణిపాల్, ఏఐపీఎంటీ ఎంట్రన్స్‌ల్లో మంచి ర్యాంకు వస్తుందని తెలుసు. కానీ ఎయిమ్స్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నా. ఎంసెట్‌కు ప్రిపేరయిన శైలికి ఇంకొంత సానపెట్టి ఆ దిశగా ప్రయత్నం సాగించా. అయితే ఎయిమ్స్‌లో మొదటి స్థానం వస్తుందని నేను ఊహించలేదు. సీటు వస్తే చాలు అనుకున్నాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో 72 సీట్లకు గాను 37 ఓపెన్ కేటగిరీకి ఉంటాయి. అక్కడ చేరదామనుకుంటున్నాను.

ఎంసెట్ ప్రిపరేషన్ ఎయిమ్స్‌కు ఎంతవరకూ సాయపడింది?
చాలా సాయపడింది. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా ఒకటే. ఎంసెట్ అనంతరం ఎయిమ్స్ రాయడానికి ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ స్వల్ప వ్యవధిలోనే క్లిష్టంగా ఉన్న అంశాలపై దృష్టి పెట్టి విశ్లేషణాత్మకంగా చదివాను.

ఎంసెట్‌తో పోలిస్తే ఎయిమ్స్ ప్రశ్నల సరళిలో తేడా ఏమిటి?
ఎంసెట్ లో బయాలజీ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం సులభంగానే ఉంటుంది. ఎయిమ్స్ పరీక్ష విషయానికి వస్తే దీనికి పూర్తి భిన్నం. కానీ ఈ ఏడాది మాత్రం కొంచెం ఈజీగానే పేపర్ వచ్చింది.

తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలవడానికి కారణం?
చ దువుకోవడం ఏనాడూ భారంగా భావించలేదు. ప్రతీ సబ్జెక్ట్‌ను ఆస్వాదిస్తూ చదివాను. చదివే ప్రతీ అంశాన్నీ ఆస్వాదించాను. ఎంత ఎక్కువ సేపు చదివితే అంత ఆనందం కలిగేది. ఎయిమ్స్‌లో సీటుసంపాదిస్తాననే నమ్మకం ముందు నుంచీ ఉంది. ప్రత్యేకంగా చేసిందల్లా ఒకటే. పరీక్షలో 22 మార్కులకు సమాధానాలు తెలియక తప్పులు చేయడమెందుకని వదిలేశాను. తెలిసిన వాటికి మాత్రమే సమాధానాలిచ్చా. బహుశా ఇలా చేయడం వల్లే టాపర్‌గా నిలిచాననుకుంటా.

ప్రిపరేషన్ ఎలా సాగింది?
ఇంటర్‌లో ఉన్నప్పుడే అటు చదువుతోపాటు ఎంసెట్‌కు ప్రిపేరయ్యాను. పరీక్షలకు చదివేటప్పుడు ప్రతీ అంశాన్ని అన్వయించుకుంటూ చదివాను. క్లిష్టంగా ఉన్న అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేశాను. అలా చదవడమే ఎంసెట్, ఎయిమ్స్, మిగిలిన పరీక్షలకు సహాయపడింది.

ప్రత్యేకంగా ప్రణాళిక ఏమైనా వేసుకునేవారా?
చదువుకోడానికి, సాధన చేయడానికి ఒక నిర్దిష్ట సమయం అంటూ ఉండదు. ఒక్కో రోజు 8 గంటలు , మరోసారి 10 గంటలు, ఒక రోజు పది నిమిషాలే చదువుతాను. ఏది చదివినా ఎంత సేపు చదివినా ఇష్టంగా చదవాలి. ఇష్టం లేకుండా గంటల తరబడి చదివినా ఉపయోగం లేదు. కాలేజీలో ఉన్నపుడు పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టేదాన్ని. ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు పూర్తిగా అక్కడే చదువు. చివరి ఆరునెలల స్టడీ ప్లాన్ అమలు సమయంలో రాత్రి 10 గంటల వరకు కాలేజీలో ఉండేదాన్ని. ప్రతి రోజు ఎంతసేపు చదవాలనేదానికన్నా ఎంత ఎక్కువ అర్థమయ్యే విధంగా చదివానో చూసుకునేదాన్ని. క్లాసులో అధ్యాపకులు చెప్పే పాఠాలు వినడంపై నూటికి నూరు శాతం ఏకాగ్రత ఉండేది. ప్రతి చిన్న అంశాన్ని కీలకంగా సాధన సాధన చేశాను. పాఠాలు వినేటపుడు ఇతర విషయాలు పట్టించుకోకూడదు. అప్పుడే సబ్జెక్టుపై పట్టు సాధించగలం. నేను అదే చేశాను.
కాలేజీలో నిర్వహించే ప్రతి చిన్న పరీక్షను ఫైనల్‌గా భావించేదాన్ని. అందుకు తగ్గట్టుగా సాధన చేసేదాన్ని. ప్రతి టర్మ్ ఎగ్జామ్‌లోను ప్రథమ స్థానంలో ఉండాలనేది లక్ష్యంగా పెట్టుకుని చదివాను. ఇది ప్రవేశ పరీక్షల్లో బాగా ఉపయోగపడింది. లెక్చరర్లను సందేహాలు అడిగేందుకు ఎప్పుడూ జంకేదాన్ని కాదు. మా అధ్యాపకులు ఈ విషయంలో నాకు బాగా సహకరించారు.

