Skip to main content

‘లా’ తో కార్పొరేట్ అవకాశాలు

న్యాయశాస్త్రం అభ్యసిస్తే నల్లకోటు ధరించే న్యాయవాదిగా మాత్రమే ఉపాధి లభిస్తుంది అనేది గతం. నేటి కార్పొరేట్ ప్రపంచంలో న్యాయశాస్త్రం అభ్యసించిన వారికి బహుముఖ అవకాశాలు సొంతమవుతున్నాయి అంటున్నారు.. ప్రతిష్టాత్మక కాలిఫోర్నియా యూనివర్సిటీ- బర్క్‌లీ స్కూల్ ఆఫ్ లా కొత్త డీన్.. ఇండియన్ - అమెరికన్ న్యాయశాస్త్ర నిపుణులు సుజిత్ చౌదరి. కంపేరిటివ్ కాన్‌స్టిట్యూషన్ లా లో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ లా సిసిలియా గొయెట్జ్ ప్రొఫెసర్ ఆఫ్ లాగా విధులు నిర్వర్తిస్తున్నారు. జూలై 1 నుంచి కాలిఫోర్నియా యూనివర్సిటీ- బర్క్‌లీ స్కూల్ ఆఫ్ లా డీన్‌గా బాధ్యతలు చేపట్టనున్న సుజిత్ చౌదరితో ప్రత్యేక ఇంటర్వ్యూ...

బర్క్‌లీ లా స్కూల్ డీన్‌గా ఎంపికవడంపై మీ అనుభూతి?
Chukaniబర్క్‌లీ లా స్కూల్ డీన్‌గా ఎంపికవడం జీవితకాల సాఫల్యంగా భావిస్తున్నాను. గతంలో ఎన్నో యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించినప్పటికీ.. కొత్త బాధ్యతలు గొప్ప ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బర్క్‌లీ లా స్కూల్‌లోని సాంస్కృతిక వైవిధ్యం, కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చే విధంగా అక్కడి ప్రొఫెసర్లు, విద్యార్థులు నిరంతరం చేపట్టే ప్రయోగాలు వంటి వాటిలో భాగస్వామిని కానుండటం చాలా సంతోషాన్ని ఇస్తోంది.

న్యాయశాస్త్ర విభాగంలో గతంలో ఎన్నో విధులు విజయవంతంగా చేపట్టిన మీరు బర్క్‌లీ లా స్కూల్ డీన్‌గా ఎలాంటి ప్రణాళికలు అనుసరించనున్నారు?
ఆధునిక యుగంలో ఎలాంటి లా స్కూల్ అయినా గొప్ప సంస్థగా అంతర్జాతీయ గుర్తింపు పొందాలంటే.. విద్యార్థులు, నిపుణుల దృష్టిలో మంచి పేరు గడించాలి. నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా నిలవాలి. అలాంటి గుర్తింపు లభించేలా అవసరమైన చర్యలు తీసుకుంటాను. ముఖ్యంగా పరిశోధన, ప్రయోగాత్మక విద్య, విధానాలపై నిపుణులను సమీకృతం చేసి ఒక బృందంగా ఏర్పరిచి మరింత నాణ్యమైన న్యాయ విద్యను అందించడమే నా ప్రధాన లక్ష్యాలు.

ప్రస్తుత న్యాయ విద్య విధానంపై మీ అభిప్రాయం?
ప్రస్తుతం న్యాయ విద్యకు ప్రాధాన్యం దినదిన ప్రవర్థమానం అవుతోంది. కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో న్యాయ విద్యలో సంస్కరణలు చేపట్టాలి. న్యాయ విద్యకు సంబంధించి చట్టాలు మారిన వెంటనే కరిక్యులంలో మార్పులు, చేర్పులు చేస్తున్నప్పటికీ.. విద్యార్థుల్లో ప్రయోగాత్మకత లోపిస్తోంది. కేస్ అనాలిసిస్, రియల్ టైం ఎక్స్‌పోజర్‌పై దృష్టి సారించాలి.

