Skip to main content

సీఏ.. ఆసక్తితో అభ్యసిస్తే సులువే

‘చార్టర్డ్ అకౌంటెన్సీ క్లిష్టమని.. ఎంత చదివినా ఉత్తీర్ణత కష్టమనే అభిప్రాయాలన్నీ కేవలం అపోహలే. ఆసక్తితో అభ్యసిస్తే చార్టర్డ్ అకౌంటెన్సీలో ఫస్ట్ అటెంప్ట్‌లోనే సులభంగా ఉత్తీర్ణత సాధించవచ్చు’ అని అంటున్నారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎం.దేవరాజరెడ్డి. ఈ నేపథ్యంలో ఐసీఏఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న తొలి తెలుగు వ్యక్తి (హైదరాబాద్) ఎం.దేవరాజరెడ్డితో గెస్ట్ కాలమ్..
ఇంటర్‌తోనే.. సీఏ
ఇంటర్మీడియెట్ అర్హతతో సీఏ కోర్సులో చేరొచ్చు. ఈ వయసులో నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్లిష్టం అనే భావన వదిలి ఆసక్తితో ముందడుగు వేస్తే సీఏలో విజయం సాధించడం సులువే! ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్‌లకు మాదిరిగానే సీఏ కోర్సు శిక్షణ కూడా కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటర్‌తోపాటు సీఏకు కోచింగ్ ఇస్తున్నాయి. కానీ వీటి వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం కొంత మేరకే ఉంటుంది. ఇలాంటి క్లాస్ రూం తరహా శిక్షణ వల్ల సీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం వీలవుతుందే తప్ప ప్రాక్టికల్ నైపుణ్యాలు అలవడవు.

నిరంతర మార్పులు అవసరమే
సీఏ కోర్సులో నిరంతరం మార్పులు చేయడం అవసరమే. ప్రభుత్వాలు వ్యాపార, వాణిజ్య పరంగా తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న పథకాలు, చట్టాలపై సీఏలకు అవగాహన అవసరం. ఎందుకంటే.. చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది దేశ సామాజిక-ఆర్థిక ప్రగతికి దోహదపడే అంశాల్లో ఒకటి. తాజాగా సీఏ సిలబస్‌లో మార్పులపై కసరత్తు జరుగుతోంది. ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది మే నుంచి అమలు చేసే వీలుంది.

ఆహ్వానించదగ్గ పరిణామం
గత ఐదారేళ్లుగా చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) కోర్సు పట్ల అవగాహన, ఆదరణ పెరుగుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. మరింత మందిని సీఏ కోర్సువైపు అడుగులు వేసేలా ప్రోత్సహించాలి. ఎందుకంటే మానవ వనరుల పరంగా సీఏ విభాగంలో డిమాండ్-సప్లయ్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది.

ఆర్టికల్‌షిప్‌తో ప్రాక్టికల్ నైపుణ్యాలు
సీఏ కోర్సులో రాణించేందుకు ఆర్టికల్‌షిప్ తప్పనిసరి. మూడేళ్ల వ్యవధిలో గుర్తింపు పొందిన చార్టర్డ్‌అకౌంటెంట్ వద్ద విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆర్టికల్‌షిప్ సర్టిఫికెట్ ఉంటేనే ఫైనల్ పరీక్షలకు అనుమతి లభిస్తుంది. విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించడం, జాబ్‌రెడీ స్కిల్స్ అందించడమే ఆర్టికల్‌షిప్ ప్రధాన ఉద్దేశం. సీఏ చాప్టర్లలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తున్నాం. పలు జాతీయ, అంతర్జాతీయ ఫైనాన్స్ అండ్ కన్సల్టింగ్ సంస్థలు సైతం పాల్గొంటున్నాయి. రూ.18 లక్షల వార్షిక వేతనం లభించిన సందర్భాలు సైతం ఉన్నాయి.

అప్‌డేట్ అవటం చాలా ముఖ్యం
సీఏ ఔత్సాహిక విద్యారులతోపాటు ఇప్పటికే ఈ వృత్తిలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారు నైపుణ్యాల పరంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవడం ఎంతో ముఖ్యం. కేవలం థియరిటికల్ అప్రోచ్‌తో రాణించడం చాలా కష్టం. కాబట్టి విద్యార్థులైనా, ప్రాక్టీసింగ్ సీఏలైనా, ఉద్యోగులైనా తమ నాలెడ్జ్‌ను నిరంతరం అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు సాగాలి. సీఏ చాప్టర్లు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే సెమినార్లు, వర్క్‌షాప్‌లకు హాజరవడం ఎంతో మేలు చేస్తుంది. ఎప్పటికప్పుడు ప్రాక్టికల్‌గా.. అప్‌డేటెడ్ నాలెడ్జ్‌తో ముందుకు సాగితే సహజంగానే ఉజ్వల కెరీర్‌కు వేదికగా ఉన్న సీఏలో మరింత వెలుగులీనొచ్చు.
Published date : 23 Jun 2016 05:25PM

Photo Stories