ఏయే పుస్తకాలను చదివారు?
కాలేజీలో ఇచ్చే మెటీరియల్‌తో పాటు అకాడమిక్స్ పాఠ్యపుస్తకాలు ఫాలో అయ్యాను. అందుబాటులో ఉన్న ఏ మెటీరియల్‌ను వదల్లేదు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఎన్.సి.ఇ.ఆర్.టి రూపొందించిన సబ్జెక్ట్ పుస్తకాలను చదివితే సరిపోతుంది. తెలుగు అకాడ మీ కూడా వీటికి సమానంగానే ఉన్నాయి.

చదవటం బోర్ కొడితే ఏంచేస్తారు?
నాకు బాగా అలసట అనిపించినపుడు, బోర్ కొట్టినపుడు ఎక్కువ గా ఇంగ్లీషు ఫాంటసీ నవలలు చదువుతా. హారీ పాటర్, డాన్ బ్రౌన్ నవలలన్నీ చదివేశా. బాగా నిద్రపోతా. సినిమాలు చూస్తాను. పరీక్షలు వారం ఉన్నాయనగా సినిమా చూడాలనిపించింది. వెంటనే చూసేశా. లేదంటే మనసు డైవర్ట్ అవుతుంది. సినిమా చూసి ఆ తర్వాత ప్రశాంతంగా చదువుకున్నా. ఆయిల్ పెయింటింగ్స్ బాగా వేస్తా.

మీ అమ్మానాన్నల సహకారం ఎలా ఉండేది?
ఇంటర్‌లో టాపర్‌గా నిలవాలి. నువ్వు డాక్టర్ కావాలి అని ఏనాడూ
అమ్మానాన్నలు ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదు. నా ఇష్టాఇష్టాలకు స్వేచ్ఛనిచ్చారు. ఆ విధంగా నన్ను ప్రోత్సహించారు. వారివల్లే ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరబోతున్నాను. ఇల్లు వదిలి బయట చదువుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. అక్కడి హాస్టల్ వాతావరణానికి అలవాటు పడ తాను. లక్ష్య సాధన కోసం కొన్నాళ్లు తల్లిదండ్రులను వదిలి దూరంగా ఉండక తప్పదు.

మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోబోయే విద్యార్థులకు ఏమని సలహా ఇస్తారు?
  • నిర్దేశించుకున్న లక్ష్యం స్పష్టంగా ఉండాలి.
  • అది సాధించుకోవడానికి మంచి విద్యా సంస్థను ఎంపిక చేసుకోవాలి.
  • తరగతి గదిలో వంద శాతం ఏకాగ్రత కలిగి ఉండాలి.
  • సందేహాల నివృత్తికి లెక్చరర్లను అడగటానికి వెనకాడకూడదు.
  • సబ్జెక్టును ప్రేమించాలి. చదవడం హాబీగా మార్చుకోవాలి.
  • పరీక్షలు ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా చదవాలి.
  • ఇష్టమైన గ్రూపును ఎంచుకుని అంతే ఇష్టంగా చదవాలి.
  • మనం ఎవరో చెపితే చదవడం కాదు. మనకు మనంగా తెలుసుకుని చదువుకోవాలి.
  • సబ్జెక్టుపై పట్టు సాధిస్తే ర్యాంకులు వాటంతట అవే వస్తాయి.
  • నీకంటూ ఓప్రత్యేకత నిలుపుకునే విధంగా సాధన చేయాలి.
అకడమిక్ ప్రొఫైల్
టెన్త్ (సీబీఎస్‌ఈ) 10జిపిఎ
ఇంటర్ 984 మార్కులు
ఎంసెట్ 7వ ర్యాంక్
జిప్‌మెర్ 8వ ర్యాంక్
మణిపాల్ ప్రవేశపరీక్ష 9వ ర్యాంక్
ఏఐపీఎంటీ 59వ ర్యాంక్


పిల్లలకు చదువుపై ఆసక్తిని కలిగిస్తే చాలు, అద్భుతాలు చేస్తారు: శ్రీవిద్య పేరెంట్స్
"మా అమ్మాయిని చిన్నప్పటినుంచే స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహించాం. తను స్కూల్‌లో జాయిన్ అవటానికి ముందు ఎనిమిది పాఠశాలలు చూసి, చివరకు పెదవాల్తేరులోని కిడ్స్ క్రియేట్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంది. ఆ స్కూలులో నేర్పిన బేసిక్స్, అధ్యాపకుల శ్రద్ధ, బోధనా విధానం.. ఈరోజు మా అమ్మాయి ఎయిమ్స్ టాపర్ అవటానికి పునాదిగా నిలిచాయని అనుకుంటున్నాను.

