Skip to main content

భౌతికశాస్త్రం.. విశ్వవ్యాప్త అవకాశాల హారం!

అమెరికాలో బోధన విభాగంలో అత్యున్నత అవార్డు.. రాబర్ట్ ఫాస్టర్ చెర్రీ అవార్డ్ ఫర్ గ్రేట్ టీచింగ్. బేలర్ యూనివర్సిటీ అందించే ఈ అవార్డుకు ఎంపికైతే 2.5 లక్షల అమెరికన్ డాలర్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. మీరాచంద్రశేఖర్.. యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి (కొలంబియా)లో ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్. ఫిజిక్స్ బోధనలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ప్రసిద్ధ ప్రొఫెసర్లలో ఒకరు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే.. ఫిజిక్స్‌పై ఆసక్తి పెంచుకుని.. అదేవిభాగంలో బోధనలో అడుగుపెట్టి అత్యున్నత శిఖరాలు అధిరోహించిన మహిళ. ఫిజిక్స్ బోధనలో ఆమె కృషికి గుర్తింపుగా రాబర్ట్ ఫాస్టర్ చెర్రీ అవార్డ్ ఫర్ గ్రేట్ టీచింగ్ వరించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మీరా చంద్రశేఖర్‌తోపత్యేక ఇంటర్వ్యూ...

రాబర్ట్ ఫాస్టర్ చెర్రీ అవార్డుకు ఎంపికైనట్లు తెలిసి ఎలాంటి అనుభూతిని పొందారు?
వాస్తవంగా చెప్పాలంటే.. ఇన్నేళ్ల బోధన అనుభవం ఉన్నప్పటికీ.. రాబర్డ్ ఫాస్టర్ చెర్రీ అవార్డుకు ఎంపికయ్యానంటే తొలుత నమ్మలేకపోయాను. ఎంతో క్లిష్టమైన ఎంపిక ప్రక్రియలో అన్ని దశలు దాటుకుని తుది విజేతగా నిలవడం చిరస్మరణీయం. ఫిజిక్స్ బోధన లో నా కృషికి లభించిన గుర్తింపుగా దీన్ని భావిస్తున్నాను.

గతంలోనూ మీరు పలు అవార్డులు అందుకున్నారు. మీకు బాగా ఆనందాన్ని కలిగించిన అవార్డు ఏది?
నా కెరీర్‌లో తొలిసారిగా 1987లో లభించిన ‘పర్పుల్ చాక్ అవార్డు’ ఎప్పటికీ గుర్తుంటుంది. కారణం.. కెరీర్‌లో తొలిసారిగా లభించిన అవార్డు కావడం. దాంతోపాటు విద్యార్థుల నుంచి స్వీకరించే నామినేషన్ల ఆధారంగా విజేతలను ఎంపిక చేసే అవార్డు అది. ఈ అవార్డు లభించిందంటే.. విద్యార్థులకు నా బోధన నచ్చినట్లే! పర్పుల్ చాక్ అవార్డు అందుకోవడం నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.

విద్యార్థులు, పరిశోధకులతోపాటు అందరూ క్లిష్టంగా భావించే ఫిజిక్స్‌పై మీకు ఆసక్తి కలగడానికి కారణం?
చిన్నతనంలో నిజ జీవితంలో కనిపించే భౌతికశాస్త్ర సంబంధ సంఘటనలే నాలో ఫిజిక్స్‌పై ఆసక్తి కలగడానికి కారణమని చెప్పొచ్చు. ఇంద్రధనస్సు వివిధ రంగుల్లో ఎందుకు కనిపిస్తుంది? భూమికి, సూర్యుడికి మధ్య దూరం ఎందుకు? వంటి ప్రశ్నలు నాలో తలెత్తేవి. పాఠశాల స్థాయిలో నా సందేహాలకు సమాధానాలు లభించలేదు. కానీ కాలేజీలో మా ఫిజిక్స్ అధ్యాపకుడు బోధించిన పాఠాల ద్వారా నా చిన్ననాటి ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. అది ఫిజిక్స్‌పై ఆసక్తిని మరింత పెంచింది. దాంతో ఫిజిక్స్‌లో ఉన్నత విద్యనభ్యసించాలని నిర్ణయించుకున్నాను. ఐఐటీ-మద్రాస్‌లో ఎమ్మెస్సీ పూర్తిచేసి, పీహెచ్‌డీ కోసం అమెరికాకు వచ్చాను. బ్రౌన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశాను. అప్పటినుంచి అమెరికాలోనే ఫిజిక్స్ బోధిస్తున్నాను. రీసెర్చ్ స్కాలర్‌కు బోధన అనేది ఎంతో ఆసక్తిని, ఆనందాన్ని కలిగించే అంశం. దీనివల్ల నిరంతర అధ్యయనం, అదేవిధంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అందుకే టీచింగ్‌వైపు దృష్టి సారించాను.

