Skip to main content

TS High Court: ‘ఓఎంఆర్‌’పై హాల్‌టికెట్‌ నంబర్లు, ఫొటోలు ఎందుకు లేవు: హైకోర్టు ప్రశ్నల వర్షం

TS High Court Serious On TSPSC Over Security Measures for Group-1 Exam

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌–1 పరీక్ష నిర్వహణపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నిర్వహణ సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ ఎందుకు తీసుకోలేదని.. ఓఎంఆర్‌ షీట్లపై హాల్‌టికెట్‌ నంబర్, అభ్యర్థుల ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ జూలైకి వాయిదా వేసింది. 

ఈ నెల 11న టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్‌పీఎస్సీని ఆదేశించాలంటూ గ్రూప్‌–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ పి.మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ విషయంలోనూ పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.  

చ‌ద‌వండి: TSPSC: ఏఎంవీఐ అభ్యర్థుల హాల్‌టికెట్లు సిద్ధం.. ఈసారి పరీక్ష ఇలా!!

ఇప్పుడెందుకు చర్యలు చేపట్టలేదు.. 
టీఎస్‌పీఎస్సీ తరఫున స్టాండింగ్‌ కౌన్సెల్‌ ఎం.రాంగోపాల్‌ వాదనలు వినిపించారు. బయోమెట్రిక్‌ విధానం కోసం రూ. కోటిన్నర వరకు ఖర్చు అవుతుందన్నారు. అలాగే దాదాపు 10 లక్షల హాల్‌టికెట్లపై నంబర్, ఫొటోలను ముద్రించడానికి కూడా రూ. కోట్లలో వెచ్చించాల్సి వస్తుందన్నారు. పరీక్షకు హాజరుకాని వారి విషయంలోనూ ఈ చర్యలు చేపట్టాల్సి వస్తుందని.. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని చెప్పా రు. అభ్యర్థి చూపించిన ఆధార్, పాన్, ఓటర్‌ కార్టు లాంటి గుర్తింపు కార్డులను ఇన్విజిలేటర్‌ ధ్రువీకరించాకే పరీక్షకు అనుమతించారని చెప్పారు. 

పరీక్ష సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలన్నది టీఎస్‌పీఎస్సీ విచక్షణాధికారమన్నారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 3.8 లక్షల మంది అభ్యర్థు లు హాజరయ్యారని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. 2022 అక్టోబర్‌లో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నిర్వహించే సమయంలో అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకొని.. ఈ నెల 11న మా త్రం ప్రజాధనం వృథా అవుతుందని చర్యలు తీసుకోలేదని చెప్పడం సరికాదని పేర్కొంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం టీఎస్‌పీఎస్సీ బాధ్యత అని, నగదు గురించి ప్రస్తావన అవసరం లేనిదని వ్యాఖ్యానించింది.  

Published date : 23 Jun 2023 06:40PM

Photo Stories