Medical College Entrance Exam: అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థులకు గందరగోళం! అసలేం జరిగింది?
ఆసిఫాబాద్‌రూరల్: వైద్యవృత్తిలో చేరి పేదలకు సేవ చేయాలని నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్(నీట్– 2024)కు హాజరైన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. అధికారుల తప్పిదం వారికి శాపంగా మారింది. దేశవ్యాప్తంగా ఒక సెట్ ప్రశ్నపత్రంతో నీట్ నిర్వహిస్తే.. జిల్లాలో మాత్రం విద్యార్థులకు మరో సెట్ ప్రశ్నపత్రం అందించి పరీక్ష రాయించారు. రోజుల తరబడి చదివి హాజరైన పరీక్ష ఫలితాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేట్ స్కూల్‌లో సెంటర్..
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఏటా ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన మార్కులు, ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని విద్యార్థులకు కూడా ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నీట్ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఈ ఏజెన్సీ ప్రశ్నపత్రం రూపొందించి పరీక్ష నిర్వహిస్తుంది. నీట్ నిర్వహణ కోసం జిల్లాలో మొదటిసారిగా ఆసిఫాబాద్ పరీక్ష కేంద్రం కేటాయించారు. ఆసిఫాబాద్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన పరీక్షకు మొత్తం 323 మంది విద్యార్థులకు 299 మంది హాజరయ్యారు. 24 మంది గైర్హాజరయ్యారు.
Tenth Class Rankers: విద్యార్థుల ఉన్నత ఫలితాలకు ప్రశంసలు..
తప్పిదంపై ఆర్డీవోతో విచారణ
ప్రశ్నపత్రం తారుమారు కావడంపై కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశాలతో ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావు విచారణ చేపట్టారు. ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లి సిటి కోఆర్డినేటర్ నరేందర్‌ను విచారించగా.. ప్రశ్నపత్రం తారుమారైందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిశారు. న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు. జరిగిన తప్పిదం గురించి నీట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని, అప్పుడే కొంత ఊరటగా ఉంటుందని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ.. వెబ్‌సైట్‌లో అలా పెట్టేందుకు వీలు కాదని, విద్యార్థులు ఆందోళన చెందాల్సి అవసరం లేదన్నారు. విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తానని పేర్కొన్నారు. అధికారికంగా రెండు సెట్ల పేపర్లకు కీ వస్తుందని తెలిపారు. కలెక్టర్ హామీ ఇచ్చినా తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
TS SET 2024: టీఎస్ సెట్ పరీక్షల తేదీల మార్పు, ఫీజు తగ్గించాలని వినతి
ప్రశ్నపత్రం తారుమారు..
నీట్ కోసం ఎన్‌టీఏ ఆధ్వర్యంలో రెండు సెట్ల ప్రశ్నపత్రాలు రూపొందించారు. రెండు సెట్ల పేపర్లను ఆసిఫాబాద్ పట్టణంలోని ఎస్‌బీఐ, కెనరా బ్యాంకుల్లో వేర్వేరుగా భద్రపరిచారు. పరీక్షకు ముందు ఎన్‌టీఏ నుంచి నిర్వాహకులకు అందిన ఈ– మెయిల్ ద్వారా ప్రశ్నపత్రాలను కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఎస్‌బీఐలో భద్రపరిచిన జీఆర్‌ఐడీయూ కోడ్‌తో ఉన్న సెట్ ప్రశ్నపత్రాలను వినియోగించాల్సి ఉంటుంది. జిల్లా అధి కారులు నిర్లక్ష్యంతో కెనరా బ్యాంకులోని ఎన్‌ఏజీఎన్‌యూ కోడ్ సెట్ ప్రశ్నపత్రాలతో పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఒక సెట్‌తో పరీక్ష నిర్వహిస్తే.. జిల్లాలో విద్యార్థులు మాత్రం మరో ప్రశ్నపత్రానికి సమాధానాలు రాశారు. జిల్లాలో నీట్ నిర్వహణ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇచ్చిన ప్రశ్నపత్రానికి బార్‌కోడ్ ఉండగా.. జిల్లాలో ఇచ్చిన క్వశ్చన్ పేపర్లకు కనీసం బార్‌కోడ్ కూడా లేదని విద్యార్థులు చెబుతున్నారు.
Joint Trade Committee: భారత్, ఘనా జాయింట్ ట్రేడ్ కమిటీ సమావేశం.. కుదుర్చుకున్న కీలక ఒప్పందాలు ఇవే.