Skip to main content

NEET: నీట్‌లో టాప్‌ లేపిన తెలుగు విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్‌’ పరీక్షలో తెలుగు విద్యార్థులు టాప్‌ లేపారు.
NEET
నీట్‌లో టాప్‌ లేపిన తెలుగు విద్యార్థులు

జాతీయ స్థాయిలో ఫస్ట్‌ ర్యాంకుతోపాటు టాప్‌–50లో ఏడు ర్యాంకులను ఏపీ, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఏపీకి చెందిన బోరా వరుణ్‌ చక్రవర్తి 720 మార్కులకు 720 సాధించి ఆలిండియా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌ కూడా 720 మార్కులతో మొదటి ర్యాంకును పంచుకున్నాడు. ఇక తెలంగాణ నుంచి కంచాని జయంత్‌ రఘురామరెడ్డికి 15వ ర్యాంకు, ఏపీకి చెందిన వైఎల్‌ ప్రవర్థన్‌రెడ్డి 25వ ర్యాంకు (ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో దేశంలోనే తొలి స్థానం), వి.హర్షిల్‌సాయి 35వ ర్యాంకు, కె.యశశ్రీ 40వ (ఎస్సీ విభాగంలో రెండో స్థానం), కల్వకుంట్ల ప్రణతిరెడ్డి 45వ ర్యాంకు, తెలంగాణకు చెందిన బోడెద్దుల జాగృతి 49వ ర్యాంకు (మహిళల కేటగిరీలో పదో స్థానం) సాధించారు. ఇక ఆలిండియా 119వ ర్యాంకు సాధించిన ఏపీ విద్యార్థి ఎం.జ్యోతిలాల్‌ చావన్‌ ఎస్టీ విభాగంలో దేశంలో టాప్‌ ర్యాంకు కొల్లగొట్టాడు. తెలంగాణకు చెందిన లక్ష్మి రష్మిత గండికోట 52వ ర్యాంకు (మహిళల కేటగిరీలో 12వ ర్యాంకు) సాధించింది. 

చదవండి: Top 10 medical colleges: టాప్ టెన్ మెడిక‌ల్ కాలేజీలు ఇవే... ఇక్క‌డ సీటు వ‌స్తే సెటిలైన‌ట్లే..!

జాతీయ స్థాయిలో 56.21 శాతం అర్హత 

నీట్‌ యూజీ–2023 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం రాత్రి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 20,38,596 మంది పరీక్ష రాయగా.. 11,45,976 మంది (56.21 శాతం) అర్హత సాధించారు. ఇందులో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది ఉన్నారు. నీట్‌ ఫలితాల్లో తమిళనాడుకు చెందిన కౌస్తవ్‌ బౌరి 3వ, పంజాబ్‌కు చెందిన ప్రాంజల్‌ అగర్వాల్‌ 4వ, కర్ణాటకకు చెందిన ధ్రువ్‌ అద్వానీ 5వ ర్యాంకు సాధించారు. ఈసారి పేపర్‌ కఠినంగా ఉన్నా కటాఫ్‌ మార్కులు పెరిగాయని నిపుణులు చెప్తున్నారు. గతేడాది అన్‌ రిజర్వ్‌డ్, ఈడబ్లు్యఎస్‌ కటాఫ్‌ మార్కులు 117 కాగా.. ఈసారి 137కు పెరిగాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పీహెచ్, ఎస్సీ పీహెచ్‌ల కటాఫ్‌ మార్కులు గతేడాది 93 కాగా.. ఈసారి 107కు పెరిగాయి. 

చదవండి: National Medical Commission: ఎన్‌ఎంసీ తీరు మారాలి

వారంలో రాష్ట్రస్థాయి ర్యాంకులు 

ఆలిండియా కోటాలోని 15 శాతం సీట్లతోపాటు కేంద్ర, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ఈఎస్‌ఐసీ, ఏఎఫ్‌ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ మెడికల్‌ కాలేజీల్లో సీట్లకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌(డీజీసీఏ) కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. డీజీసీఏ సూచనల మేరకు అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా 85శాతం సీట్లకు రాష్ట్రాల స్థాయిలో భర్తీ చేపడతారు. వారం రోజుల్లో నీట్‌ తెలంగాణ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో కలిపి మొత్తంగా 8,340 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపాయి. 

చదవండి: NEET UG 2022 Cutoff: నీట్‌ నిరాశ పరిచినా.. మరెన్నో మార్గాలు!!

మార్కులు అవే అయినా.. ర్యాంకులు తగ్గి.. 

తెలుగు విద్యార్థులకు టాప్‌ ర్యాంకర్లతో సమానంగా మార్కులు వచ్చినా, పలు అంశాలతో తక్కువ ర్యాంకులను కేటాయించారు. జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకర్‌ మార్కులు 715కాగా.. 15వ ర్యాంకు సాధించిన రఘురామరెడ్డి మార్కులు కూడా 715 కావడం గమనార్హం. అలాగే జాతీయస్థాయి 27వ ర్యాంకర్‌ నుంచి 49వ ర్యాంకర్‌ జాగృతి వరకు అందరికీ 710 మార్కులే. 

చదవండి: MBBS: ఎంబీబీఎస్‌కు తొమ్మిదేళ్లే చాన్స్‌... ఒక్క ప‌రీక్ష ఫెయిలైనా మ‌ళ్లీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో కూర్చోవాల్సిందే..!

ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చేస్తా.. 
మాది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తోటాడా గ్రామం. నాన్న, అమ్మ ఇద్దరూ టీచర్లే. జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలవడం
సంతోషంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతా. 
– బోర వరుణ్‌ చక్రవర్తి, 1వ ర్యాంకర్‌  

అమ్మానాన్నల ప్రోత్సాహంతో.. 
ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చేయాలని అనుకుంటున్నాను. మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. 
అమ్మానాన్న ఇద్దరూ వైద్యులే. ఇప్పుడు నేనూ వైద్యుడిని కాబోతుండటం సంతోషంగా ఉంది. 
– రఘురామరెడ్డి, 15వ ర్యాంకర్‌ 

డాక్టర్‌ కావాలన్నది కోరిక 
నేను డాక్టర్‌ కావాలని పదో తరగతిలో ఉన్నప్పుడే అనుకున్నాను. అదే లక్ష్యంతో కష్టపడ్డాను. మా నాన్న అమెరికాలో ఇంజనీర్‌. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ, ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించా. 
– జాగృతి, 49వ ర్యాంకర్‌ 

Published date : 14 Jun 2023 03:09PM

Photo Stories