ఫిజిక్స్‌లో కెరీర్ అవకాశాలు ఎలా ఉండనున్నాయి?
భౌతికశాస్త్రం.. విశ్వవ్యాప్త అవకాశాల హారం. భూగర్భం మొదలు.. అంతరిక్షం వరకూ ఎన్నో అన్వేషణలకు మూలం.. భౌతిక శాస్త్ర అంశాలే. అంతేకాకుండా ఫిజిక్స్ విభాగంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే ఫలానా విభాగం కీలకం అని నిర్దిష్టంగా చెప్పలేం. క్వాంటమ్ మెకానిక్స్ నుంచి ఆర్గానిక్ మెటీరియల్స్ వరకు అన్నీ ముఖ్యమైనవే. ఈ పరిశోధనలు భవిష్యత్తులోనూ కొనసాగడం ఖాయం. కాబట్టి ఈ రంగంలో కెరీర్ గురించి సందేహాలు అనవసరం.

పరిశోధనల పరంగా ఇన్ని అవకాశాలున్నప్పటికీ నేటి యువత సెన్సైస్‌పై పెద్దగా ఆసక్తి చూపకపోవడానికి కారణం?
ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యే. దీనికి సులువైన పరిష్కారాలు లేవు. కారణం.. యువత ఇన్‌స్టంట్ కెరీర్ సెటిల్‌మెంట్ కోణంలో ఆలోచిస్తూ.. అందుకు సరితూగే కోర్సులనే ఎంచుకుంటోంది. దీంతో ప్యూర్ సెన్సైస్‌లో అభ్యర్థుల కొరత అంతటా వేధిస్తోంది. దీనికి అకడెమిక్స్ స్థాయిలోనే పరిష్కారం చూపాలి. విద్యార్థుల్లో ఆసక్తి కలిగే విధంగా బోధన సాగించాలి. ఫిజిక్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి.. వారిని మరింత ముందుకు తీసుకెళ్లేలా బోధించాలి. యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ దీనికి మరో చక్కటి పరిష్కారం. ముఖ్యంగా ప్రపంచంలో జనాభాలో రెండో పెద్ద దేశంగా ఉన్న భారత్ ఈ విషయంలో మరింత దృష్టి సారించాలి.

సైన్స్ విభాగాల్లో మహిళలు రాణించడం చాలా కష్టం అనే వాదనపై మీ అభిప్రాయం?
ఇది అపోహ మాత్రమే. అందుకు నేనే నిదర్శనం. 1968లో మైసూర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాక ఫిజిక్స్‌లో ఉన్నత విద్యనభ్యసించాలని భావించాను. అందుకు అనుగుణంగానే ఐఐటీ-మద్రాస్‌లో ఎమ్మెస్సీలో అడుగుపెట్టాను. అయితే మహిళల కెరీర్ ఎంపికలో తల్లిదండ్రులు, కుటుంబం ప్రోత్సాహం కీలకం. ఈ విషయంలో నాకు ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదు. నాన్న ఆర్మీ ఉద్యోగి కావడంతో ప్రోత్సహించారు. ఏం చదువుతానన్నా, ఎక్కడ చదువుతానన్నా.. ఏ మాత్రం అడ్డు చెప్పలేదు. అందుకే ప్రస్తుతం నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. తల్లిదండ్రులు అందరూ ఇదే రీతిలో ఆలోచించాలి. తమ పిల్లలను కుటుంబం అనే చట్రంలో బంధించకుండా వారి ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహించాలి. అమ్మాయిలు కూడా ఇతరులపై ఆధారపడే స్వభావాన్ని విడనాడాలి. దాంతోపాటు బహుళ సంస్కృతుల వాతావరణంలో ఎలాంటి వ్యక్తుల మధ్యనైనా పనిచేయగల ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకోవాలి. భారత్‌లో నేటికీ ఈ రెండూ అంశాలే మహిళల ఉన్నతికి అడ్డంకులుగా ఉన్నాయి. చాలామంది విద్యార్థినులు ‘మేల్ మెంటార్స్’ నుంచి సహకారం పొందేందుకు బిడియపడుతున్నారు. తమ ప్రొఫెసర్లు లేదా సీనియర్లు మహిళలై ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచనలు వీడితే సైన్స్ అనే కాదు.. ఏ రంగంలోనైనా మహిళలు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు.

బోధన విభాగం, ఇతర జాబ్స్.. ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి?
ఇది ఆయా విద్యార్థుల ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. టీచింగ్ విభాగానికి సహనం, నిరంతర పరిశీలన ముఖ్యంగా కావాల్సిన లక్షణాలు. ఇతర జాబ్స్‌లో ఈ విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు ఏ కెరీర్‌ను ఎంచుకోవాలో నిర్ణయించుకోవడం మంచిది. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన సూత్రం.. ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కష్టపడటం ఒక్కటే మార్గం (హార్డ్ వర్క్ ఓన్లీ లీడ్స్ టు బెస్ట్ పొజిషన్స్).

ఫిజిక్స్ ఔత్సాహిక విద్యార్థులకు మీరిచ్చే సలహా?
ఇతర సబ్జెక్ట్‌లతో పోల్చితే ఫిజిక్స్ కాస్త క్లిష్టమైందే. యాంత్రికంగా చదివితే ఏదో ఒక దశలో నిరుత్సాహానికి గురవుతారు. కాబట్టి.. నిరంతర పరిశీలన, అధ్యయనం వంటి లక్షణాలతో ఫిజిక్స్‌పై పట్టు సాధించొచ్చు. ఆసక్తిని పెంపొందించుకోవచ్చు.
Published date : 29 Apr 2014 12:27PM

Photo Stories