విదేశాల్లో ‘లా’ విద్యపై భారతీయ విద్యార్థుల్లో ఆశించిన మేర అవగాహన ఉండట్లేదు. అదే విధంగా విదేశీ విద్య అనగానే.. ఎంఎస్, మేనేజ్‌మెంట్ వంటివే అనే కోణంలో ఆలోచిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
ఇది కొంతమేర వాస్తవమే. విద్యార్థులకు విదేశాల్లో లా దిశగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దీన్ని గుర్తించాలి. ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌ల ద్వారా ఈ సమాచారం పొందొచ్చు. అమెరికాను పరిగణనలోకి తీసుకుంటే.. అన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు ఎంఎస్, మేనేజ్‌మెంట్ అనే కాకుండా.. అన్ని కోర్సుల్లోనూ అవకాశాలు కల్పిస్తున్నాయి. దాదాపు ప్రతి యూనివర్సిటీ కల్చరల్ డైవర్సిటీ, గ్లోబల్ ఆపర్చునిటీస్ పేరుతో విదేశీ విద్యార్థులకు కూడా పెద్దపీట వేస్తున్నాయి. అందుకే 2010- 2012 మధ్య కాలంలో అమెరికాలో విదేశీ విద్యార్థుల సంఖ్య ఆరు శాతం పెరిగింది. అందుబాటులోని అవకాశాల విషయంలో అవగాహన లేని కారణంగానే విదేశీ విద్య ద్వారా ‘లా’ కష్టం అనే అభిప్రాయం భారతీయ విద్యార్థుల్లో నెలకొంది.

న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యకు గల అవకాశాలు?
లా విద్యార్థులు చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుతో అకడెమిక్స్‌కు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. పీజీలో తమ స్పెషలైజేషన్‌కు అనుగుణంగా పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకుంటే కెరీర్ ఉన్నతంగా ఉంటుంది.

పోటీ ప్రపంచంలో పీజీ స్థాయిలో క్రేజీ స్పెషలైజేషన్స్?
న్యాయవిద్యలో సంప్రదాయ ధోరణులతోపాటు ఆధునిక అంశాలు తోడవుతున్నాయి. కేవలం న్యాయవాదులుగా న్యాయస్థానాలకే పరిమితమయ్యే పరిస్థితుల నుంచి బహుళ అవకాశాల దిశగా విస్తరిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో బహుళ జాతి సంస్థల్లో, అంతర్జాతీయ కన్సల్టెన్సీల్లో స్థిరమైన వేతనంతో కూడిన ఉపాధి లభిస్తోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే.. కార్పొరేట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ క్రేజీ స్పెషలైజేషన్స్‌గా పేర్కొనొచ్చు. అయితే స్పెషలైజేషన్‌ను ఎంచుకునే విషయంలో విద్యార్థులు తమ ఆసక్తి మేరకు అడుగులు వేయాలి.

స్వయం ఉపాధి.. స్థిరమైన వేతనం.. మీ అభిప్రాయంలో కెరీర్ పరంగా ఏది మంచిది?
న్యాయశాస్త్రానికి సంబంధించి నిర్దిష్టంగా ఒక మార్గమే విజయవంతమైన కెరీర్‌కు దోహదం చేస్తుందని చెప్పలేం. ఇది కూడా ఆయా విద్యార్థుల అభిరుచి మేరకు ఉంటుంది. వాక్పటిమ, కలివిడితనం ఉంటే న్యాయవాదిగా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. అదే స్థిరమైన ఉపాధి, వేతనం కోరుకునే వారికి కూడా కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి.

‘లా’ ఔత్సాహిక విద్యార్థులకు మీరిచ్చే సలహా?
కష్టించే తత్వం, సంప్రదింపులు జరిపే నేర్పు, సృజనాత్మక ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటివి ‘లా’లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రధానంగా అవసరమైన లక్షణాలు. వీటిని సహజ ఆసక్తులుగా మలచుకుంటే.. ఈ రంగంలో బహుముఖ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
Published date : 09 Jun 2014 06:15PM

Photo Stories