ఎనిమిదవ తరగతిలో తన ఫ్రెండ్ వైదేహిప్రభావం వల్ల మెడిసిన్ చదవాలనుకుంది. తనకు మామూలు డాక్టర్‌గా ఉండిపోవటం కంటే మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయటంపై ఆసక్తి ఉంది. తను సబ్జెక్టుని పూర్తిగా అవగాహన చేసుకుని ఉండటం వలన ఎయిమ్స్ ఎగ్జామ్‌లో సమయంలో కూడా ఒత్తిడిగా ఫీల్ అవలేదు. నెగటివ్ మార్కింగ్ ఉండటం వలన తనకు తెలిసినవే ఆన్సర్ చేసి, తెలియనివి వదిలివేసింది. బహుశా ఇదే మా అమ్మాయిని మిగిలిన వారికన్నా ముందు నిలిపి ఉంటుంది.

టీచర్స్‌పై నమ్మకం, వారు చెప్పింది విని అర్ధం చేసుకోవటం, వారికి విధేయంగా ఉండటం కూడా విద్యార్థి విజయానికి కారణమవుతాయి. మా అమ్మాయి విషయంలోనూ అంతే జరిగింది. తను క్లాసులను శ్రద్ధగా వినేది, స్టడీ అవర్స్‌లో పూర్తిగా చదువుకునేది. ఇంటికి వచ్చాక రిలాక్స్ అయ్యేది. తనకు నచ్చిన పుస్తకాలు చదవటంతో పాటు ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లటం, ఫ్యామిలీతో కొత్త సినిమాలకు వెళ్లటం కూడా చేసేది. తనకు హారీపోట్టర్ సిరీస్ బుక్స్ అంటే ఇష్టం. అందులోని స్టూడెంట్-టీచర్ రిలేషన్‌షిప్, విద్యార్ధులు పరిశోధించే తీరు తనను ఆకట్టుకునేవి. అయితే చదువు విషయంలో మేమెప్పుడూ తనపై ఒత్తిడి తీసుకురాలేదు. ర్యాంకులు, మార్కులు కన్నా సబ్జెక్టుని నేర్చుకోవటంపై శ్రద్ధపెట్టమని మాత్రం చెప్పాము. తను అదే చేసింది. పిల్లల ఆసక్తులను గమనించి, వారు ప్రశాంతంగా చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి."
-- పివిఎస్ ప్రసాద్, శ్రీవిద్య తండ్రి


"మా అమ్మాయికి ఎయిమ్స్‌లో మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదు. తను పడిన శ్రమకు మంచి ఫలితాన్నివ్వమని మాత్రం భగవంతుని ప్రార్ధించాను. తన కష్టం ఫలించింది.
తనకు ఏ అంశమైనా మూలాలనుంచి తెలుసుకోవటంపై ఆసక్తి ఉంది. అన్ని సబ్జెక్టులను ఇష్టంతో చదివేది. సబ్జెక్ట్ గ్రిప్‌లో ఉన్నప్పుడు పరీక్షల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కదా. తనకు నవలలు, సినిమాలు వంటి చిన్నచిన్న కోరికలు ఉంటాయి. వాటి కి మేము అడ్డు చెప్పలేదు. వీలయినంత వరకూ సినిమా రిలీజైన రెండు మూడురోజుల్లోనే కుటుంబంతో వెళ్లటానికి ప్రయత్నిస్తాం. పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ల నాన్న గారు టూర్లకు తీసుకెళ్లేవారు. కొత్త ప్రదేశాలు చూడటం, అక్కడి వాతావరణం, మనుషులు, పరిస్థితులను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటం వల్ల కూడా మా అమ్మాయి అవగాహన శక్తి పెరిగింది.

పిల్లలకు కావలసినవన్నీ అరేంజ్ చేయటం వలన, వారు చదువుకోవటం తప్ప దేనికీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలి. వారికి చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి కలిగించాలి. ప్రతీ సబ్జెక్టుని ఇష్టంతో చదివేలా ప్రోత్సహించాలి. అలా చేయటం వలన వాళ్లు అద్భుతాలు సాధిస్తారనటానికి మా అమ్మాయే నిదర్శనం."
--రాజ్యలక్ష్మి, శ్రీవిద్య తల్లి.
Published date : 28 Jun 2014 05:20PM

Photo Stories