Skip to main content

17 Medical Colleges Construction: వైద్య విద్యకు మహర్దశ

సాక్షి ఎడ్యుకేష‌న్ : కనీవినీ ఎరుగని రీతిలో ఏకకాలంలో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టడం సంచలనమని వైఎస్సార్‌ సీపీ ఉభయగోదావరి జిల్లాల వైద్య విభాగ సమన్వయకర్త, కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు యనమదల మురళీకృష్ణ అన్నారు.
17 Medical Colleges Construction in AP
17 Medical Colleges Construction in AP

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వైద్య విద్యకు మహర్దశ పట్టిందని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి కొత్తగా నిర్మిస్తున్న వాటిలోని ఐదు కళాశాలలలో 750 ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చిందని అన్నారు. కేంద్ర వైద్య మండలి నిబంధనలను అనుసరించి పదిహేను శాతం సీట్లు సెంట్రల్‌ పూల్‌కి కేటాయించాల్సి ఉందని, అయితే రాష్ట్ర విద్యార్థులు ఈ సీట్లు పొందడంలో ముందు వరుసలో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు మంగళగిరి ఎయిమ్స్‌ తప్ప ఒక్క వైద్య కళాశాలను తీసుకురాలేకపోయారని గుర్తు చేశారు. అది కూడా విభజన హామీలలో వచ్చిందే తప్ప బాబు చేసిన కృషి ఏమీ లేదన్నారు.

BC and OBC Scholarships 2023: బీసీ, ఈబీసీ సంచార జాతుల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ప్రస్తుతం నూతన వైద్య కళాశాల రాకతో 375 ఎంబీబీఎస్‌ సీట్లు రూ.17 వేల వార్షిక ఫీజుతో భర్తీ కానున్నాయని, ఇది సామాన్యులకు అనుకూలించే అంశమని గుర్తు చేశారు. అలాగే ఎంబీబీఎస్‌ మొదటి ఏడాదిలో బోధించే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల బోధనకు అవసరమైన అన్ని వసతుల ఏర్పాటుకు నూతన భవనాల నిర్మాణంలో ఇంజినీరింగ్‌ ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. రెండవ ఏడాది నుంచి క్లినికల్స్‌ మొదలవుతాయని, అప్పుడు మాత్రమే అనుబంధ వైద్య శాలల అవసరం ఉంటుందని డాక్టర్‌ మురళీకృష్ణ అన్నారు. ఇన్ని అనుకూలతల మధ్య ప్రతికూలతలు వెదుకుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించడం ఓ వర్గం మీడియాకు పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల సమీకరణ కోసం సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ సీట్ల కేటాయింపు వైద్య విద్య ప్రారంభం నుంచి ఉన్నదేనని తెలిపారు. కేవలం రూ.17 వేల వార్షిక మొత్తానికి కేటాయించే ప్రయోజనాలను వదిలేసి 375 సీట్లకు అధిక ఫీజులంటూ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు.
 

Published date : 24 Jul 2023 04:05PM

Photo Stories