Skip to main content

ఆలోచనలకు అందలం.. అవకాశాలు పదిలం

స్వయం ఉపాధి దిశగా ఆలోచించే యువతకు ఎన్నో ప్రోత్సాహకాలు, అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. అమెరికా నుంచి ఆసియాలోని చిన్న దేశాల వరకు అంతటా స్టార్టప్ కంపెనీల సంస్కృతి పెరుగుతోంది. మన దేశంలోనూ గడిచిన అయిదారేళ్ల కాలంలో ఈ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఔత్సాహిక యువతకు ఇదే మంచి సమయం.

అకడమిక్ స్థాయి నుంచే..
ఇటీవల కాలంలో స్టార్టప్స్‌కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు అకడమిక్ స్థాయిలో ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సుల ద్వారా అభ్యర్థుల ఆలోచనలను సరైన దిశలో కార్యాచరణలో పెట్టేందుకు మార్గనిర్దేశాలు లభిస్తాయి. స్టార్టప్ ఆలోచన నుంచి ఆచరణ వరకు అనుసరించాల్సిన విధానాలు తెలియజేస్తాయి.

ఇంక్యుబేషన్ సెంటర్ల తోడ్పాటు:
ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న అభ్యర్థులు తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి వ్యాపారం ప్రారంభించేందుకు అందులోని బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఉపయోగపడతాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు ఎన్నో తమ ప్రాంగణాల్లోనే వీటిని నెలకొల్పుతున్నాయి. ఔత్సాహికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. కోర్సు పూర్తయ్యాక తమ ఐడియాలను ఆచరణలో పెట్టేందుకు అవసరమైన నిధుల అన్వేషణకు సమయం వృథా చేసుకోకుండా ఇవి కలిసొస్తాయి. ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ల ఇంక్యుబేషన్ సెంటర్లకు కంపెనీలు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు వస్తుంటారు. వారిని ఆకర్షించే విధంగా వ్యవహరిస్తే ఎంతో మేలు కలుగుతుంది.

ఐడియాలు ఉంటే..
చక్కటి ఐడియాలు ఉంటే ఆర్థికపరమైన అంశాల గురించి స్టార్టప్ ఔత్సాహికులు ఆందోళన చెందక్కర్లేదు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి వ్యక్తుల వరకు వెంచర్ క్యాపిటల్ పేరుతో స్టార్టప్ ఔత్సాహికులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకొస్తున్నారు. అందువల్ల ‘మంచి ఐడియా ఉన్నా అమలు చేయలేకపోతున్నాను’ అనే భావన అవసరం లేదు.

సామాజిక అవసరాలు తీర్చేవైతే:
స్టార్టప్ ఐడియాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. సామాజిక అవసరాలు తీర్చేవైతే మరింత త్వరగా ప్రోత్సాహకాలు అందుకునే అవకాశం లభిస్తుంది. ఉత్పత్తి, సేవలకు సంబంధించి వీలైనంత త్వరగా మార్కెట్లోకి వెళ్లే విధంగా స్టార్టప్‌లు ఉంటే అవకాశాలు పెరుగుతాయి. ఎన్నో ఏళ్లు పరిశోధనలు చేసిన తర్వాత ఇచ్చే ప్రొడక్షన్ సంబంధిత ఐడియాలను ఆర్ అండ్ డీ సంబంధిత రంగంలోని కంపెనీలు ప్రోత్సహిస్తాయి.

డేటా అనలిటిక్స్.. డిమాండింగ్ ఏరియా:
బిగ్ డేటా అనలిటిక్స్, బిగ్ డేటా మేనేజ్‌మెంట్‌లు కెరీర్ పరంగా ఎంతో డిమాండ్ కలిగినవి. విస్తృతంగా ఏర్పాటవుతున్న సంస్థలు, వాటి మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఉత్పత్తి డిజైన్ నుంచి చివరగా వినియోగదారుల వరకు అనేక రకాల అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటికి మార్గం బిగ్ డేటా అనలిటిక్స్. ఒక సెగ్మెంట్‌లోని వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు.. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తులకు ఉన్న ఆదరణ/సమస్య.. ఇలా అన్ని కోణాల్లో సమాచారాన్ని విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీనికి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఆపరేషన్స్ రీసెర్చ్‌లో భాగంగానే ఈ విభాగం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక కోర్సుగా రూపొందిందంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆర్ అండ్ డీ దిశగా..
ఆర్ అండ్ డీ ఔత్సాహికులు స్పష్టమైన లక్ష్యంతో ఈ దిశగా అడుగులు వేయాలి. అకడమిక్ అర్హతలు సరితూగుతున్నాయనో లేదా పీహెచ్‌డీ చేస్తే అవకాశాలు లభిస్తాయనే భావనతో పీహెచ్‌డీలో ప్రవేశించకూడదు. తాము చేసే పరిశోధన భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే విధంగా చూసుకోవాలి. ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ రంగంలో పరిశోధనలు వాటి ద్వారా చేసే ఆవిష్కరణలు కూడా సామాజిక అవసరాలు తీర్చేవే.!!
- ప్రొ॥యు.దినేశ్ కుమార్, క్వాలిటేటివ్ మెథడ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెంటర్ హెడ్, ఐఐఎం-బి.
Published date : 19 Sep 2015 12:31PM

Photo Stories